న్యూఢిల్లీ: చైనాలో మెడిసిన్ చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త అడ్వైజరీని జారీ చేసింది. అక్కడ చదివే టైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి అందులో వివరించింది. అధికారిక లెక్కల ప్రకారం 23 వేల మంది ఇండియన్ స్టూడెంట్లు చైనా వర్సిటీల్లో చదవడానికి నమోదు చేసుకున్నారు. 2020లో చైనాలో కరోనా ప్రబలిన తర్వాత వేల మంది మన దేశ విద్యార్థులు స్వదేశానికి వచ్చారు. ఆపై చైనా వీసా ఆంక్షలతో రెండేళ్లుగా ఇక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడిప్పుడే కొవిడ్ వీసా ఆంక్షలను చైనా సడలిస్తోంది. వివిధ దేశాల్లో చిక్కుకున్న స్టూడెంట్లకు పరిమిత సంఖ్యలో వీసాలు జారీ చేస్తున్నది. అయితే, చైనా, ఇండియా మధ్య ఇంకా డైరెక్ట్ ఫ్లైట్స్ స్టార్ట్ కాకపోవడంతో మన స్టూడెంట్లు ఇక్కడే ఉండిపోయారు. ఈలోగానే చైనా మెడికల్ కాలేజీలు ఎన్రోల్మెంట్ ప్రాసెస్‌ను ప్రారంభించాయి. దీంతో చైనాలో మెడిసిన్ చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్ల కోసం బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీని జారీ చేసింది.
ఎఫ్ఎంజీలో మనోళ్లు 16% మందే పాస్
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన ఇండియన్లు మన దేశంలో ప్రాక్టీస్ చేయాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) టెస్టులో పాస్ కావాల్సి ఉంటుంది. 2015 నుంచి 2021 మధ్య ఎఫ్ఎంజీ టెస్టుకు 40,417 మంది హాజరుకాగా 6,387 మందే (16 శాతమే) పాసయ్యారు. వారందరూ చైనాలోని 45 అక్రెడిటెడ్ యూనివర్సిటీల్లో చదివారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం కేంద్రం అడ్వైజరీని రిలీజ్ చేసింది. ‘‘వివిధ వర్సిటీల్లో ఫీజులు భిన్నంగా ఉంటాయి. అడ్మిషన్‌కు ముందు స్టూడెంట్లు ఈ విషయాన్ని గమనించాలి. చైనా అక్రెడిటెడ్ వర్సిటీల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలి. డిగ్రీ పూర్తిచేసిన దేశంలోనే స్టూడెంట్లు లైసెన్స్ తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక విద్యార్థులు చైనీస్ మెడికల్ క్వాలిఫికేషన్ఎగ్జామ్ను క్లియర్ చేయాలి. ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే విద్యార్థులు అర్హత పరీక్షలో పాస్ కావాలె. చైనా నుంచి మెడికల్ క్వాలిఫికేషన్ పొందాలనుకునేవారు నీట్ యూజీ ఎగ్జామ్‌ను క్లియర్ చేయాలి” అని కేంద్రం పేర్కొంది.
