2030 నాటికి 35 వేల కోట్ల వాణిజ్యం.. భారత్, న్యూజిలాండ్ ‘వ్యూహాత్మక’ ద్వైపాక్షిక బంధం రెట్టింపు

2030 నాటికి 35 వేల కోట్ల వాణిజ్యం.. భారత్, న్యూజిలాండ్ ‘వ్యూహాత్మక’ ద్వైపాక్షిక బంధం రెట్టింపు
  • ఇరు దేశాల ప్రధానులు మోదీ-లక్సన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందాలు
  • 10 అగ్రిమెంట్లు.. 3 అత్యంత కీలక రక్షణ ఒప్పందాలపై సంతకాలు
  • ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రత్యేక ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్’
  • హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ మెడిసిన్, అథ్లెట్ల అభివృద్ధి కోసం ఉమ్మడి కార్యాచరణ
  • మోదీకి ఆక్లాండ్‌‌‌‌‌‌‌‌లో ఘన స్వాగతం.. ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌‌‌‌‌‌‌‌తో భేటీ
  • ఫ్రీ ట్రేడ్‌‌‌‌‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ను త్వరితగతిన అమలు చేయాలని నిర్ణయం
  • భారత్-న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ ‘వాకా’ ఒక కొత్త ప్రయాణానికి సిద్ధమైంది: ప్రధాని మోదీ

అక్లాండ్: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య దౌత్య బంధం సరికొత్త శిఖరానికి చేరింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ‘స్ట్రాటజిక్ పార్ట్‌‌నర్‌‌షిప్’ స్థాయికి పెంచుతూ ఇరు దేశాలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలే లక్ష్యంగా, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా రక్షణ, వాణిజ్య రంగాల్లో సరికొత్త అధ్యాయానికి ఇరు దేశాలు శ్రీకారం చుట్టాయి.

3 దేశాల పర్యటనలో భాగంగా ఆఖరి విడతగా న్యూజిలాండ్‌‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్లాండ్‌‌లో ఘనస్వాగతం లభించింది. శనివారం న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌‌తో ప్రధాని మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చలు అత్యంత ఫలప్రదంగా ముగిశాయి. ఈ భేటీలో ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపు రూ. 18వేల కోట్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని.. 2030 నాటికి రెట్టింపు చేసి రూ. 35వేల కోట్లకు (7 బిలియన్ న్యూజిలాండ్ డాలర్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీంతో పాటు రాబోయే 15 ఏండ్లలో భారత్‌‌లో 20 బిలియన్ డాలర్ల ( 1.90 లక్షల కోట్లు ) పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ సుముఖత వ్యక్తం చేసింది. ఇటీవల కుదిరిన ఫ్రీ ట్రేడ్‌‌ అగ్రిమెంట్‌‌ త్వరితగతిన అమలు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఇటీవల చైనా జరిపిన సబ్‌‌మెరైన్ లాంచ్డ్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షల నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతర్జాతీయ చట్టాలు, ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని మోదీ, లక్సన్ స్పష్టం చేశారు. అలాగే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యూఎన్‌‌ఎస్‌‌సీ) భారత్‌‌కు శాశ్వత సభ్యత్వం లభించాలనే డిమాండ్‌‌కు న్యూజిలాండ్ మరోసారి పూర్తి మద్దతు ప్రకటించింది. ఉగ్రవాద నిధుల సరఫరాను అడ్డుకోవాలని, ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబించాలని ఇరు దేశాల ప్రధానులు పిలుపునిచ్చారు.

ఇండో- పసిఫిక్‌‌లో శాంతే ధ్యేయం: మోదీ
దైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. సాగర తీరాలు కలిగిన భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య బంధం బలోపేతం కావడం ఇండో–-పసిఫిక్ ప్రాంతానికి సరికొత్త శక్తిని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ప్రజాస్వామ్య విలువలపై ఉన్న నమ్మకమే మనల్ని సహజ భాగస్వాములుగా నిలబెట్టింది. మన పరస్పర సహకారం ప్రాంతీయ శాంతికి, ప్రపంచ సంక్షేమానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది” అని అన్నారు.

అవకాశాల మహాసముద్రం
హాట్‌‌ స్పాట్‌‌గా మారిన ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి ఇరు దేశాల ముందు ‘అవకాశాల మహాసముద్రం’ వేచి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ  పేర్కొన్నారు. అక్లాండ్‌‌లోని ‘స్పార్క్ అరేనా’లో జరిగిన ఒక భారీ కార్యక్రమంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి పీఎం మోదీ ప్రసంగించారు.

‘‘శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలను ఏకం చేస్తున్న ఒక పదం.. ‘వాకా’. ఈ రోజు భారత్–-న్యూజిలాండ్‌‌ల ‘వాకా’ ఒక కొత్త ప్రయాణానికి సిద్ధమైంది. మన ముందు అవకాశాలతో నిండిన మహాసముద్రం ఉంది” అని వ్యాఖ్యానించారు. న్యూజిలాండ్‌‌లో భారతీయ సంస్కృతి, ప్రజల ప్రభావం ఉన్నదని, అక్కడ కొన్ని ప్రాంతాల పేర్లు భారత నగరాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు.

భారత్‌‌కు మోదీ తిరుగు పయనం
మూడు దేశాల టూర్‌‌‌‌లో భాగంగా చివరిగా న్యూజిలాండ్‌‌లో రెండు రోజుల పాటు పర్యటించిన  మోదీ శనివారం స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మోదీ జరిపిన పర్యటన శనివారంతో ముగిసింది. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా వచ్చి ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు.

10 ఒప్పందాలు
ఇరు దేశాల చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన ప్రకారం.. మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు రాగా..అందులో 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. రాబోయే 4 ఏండ్లపాటు ఇరు దేశాల సంబంధాల విస్తరణకు స్పష్టమైన ‘రోడ్‌‌మ్యాప్’ను సిద్ధం చేశారు.

హైడ్రోగ్రాఫిక్ డేటా షేరింగ్, పరస్పర నావికాదళ లాజిస్టిక్స్ సదుపాయాలు, ఇండో-పసిఫిక్‌‌లో మెరుగైన నౌకాదళ సహకారంలాంటి 3 అత్యంత కీలక రక్షణ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రత్యేక ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్’, క్రీడారంగంలో పరస్పర సహకారం, అథ్లెట్ల అభివృద్ధి కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు.