వన్యప్రాణుల రక్షణలో ప్రపంచానికి భారత్ దిక్సూచి : గవర్నర్  శివ్ ప్రతాప్  శుక్లా

వన్యప్రాణుల రక్షణలో ప్రపంచానికి భారత్ దిక్సూచి : గవర్నర్  శివ్ ప్రతాప్  శుక్లా

హైదరాబాద్, వెలుగు : ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న పెద్దపులులు, ఇతర పులిజాతి జంతువుల సంరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమని పలు దేశాల ప్రతినిధులు ఆకాంక్షించారు.  సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నెహ్రూ జూలాజికల్  పార్క్  వేదికగా అటవీ శాఖ, భారత విదేశాంగ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘షేర్డ్ స్ట్రైప్స్ – షేర్డ్ ఫ్యూచర్’ అనే అంశంపై అంతర్జాతీయ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్  నిర్వహించారు.

అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ)లో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో పులుల సంరక్షణకు సంబంధించిన సవాళ్లు, పరిష్కారాలపై మేధోమథనం సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్  శివ్ ప్రతాప్  శుక్లా మాట్లాడుతూ.. వన్యప్రాణుల పరిరక్షణలో భారత్  ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్’ ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తోందని కొనియాడారు.

ప్రాజెక్ట్  టైగర్, ప్రాజెక్ట్  చీతా వంటి విజయవంతమైన కార్యక్రమాలు దేశ ప్రతిష్టను పెంచాయని, భారతీయ సంస్కృతిలో వన్యప్రాణుల సంరక్షణ అంతర్భాగమని  పేర్కొన్నారు. మంత్రి  కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణకు, జీవ వైవిధ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్  టైగర్  రిజర్వులలో పులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పీసీసీఎఫ్​ సువర్ణ మాట్లాడుతూ మానవ-, వన్యప్రాణి ఘర్షణలను నివారించేందుకు అత్యాధునిక సాంకేతికతను జోడించాలని పేర్కొన్నారు. 

భారత్ లో జీవవైవిధ్యం అద్భుతం

ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌  సమావేశంలో మలేషియా, రష్యా, శ్రీలంక, థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌, అమెరికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాల గురించి వివరించారు. శాస్త్రీయ పర్యవేక్షణ వల్ల తమ దేశంలో పులుల సంఖ్య 200కు చేరుకుందని థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్  ప్రతినిధి తెలిపారు. మంచు ప్రాంతాల్లో అమూర్  పులుల సంరక్షణలో ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను రష్యా ప్రతినిధి వివరించారు. చిరుతల సంరక్షణలో అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని శ్రీలంక ప్రతినిధి పేర్కొన్నారు.

భారత్‌‌‌‌‌‌‌‌లోని జీవవైవిధ్యం అద్భుతమని, కజిరంగా పార్క్ సందర్శన తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని యూఎస్  కాన్సుల్  జనరల్  లారా విలియమ్స్ అన్నారు. వైల్డ్​ లైఫ్​ పీసీసీఎఫ్ వినయ్ కుమార్, రీజినల్  పాస్ పోర్ట్  ఆఫీసర్  స్నేహజ, అటవీ శాఖ ఉన్నతాధికారులు  రత్నాకర్  జౌహారీ, సునీత భగవత్, ప్రియాంక వర్గీస్, జూ డైరెక్టర్  సునీల్  హిరేమఠ్  తదితరులు పాల్గొన్నారు. 

రెండు పులి పిల్లలను దత్తత తీసుకున్న గవర్నర్

రాష్ట్ర గవర్నర్  శివ్ ప్రతాప్  శుక్లా రెండు పులిపిల్లలను దత్తత తీసుకున్నారు. 9 నెలల వయసు కలిగిన ఇషాన్ అనే మగపులి పిల్లతో పాటు వన్యా అనే ఆడపులి పిల్లను గవర్నర్  దత్తత తీసుకున్నారు. ఈ రెండు పులిపిల్లలు 2025 జులై 30న జన్మించాయి. వీటి తల్లిదండ్రులు ప్రభాస్, మాల అనే పులులు. ఈ రెండు పులి పిల్లలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవలే నామకరణం చేశారు.