న్యూఢిల్లీ: ద్వీప దేశమైన మారిషస్ చమురు భయంతో గజగజలాడుతోంది. తీరంలో వేల టన్నుల చమురు లీక్ అవుతుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దీంతో ఆ దేశ ప్రధాని ప్రవింద్ జగ్‌నాథ్ పర్యావరణ ఎమర్జెన్సీని ప్రకటించారు. జపాన్‌ను చెందిన ఓ నౌక మారిషస్ తీరానికి చేరువలో తక్కువ లోతులో చిక్కుకోవడంతో ఈ సమస్య తలెత్తింది. సదరు నౌకలో 4 వేల టన్నుల చమురు ఉంది. చమురు లీకేజీ క్రమంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మారిషస్‌కు సాయం చేయడానికి ఇండియా ముందుకొచ్చింది.
మారిషస్‌కు 30 టన్నుల టెక్నికల్ ఎక్విప్‌మెంట్‌తోపాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో మెటీరియల్‌ను పంపినట్లు మన విదేశాంగ శాఖ తెలిపింది. చమురును విస్తరించడకుండా చేయడంతోపాటు సాల్వేజ్ ఆపరేషన్స్ కోసం వీటిని ద్వీప దేశానికి పంపినట్లు పేర్కొంది. ‘ఓషియన్ బూమ్స్, రివర్ బూమ్స్, డిస్క్ స్కిమ్మర్స్, హెలి స్కిమ్మర్స్, పవర్ ప్యాక్స్, బ్లోవర్స్, సాల్వేజ్ బార్గ్, ఆయిల్ ఆబ్‌సార్బెంట్ గ్రాఫేన్ ప్యాడ్స్, ప్రత్యేకంగా రూపొందించిన ఆయిల్ స్లిక్, నీళ్ల నుంచి తీసిన స్కిమ్ ఆయిల్‌తో కూడిన స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్‌ను మారిషస్‌కు పంపాం’ అని ఓ ప్రకటనలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ పేర్కొంది. అలాగే పది మంది టెక్నికల్ రెస్పాన్స్ టీమ్‌ను అక్కడకు పంపామని వివరించింది.
