- ప్లాన్ ప్రకారం కేజీడీ6 గ్యాస్ ఫీల్డ్‌లో ఉత్పత్తి చేయలేదని విమర్శ
న్యూఢిల్లీ: ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోని రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ పెట్రోలియం ( బీపీ) కంపెనీలు కలిపి 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.67 లక్షల కోట్ల) పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వం వాదిస్తోంది. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కేజీడీ–6 గ్యాస్ ఫీల్డ్స్‌లో అవసరానికి మించి సౌకర్యాలు నిర్మించాయని, తగినంత ఉత్పత్తి చేయలేదని ఆరోపించింది.
రిలయన్స్, ప్రభుత్వానికి మధ్య గత 14 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీనిపై మూడు సభ్యుల ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ నవంబర్ 7న వాదనలు ముగించింది. తీర్పు వచ్చే ఏడాది వెలువడనుంది. ఉత్పత్తి చేయని గ్యాస్ విలువ, అదనపు ఇన్‌స్టాలేషన్ ఖర్చులు, మార్కెటింగ్ మార్జిన్, వడ్డీ మొత్తాలను కలిపి 30 బిలియన్ డాలర్లను ప్రభుత్వం అడుగుతోంది.
రిలయన్స్ 2006లో 8.18 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 31 బావులు తవ్వుతామని చెప్పి, 22 మాత్రమే తవ్వింది. ఇందులో 18 బావుల్లోనే గ్యాస్ ఉత్పత్తి జరిగింది. 2010లో ఉత్పత్తి మొదలవగా, ఇసుక, నీటి అడ్డంకులు ఉండడం వలన 2020లో ఫీల్డ్‌లను మూసివేసింది. ప్రారంభంలో 3.02 బిలియన్ డాలర్లతో ఈ గ్యాస్ ఫీల్డ్‌లను రిలయన్స్– బీపీ డెవలప్ చేశాయి.
కాగా, ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ (పీఎస్‌సీ) ప్రకారం, ఆపరేటర్ (రిలయన్స్) ముందుగా చేసిన అన్ని పెట్టుబడులను తిరిగి పొందే హక్కు కలిగి ఉంటాడు. పెట్టుబడి తిరిగి పొందిన తర్వాత మాత్రమే ప్రభుత్వం లాభాల్లో వాటా పొందుతుంది. ప్రభుత్వం మాత్రం, ఆమోదించిన ప్లాన్‌ను రిలయన్స్ పాటించలేదని ఆరోపిస్తూ, కొన్ని ఖర్చులను (3.02 బిలియన్ డాలర్లను) తిరస్కరించింది. అదనంగా పరిహారాన్ని కోరుతోంది.
