వెహికల్స్​ క్రాష్​ టెస్టింగ్​ కోసం... భారత్​ ఎన్​క్యాప్​ లాంఛ్

వెహికల్స్​ క్రాష్​ టెస్టింగ్​ కోసం... భారత్​ ఎన్​క్యాప్​ లాంఛ్

న్యూఢిల్లీ:  రోడ్​ సేఫ్టీ స్టాండర్డ్స్​ను బలోపేతం చేసే దిశలో దేశంలోనే మొదటిసారిగా వెహికల్​క్రాష్​ టెస్టింగ్​ ప్రోగ్రామ్​ భారత్​ ఎన్​క్యాప్​ను మంగళవారం కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ లాంఛ్​ చేశారు. 3.5 టన్నుల మోటార్​ వెహికల్స్​ను ఇక్కడ టెస్ట్​ చేసేందుకు వీలుంటుంది. వెహికల్స్​లో  రోడ్​ సేఫ్టీ ఫీచర్లు పెంచడం అటు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి, ఇటు సమాజానికి కూడా చాలా ముఖ్యమని గడ్కరీ ఈ సందర్భంగా చెప్పారు. అందరు స్టేక్​హోల్డర్లను దృష్టిలో ఉంచుకునే ఈ భారత్​ ఎన్​క్యాప్​ (న్యూ కార్​ ఎసెస్​మెంట్​ప్రోగ్రామ్​) రూపొందించినట్లు వెల్లడించారు. దేశంలో రోడ్​ యాక్సిడెంట్లు, ఎయిర్​ పొల్యూషన్​ ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏటా  5 లక్షల   యాక్సిడెంట్ల కారణంగా   1.50 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. 

వెహికల్స్​లో సేఫ్టీ స్టాండర్డ్స్​ మెరుగుపరిచే లక్ష్యంతో సొంత క్రాష్​ టెస్టింగ్​ ప్రోగ్రామ్ భారత్​ ఎన్​క్యాప్​ను తెచ్చినట్లు పేర్కొన్నారు. అక్టోబర్​1, 2023 నుంచి భారత్​ ఎన్​క్యాప్​ అమలులోకి రానుంది. ఆటోమోటివ్​ ఇండస్ట్రీ స్టాండర్డ్​ (ఏఐఎస్​) 197 ప్రకారం తమ వెహికల్స్​ను టెస్ట్​ చేయమని కార్ల తయారీ కంపెనీలు స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్​ కింద  కోరవచ్చని చెప్పారు. టెస్టులలో కార్ పెర్​ఫార్మెన్స్​ ఆధారంగా 0 నుంచి 5 మధ్యలో స్టార్​ రేటింగ్స్​ను ఇస్తారు. దీంతో ఆయా కార్లలో  సేఫ్టీ ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. రేటింగ్​ ఆధారంగా కొనుగోలు నిర్ణయం తీసుకోవచ్చు. సేఫ్టీతో కూడిన కార్లకు డిమాండ్​ పెరుగుతుందని అంచనాలున్న నేపథ్యంలో కస్టమర్ల అవసరాలను మాన్యుఫాక్చరర్లు అందుకోవాల్సి ఉంటుందని రోడ్​, ట్రాన్స్​పోర్ట్​అండ్​ హైవేస్​ మంత్రిత్వ శాఖ ఒక స్టేట్​మెంట్లో తెలిపింది.

సహకరిస్తామంటున్న ఆటో మొబైల్​ కంపెనీలు

దేశంలోనే మొదటిసారిగా క్రాష్​ టెస్టింగ్​ప్రోగ్రామ్​ భారత్​ ఎన్​క్యాప్​ను లాంఛ్ చేయడం పట్ల ఆటోమొబైల్​ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. వెహికల్​ సేఫ్టీ ప్రమాణాలు పెరగడానికి ఈ చొరవ వీలు కల్పిస్తుందని పేర్కొంది. భారత్​ఎన్​క్యాప్​ కింద టెస్టింగ్​ కోసం తమ మూడు వెహికల్స్​ను మొదటి లాట్​లోనే పంపనున్నట్లు మార్కెట్​ లీడర్​ మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది. మరోవైపు హ్యుండై, మహీంద్రా అండ్​ మహీంద్రా కంపెనీలు కూడా ప్రోగ్రామ్​కు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. ఇండియాలో లాంఛ్​ చేసే ప్రతి కారు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. 

ఎక్కువ భద్రత కోరుకునే కన్జూమర్లకు భారత్​ ఎన్​క్యాప్​ మేలు చేకూరుస్తుంది.  అలాగే,  ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు తెచ్చే మాన్యుఫాక్చరర్లు కూడా తమ వెహికల్స్​లోని ఆ అదనపు ఫీచర్లను తెలియచేయడానికి ఈ ప్రోగ్రామ్​ కింద ఇచ్చే స్టార్​ రేటింగ్​ సాయపడుతుందని మారుతి సుజుకి ఇండియా కార్పొరేట్​ ఎఫెయిర్స్​ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్​ రాహుల్​ భార్తి చెప్పారు. భారత్​ ఎన్​క్యాప్​ను స్వాగతిస్తున్నట్లు హ్యుండై మోటార్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ ఎన్​సూ కిమ్​ చెప్పారు. 

వెహికల్స్​ ప్రమాణాలు పెరగడానికి ఇది అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. తమ వెహికల్స్​ అన్నింటినీ అత్యున్నత ప్రమాణాలతో అందించడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. కస్టమర్లలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు భారత్​ ఎన్​క్యాప్​ ప్రోగ్రామ్​వీలు కల్పిస్తుందని సొసైటీ ఆఫ్​ ఇండియన్​ ఆటోమొబైల్​ మాన్యుఫాక్చరర్స్​ (సియామ్​)  ప్రెసిడెంట్​ వినోద్​ అగర్వాల్​ చెప్పారు.