న్యూఢిల్లీ: దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నడుస్తుంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని మోదీ ‘పార్లే మెలోడీ’ టాఫీ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, ఈ విషయమై ‘ఎక్స్’ వేదికగా హిందీలో ఒక పోస్ట్ చేశారు. ‘‘ఇది నాయకత్వం కాదు.. కేవలం ఒక గిమ్మిక్ (ప్రజాకర్షణ స్టంట్)’’ అని మండిపడ్డారు. దేశంలో రైతులు, కార్మికులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు కన్నీరు పెడుతుంటే.. ప్రధానమంత్రి మాత్రం అక్కడ నవ్వుతూ రీల్స్ చేసుకుంటున్నారని, దీనికి బీజేపీ నేతలు చప్పట్లు కొడుతున్నారని విమర్శించారు. ‘‘మన నెత్తిన ఆర్థిక తుఫాను పొంచి ఉంది, కానీ మన ప్రధాని మాత్రం ఇటలీలో క్యాండీలు పంచడంలో బిజీగా ఉన్నారు” అని ఎద్దేవా చేశారు.
