కరోనా రిలీఫ్: ఇండోనేషియాకు 100 టన్నుల ఆక్సిజన్

కరోనా రిలీఫ్: ఇండోనేషియాకు 100 టన్నుల ఆక్సిజన్

జకార్తా: కష్ట సమయంలో మనల్ని ఆదుకున్న మిత్రులను, వాళ్లకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం మిత్ర ధర్మం. ఇప్పుడు సరిగ్గా అదే పనిని భారత సర్కార్ చేసింది. కరోనాసెకండ్ వేవ్‌తో మనం నానా కష్టాలు ఎదుర్కొన్న మే నెలలో ఇండోనేషియా 1,400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌‌లను పంపింది. మన ఆక్సిజన్ కొరతను తీర్చడంలో తన వంతు సాయం చేసింది ఇండోనేషియా ప్రభుత్వం. క్రమంగా మనం ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోవడం, మరోవైపు కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో ఆ సమస్య తీరింది. అయితే నాడు మనం ఎదుర్కొన్న సమస్య ఇప్పుడు ఇండోనేషియా ఫేస్‌ చేస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో సాయంగా భారత ప్రభుత్వం 100 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌తో పాటు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. ఇండియన్ నేవీ షిప్ ఐరావత్‌ ఈ సాయాన్ని శనివారం ఇండోనేషియాకు చేర్చింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. కరోనాపై కలిసి పోరాటం చేస్తున్నామని, 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొన్న ఐదు క్రయోజెనిక్ ట్యాంకులతో ఐఎన్‌ఎస్ ఐరావత్ ఇండోనేషియాకు చేరుకుందని ఆయన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆ షిప్‌ ఈ నెల 19నే అక్కడికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, ప్రయాణంలో ఆలస్యమైందని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఇండోనేషియాలో రోజువారీ కరోనా కేసులు సుమారు 49 వేలకు పైగా వస్తున్నాయి. ఇటీవల కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడంతో అక్కడి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.