ఉత్కంఠ పోరులో పాక్ విజయం

ఉత్కంఠ పోరులో పాక్ విజయం

దుబాయి: ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత్  పోరాడి ఓడింది. ఆసియా కప్ లో భాగంగా ఇవాళ జరిగిన T20 మ్యాచ్ లో బౌలర్లు చేతులెత్తేయడంతో పాక్ చేతిలో ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఇంకో బాల్ మిగిలుండగానే పూర్తి చేసిన పాక్... సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సిరీస్ లో తాము తలపడ్డ రెండు మ్యాచుల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ చెరో మ్యాచ్ లో గెలిచాయి. టాస్ నెగ్గిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ బౌలింగ్ ఎంచుకుని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. భారత్ లో కీలక ఆటగాడైన రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్ కి స్థానం కల్పించారు. సీనియర్ బ్యాట్స్ మెన్ దినేశ్ కార్తిక్ ప్లేస్ లో దీపక్ హుడాకు అవకాశం కల్పించారు.

శుభారంభాన్నిచ్చిన భారత ఓపెనర్లు

ఇక.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారత్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్కోర్ 54 వద్ద  రోహిత్ శర్మ (28) రూపంలో భారత్ తన మొదటి వికెట్ ను కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు. అయితే 36 పరుగుల తేడాతో ఇండియా స్కోర్ 62 వద్ద కేఎల్ రాహుల్ (28), 91 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ (13) వికెట్లను భారత్ నష్టపోయింది. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన పంత్ 14 పరుగులు మాత్రమే చేయగా... హార్దిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడా 14 బంతుల్లో 16 పరుగులు చేసి నసీం షా బౌలింగ్ లో ఔటయ్యాడు.  ఇన్నింగ్స్ 173 రన్స్ వద్ద కోహ్లీ (60) వికెట్ ను భారత్ కోల్పోయింది. ఇక అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రవి బిష్ణోయి 2 బంతుల్లో 8 పరుగులు రాబట్టడంతో 181 పరుగులతో భారత్ భారీ స్కోర్ చేసింది.

అయితే పాక్ తరపున మహహ్మద్ రిజ్వాన్ (71), మహమ్మద్ నవాజ్ (42) చెలరేగి ఆడటంతో పాక్ సూపర్ విజయాన్ని అందుకుంది. భారత్ తరపున బౌలింగ్ చేసిన భువనేశ్వర్, అర్షీద్ సింగ్, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర అహ్మద్ తలో వికెట్ తీశారు. ఇక పాక్ బౌలర్లు నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్, హరీశ్ రావుఫ్, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టగా... షాదాబ్ ఖాన్ 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 

దంచికొట్టిన పాక్ ఆటగాళ్లు

182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన  పాకిస్థాన్.. 22 వద్ద బాబర్ (14), 63 రన్స్ ఫకర్ జమాన్  (15) రూపంలో మొదటి రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ గా బరిలోకి దిగిన మహమ్మద్ రిజ్వాన్... 51 బంతుల్లో 71 పరుగులతో దుమ్ములేపాడు. అనంతరం వచ్చిన మహమ్మద్ నవాజ్ కేవలం 20 బంతుల్లోనే 42 పరుగులతో పాక్ స్కోర్ ను పరుగులెత్తించాడు. ఇన్నింగ్స్ చివరిలో బ్యాటింగ్ కు దిగిన కుష్దీల్ షా (14), అసిఫ్ అలీ (16) బాధ్యతయుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంకో బంతి మిగిలుండగానే పాక్ విజయం సాధించింది. 

కోహ్లీ శ్రమ వృధా...

ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 44 బంతుల్లో 60 పరుగులు చేసి విమర్శకులు నోళ్లు మూయించాడు.  అయితే ఇన్నింగ్స్ 53 వరకు ఒక్క వికెట్ కూడా పడని భారత్ ఇన్నింగ్స్... 36 పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ వైపు ఒక్కొక్కరుగా భారత్ ఆటగాళ్లు పెవిలియన్ పెవిలియన్ బాట పడుతోంటే... కోహ్లీ ఏమాత్రం టెన్షన్ పడకుండా 4 ఫోర్లు, ఒక సిక్స్ తో దుమ్ము లేపాడు. చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచాడు. దీంతో భారత్ మొత్తం 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.