
- డబ్ల్యూటీఓ రూల్స్ కింద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాం..పట్టించుకోని ట్రంప్ సర్కార్
- నష్టానికి సమానంగా ప్రతీకార సుంకాలు వేసే ఆలోచనలో ఇండియా
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా ఇండియా కూడా సుంకాలు వేయడానికి రెడీ అయ్యింది. కొన్ని అమెరికన్ వస్తువులపై ప్రతీకార టారిఫ్‌లను పరిశీలిస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జులై 31న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25శాతం టారిఫ్ వేశారు. రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు మరో 25 శాతం టారిఫ్‌ను వేస్తామని ప్రకటించారు. అమెరికా వస్తువులపై ఇండియా టారిఫ్ వేస్తే, ఇదే మొదటి అధికారిక ప్రతీకార టారిఫ్‌గా నిలుస్తుంది. ఇప్పటివరకు వాణిజ్య చర్చలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. వరల్ట్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) నుంచి ఒత్తిడి పెంచినా, అమెరికా పట్టించుకోలేదు. దీంతో ప్రతీకార సుంకాలను వేసే హక్కు ఇండియాకు ఉంది.
వాణిజ్య యుద్ధం ప్రారంభమైందిలా..
స్టీల్, అల్యూమినియంకు సంబంధించిన వివాదం ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ గవర్నమెంట్ వేసిన 25శాతం టారిఫ్ వలన మొదలైంది. జూన్‌లో ఈ నెంబర్‌ను 50 శాతానికి యూఎస్ రెట్టింపు చేసింది. దీంతో 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు నష్టపోనున్నాయి. డబ్ల్యూటీఓ రూల్స్‌కు వ్యతిరేకంగా అమెరికా సుంకాలు వేస్తోందని ఇండియా ఆరోపిస్తోంది. వాణిజ్య చర్చలకు అమెరికా ముందుకు రావడం లేదు కూడా. డబ్ల్యూటీఓ నిబంధనల కింద ప్రతీకార సుంకాలు వేయడానికి చట్టపరమైన ఆధారాలను సిద్ధం చేసింది. "వాషింగ్టన్ మా ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించడానికి సిద్ధంగా లేదు. దీంతో ప్రతీకార చర్యలు తప్ప వేరే మార్గం లేదు" అని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
ప్రతీకార చర్యలు..
అమెరికా డ్యూటీల వల్ల కలిగిన నష్టానికి సమానంగా కొన్ని అమెరికన్ వస్తువులపై ఇండియా టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. "భారత ఆర్థిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా అన్యాయంగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి" అని ప్రభుత్వ అధికారి తెలిపారు.
వాణిజ్యంలో మార్పులు..
కిందటి ఆర్థిక సంవత్సరంలో, భారత్‌కు 45 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా ఎగుమతి చేయగా, భారత్ 86 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసింది. ప్రతీకార టారిఫ్‌లతో ఈ వాణిజ్య అంతరం మరింత మారొచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు విస్తరించాలని ట్రంప్, ప్రధాని మోదీ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అమెరికా వ్యవసాయం, డెయిరీ వంటి రంగాలలో మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, భారత్ దీనిని తిరస్కరిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఆగిపోయాయి. ఇండియా చేసుకునే రష్యన్ ఆయిల్ దిగుమతులపై అమెరికా విమర్శలు పెంచడంతో ట్రేడ్ డీల్ ముందుకు కదలడం లేదు.
ఆర్థిక సంబంధాలు..
2024–-25లో సేవల రంగంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 83.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన దేశంతో జరిపే సర్వీసెస్ ఎగుమతుల్లో 102 మిలియన్ డాలర్ల మిగులను అమెరికా
పొందుతోంది.
స్పష్టమైన సందేశం
వాణిజ్య చర్చలను పునరుద్ధరించే ఆలోచన లేదని ట్రంప్ ప్రకటించారు. "సమస్య పరిష్కారమయ్యే వరకు చర్చలు మొదలు కావు" అని ఆయన ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో అన్నారు. మరోవైపు అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా రష్యాతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇండియా చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటించనున్నారు. చైనాతో కూడా వాణిజ్య బంధాన్ని మెరుగుపరుచుకునే పనిలో ఉంది. ఈ నెల చివరిలో చైనాలో మోదీ పర్యటించనున్నారు.