ఢాకా: టీమిండియా ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రకటించింది. ఈ టూర్‌లో భాగంగా సెప్టెంబర్ 1, 3, 6వ తేదీల్లో మూడు వన్డేలు, అదే నెల 9, 12, 13వ తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుందని శుక్రవారం తెలిపింది. ఇందుకోసం టీమిండియా ఆగస్టు 28న ఢాకా చేరుకోనుంది.
నిజానికి గతేడాది ఆగస్టులో జరగాల్సిన ఈ సిరీస్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో నిరవధికంగా వాయిదా వేసినట్లు గతంలోనే బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఈ సెప్టెంబర్‌లో ప్లాన్ చేసిన తాజా టూర్‌పైనా అనుమానాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం, అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఇండియా టీమ్‌ను పంపేందుకు బీసీసీఐ అంగీకరిస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది.
