ఇండియా అస్సలు తగ్గట్లే.. ట్రేడ్ చర్చలపై మొండిగా ఉంది: అమెరికా ఆర్థిక మంత్రి కామెంట్లు

ఇండియా అస్సలు తగ్గట్లే.. ట్రేడ్ చర్చలపై మొండిగా ఉంది: అమెరికా ఆర్థిక మంత్రి కామెంట్లు

న్యూయార్క్: వాణిజ్య చర్చల విషయంలో ఇండియా మొండిగా వ్యవహరిస్తున్నదని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్.. 50 శాతం టారిఫ్‎లు విధించినా ఇండియా అస్సలు  తగ్గడం లేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇండియాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆయా దేశాలపై విధించిన టారిఫ్‏ల విషయంలో అక్టోబర్ చివరి నాటికి ఓ క్లారిటీ వస్తుందన్నారు. 

కాగా, ఇండియా, పాకిస్తాన్‎తో సంబంధాలు బాగున్నాయని, వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. పాకిస్తాన్ సైనిక నాయకత్వంతో ట్రంప్ జరుపుతున్న చర్చలతో ప్రధాని మోదీతో ఉన్న సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. మరోవైపు బలూచిస్తాన్‌‌‌‌ లిబరేషన్‌‌‌‌ ఆర్మీ (బీఎల్‌‌‌‌ఏ), మజీద్‌‌‌‌ బ్రిగేడ్‌‌‌‌లను ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌‌‌‌టీఓ)గా ప్రకటించిన అమెరికా.. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లను అణచివేయడంలో పాక్ విజయం సాధించిందని ప్రశంసించింది. 

ఉగ్ర ముప్పును ఎదుర్కోవడంపై పాక్‎తో చర్చించినట్లు తెలిపింది. కాగా, ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్తాన్ ఉపయోగించిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌‌‌‌లను కూల్చేశామంటూ ఇటీవల భారత్ చేసిన కామెంట్లపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వాన్నే అడిగి తెలుసుకోవాలంటూ ‘ఎన్డీటీవీ’ అడిగిన ఓ ప్రశ్నకు రిప్లై ఇచ్చింది.