
- 2027–28 కి చేరుకుంటామన్న సీఈఏ అనంత నాగేశ్వరన్
- యూఎస్ టారిఫ్స్‌తో కొన్ని సెక్టార్లకు మేలు
- లాంగ్ టెర్మ్ కోసం సంక్షేమాలు అవసరం
- ఎకానమీ ఐదు పెద్ద సమస్యలను అధిగమించాలి
న్యూఢిల్లీ: ఇండియా ఆర్థిక వ్యవస్థ ఇంకో రెండున్నరేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేస్తుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ గురువారం పేర్కొన్నారు. 2030–31 నాటికి 6.8 ట్రిలియన్ డాలర్లను టచ్ చేయగలదని అన్నారు. ప్రపంచంలో జియోపొలిటికల్ గొడవలు, ట్రేడ్ వార్ ఉన్నప్పటికీ ఈ మైలురాయిని అందుకుంటామని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. యూఎస్ టారిఫ్స్ వల్ల కొన్ని సెక్టార్స్ లాభపడతాయని, ఇండియన్ బిజినెస్‌లకు కొత్త అవకాశాలు దొరుకుతాయని వివరించారు. ఇండియా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో ఐదు పెద్ద ఇబ్బందులను అధిగమించాలని ఆయన గుర్తు చేశారు. అవి..
గ్లోబల్‌గా మెషిన్స్, ఆటోమేషన్ కోసం క్యాపిటల్-ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే గ్రోత్ మోడల్ నడుస్తోంది. ఇండియాలో చవకగా లేబర్ అందుబాటులో ఉంది. ఈ రెండింటికి మధ్య సరిపోలడం లేదు. దీనివల్ల జాబ్స్ క్రియేట్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తక్కువ రేటుకే కరెంట్ అందుబాటులో ఉండడం ముఖ్యం. ప్రస్తుతం ఇండియా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతోంది. ఎనర్జీ ట్రాన్సిషన్‌కు అయ్యే బ్యాకప్ ఖర్చులను మర్చిపోకూడదు.
ఇండియా క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి కుటుంబాల సేవింగ్స్, ఆదాయాలు నిలకడగా పెరగాల్సిన అవసరం ఉంది. డొమెస్టిక్ రిసోర్సెస్‌ను వాడుకోవడం చాలా ముఖ్యం.
ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతూ, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్స్ లేకుండా గ్రోత్ సాధ్యం కాదని నాగేశ్వరన్ అన్నారు. ‘‘నిజాయితీగా ఆదాయాన్ని పంచుకోవాలి. క్యాపిటల్–-లేబర్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్‌ప్లేస్ కల్చర్ మెరుగవ్వాలి. ఉద్యోగుల బాగోగులను పట్టించుకోవాలి. ప్రైవేట్ సెక్టార్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి”అని పిలుపిచ్చారు.
ఏఐ గురించి మాట్లాడుతూ, ఏఐ, రోబోటిక్స్ వలన సర్వీసెస్ సెక్టార్‌లో జాబ్స్ ప్రమాదంలో పడతాయని అంచనావేశారు. దీంతో ఇండియా సర్వీసెస్ సెక్టార్‌కు ఉన్న అడ్వాంటేజ్ పోవచ్చని అన్నారు. కీలకమైన మినరల్స్ కోసం ఇండియా ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్నారు. ‘‘రూపాయి బాగా వీక్ అవుతుందని ఆందోళన పడొద్దు. కరెన్సీ నిలకడగా ఉంటుంది. ఫ్యూచర్‌లో గ్లోబల్ ట్రేడ్ విధానాల్లో పెద్ద మార్పులు ఉంటాయి. రానున్న 10–-15 ఏళ్లలో సప్లై చెయిన్‌ను మెరుగుపరుచుకోవడం కీలకంగా మారుతుంది. ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ప్రపంచం కనీసం రెండు బ్లాక్స్‌గా విడిపోతుంది”అని నాగేశ్వరన్ వివరించారు. షార్ట్-టర్మ్ అనిశ్చితులపై టెన్షన్ పడొద్దని, లాంగ్-టర్మ్ కోసం వ్యవస్థీకృతమైన సంక్షేమాలను తీసుకురావాలని సలహా ఇచ్చారు.
యూఎస్ ఎకానమీలో మనది సగం
యూఎస్ ఆర్థిక వ్యవస్థలో ఇండియా ఆర్థిక వ్యవస్థ సగం కంటే ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ వైస్ -చైర్మన్ సుమన్ బెరీ గురువారం పేర్కొన్నారు. భారత ఎకానమీ సైజ్ పర్చేసింగ్ పవర్ పారిటీ (పీపీపీ) టర్మ్స్‌లో ఇప్పటికే
15 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇది యూఎస్ ఎకానమీ సైజ్ 29 ట్రిలియన్ డాలర్లలో సగం కంటే ఎక్కువని వివరించారు. సాధారణంగా ఒకే ప్రొడక్ట్ ధర వేరు వేరు దేశాల్లో వేరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక మీల్ కాస్ట్ ఇండియాలో ఒక డాలర్ (రూ.86) ఉంటే, యూఎస్‌లో 10 డాలర్లు ఉంటుంది.
కానీ, దీని ప్రొడక్షన్ వాల్యూని జీడీపీ టర్మ్స్‌లో ఒక డాలర్‌గానే పరిగణిస్తారు. అదే పీపీపీ టర్మ్స్‌లో యూఎస్‌లో ఎంత రేటుకు దొరుకుతుందో ఆ రేటుతో లెక్కిస్తారు. అంటే ఇండియాలో దొరికే ఒక మీల్ కాస్ట్ కూడా 10 డాలర్లుగా పరిగణిస్తారు. ఫలితంగా పీపీపీ మోడల్‌లో ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. “మనం నాలుగో అతిపెద్ద ఎకానమీ అని పేపర్స్‌లో వస్తోంది. అవన్నీ మార్కెట్ ధరలలో లెక్కించినవి. కానీ నిజంగా ప్రొడక్టివిటీని లెక్కించడానికి పీపీపీ సరైన మార్గం. మార్కెట్ ధరలో మన జీడీపీ 4 ట్రిలియన్ డాలర్స్, కానీ పీపీపీ టర్మ్స్‌లో మనం 15 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ” అని సీఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్‌లో బెరీ పేర్కొన్నారు.