
- 9 టార్గెట్లు పహల్గాం ఉగ్రదాడికి భారత్ బద్లా
- ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. 70 మంది టెర్రరిస్టులు హతం
- పాక్, పీవోకేలోని టెర్రర్ క్యాంపులు నేలమట్టం
- బార్డర్ దాటకుండానే భరతంపట్టిన రాఫేల్ ఫైటర్ జెట్లు
- త్రుటిలో తప్పించుకున్న జైషే చీఫ్ మసూద్ అజార్
- అతడి ఫ్యామిలీలోని 10 మందితోపాటు నలుగురు అనుచరులు మృతి
- బార్డర్లో భారీగా కాల్పులకు తెగబడ్డ పాక్
- పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి.. 50 మందికి గాయాలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి, భారత్‌లో నరమేధానికి ఎగదోస్తున్న లష్కరే, జైషే టెర్రరిస్ట్ సంస్థల స్థావరాలను నేలమట్టం చేసింది. పాకిస్తాన్‌లోని టెర్రరిస్టు క్యాంపులపై క్రూయిజ్ మిసైళ్లు, గైడెడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న అతి దారుణంగా 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న పాక్ ఉగ్రమూకలను అంతం చేయడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో మొత్తం 70 మంది టెర్రరిస్టులు హతమవ్వగా, మరో 60 మందికి పైగా ఉగ్రవాదులు గాయపడ్డారు. జైషే మహ్మద్ చీఫ్మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితోపాటు నలుగురు ముఖ్య అనుచరులు కూడా ఈ దాడుల్లో మరణించారు. మసూద్ మాత్రం త్రుటిలో తప్పించుకున్నాడు. అర్ధరాత్రి 1.05 గంటలకు మొదలైన ఈ దాడులు.. 1.30 గంటలకల్లా విజయవంతంగా ముగిశాయి. కేవలం 25 నిమిషాల్లోనే పీవోకేలోని 5, పాకిస్తాన్‌లోని 4 టెర్రర్ క్యాంపులపై 24 కచ్చితమైన దాడులు చేసిన మన బలగాలు ఉగ్రమూకల వెన్నులో వణుకుపుట్టించాయి.
అసలు బార్డర్ కూడా దాటకుండానే.. టెర్రరిస్టుల భరతం పట్టాయి. రఫేల్ ఫైటర్ జెట్ లు మన గగనతలం నుంచే క్రూయిజ్ మిసైళ్లను, గైడెడ్ బాంబులను ప్రయోగించి 100 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సైతం పేల్చివేశాయి. లష్కరే తయిబా, జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్ ను కూడా ధ్వంసం చేశాయి. ఇటు భూతలం నుంచి ఆర్మీ, వాయుసేన టార్గెట్లను పక్కాగా గురి చూసి కొట్టగా.. అటు సముద్రతలం నుంచి నేవీ కూడా రెండు దళాలకు అవసరమైన సహకారం అందించింది.
ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా..
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిందని బుధవారం ఉదయం ఢిల్లీలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఇండియన్ ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పక్కాగా టార్గెట్ చేసి.. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామని వెల్లడించారు. ఇక ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి టార్గెట్లను లాక్ చేసి, పేల్చివేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.
కాగా, టెర్రర్ క్యాంపులపై దాడుల తర్వాత బార్డర్ లో పాక్ బలగాలు రాత్రంతా పెద్ద ఎత్తున కాల్పులు జరిపాయి. మన ఆర్మీ బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. అయితే జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో పాక్ మోర్టార్ షెల్స్ ప్రయోగించడంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 13 మంది పౌరులు చనిపోగా, 50 మంది గాయపడ్డారు.