సూర్యకు డూ ఆర్ డై మ్యాచ్..ఆడకుంటే అంతే సంగతులు

సూర్యకు డూ ఆర్ డై మ్యాచ్..ఆడకుంటే అంతే సంగతులు

టెస్టు సిరీస్ను గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ పై కన్నేసింది. తొలి వన్డేలో గెలిచిన భారత్..ఆస్ట్రేలియా చేతిలో రెండో వన్డేలో ఓడటంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు వన్డే సిరీస్ను దక్కించుకోనుండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే టెస్టు సిరీస్ను గెలిచిన రోహిత్ సేన..వన్డే సిరీస్ను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో మూడో వన్డేలో పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. 

బౌలింగ్ లో  మార్పు..

మూడో వన్డేలో టీమిండియా పెద్దగా మార్పులు లేకుండా బరిలోకి దిగే ఛాన్సుంది. అయితే చెన్నై  పిచ్ స్పిన్ అనుకూలంగా ఉండే అవకాశాలున్న తరుణంలో  లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. సుందర్ను తుది జట్టులోకి తీసుకుంటే అక్షర్ పటేల్పై వేటు వేయొచ్చు.  ఈ మ్యాచ్లోనూ  కుల్దీప్ యాదవ్ను కొనసాగించే అవకాశం ఉంది.  పేసర్లుగా  షమీ,  సిరాజ్ బరిలోకి దిగుతారు. ఒక వేళ షమీకి రెస్ట్ ఇస్తే అతని స్థానంలో జయదేవ్ ఉనద్కట్, ఉమ్రాన్ మాలిక్‌లో ఒకరు తుది జట్టులో చాన్స్ దక్కించుకుంటారు. 

SKYకి ఉద్వాసన..!

టీ20 స్పెషలిస్టుగా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్..ఈ సిరీస్ లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో అతనిపై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే రెండో వన్డే తర్వాత సూర్య వైఫల్యంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అతనికి మరో అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చాడు.  శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని వస్తే తప్ప అతనిపై వేటు వేసే ఛాన్సు లేదు. 

బ్యాటింగ్‌లో చెలరేగాల్సిందే..

తొలి రెండు వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో చివరి వన్డేలో అయినా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ మ్యాచులో రోహిత్ శర్మకు జోడిగా  శుభ్‌మన్ గిల్  ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ ఇద్దరూ మంచి శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. విశాఖలో రాణించిన కోహ్లీ..చెన్నైలోనూ చెలరేగితే ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. ఇక సూర్యకుమార్ యాదవ్ కు ఇదే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఈ వన్డేలో కనుక అతను రాణించకుంటే కష్టమే. మరోవైపు కేఎల్ రాహుల్ తన ఫాంను కొనసాగించాల్సి ఉంది. అయితే హార్దిక్ పాండ్యా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. రవీంద్ర జడేజా సత్తా చాటితే భారత్ విజయం పక్కా. 

భారత్ తుది జట్టు ..అంచనా మాత్రమే..

రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), జడేజా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్,  షమీ/ఉమ్రాన్ మాలిక్, సిరాజ్