న్యూఢిల్లీ: రెన్యువబుల్ ఎనర్జీ (ఆర్ఈ) ఉత్పత్తిని విపరీతంగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 2030 నాటి క్లీన్ పవర్ లక్ష్యం దిశగా మరింత పురోగతిని సాధించడానికి ప్రయత్నిస్తోంది. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను కేటాయించడానికి ఉపయోగించే వేలం సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని నిర్ణయించింది. 2024 మార్చి వరకు మొత్తం 50 గిగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్ట్‌ల ఇన్‌స్టాలేషన్‌లపై ఒప్పందాలను కుదుర్చుకోవాలని కోరుకుంటోంది. బ్లూమ్‌బర్గ్ ప్రకారం, గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏటా 15 గిగావాట్ల సామర్థ్యం గల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను వేలం వేసింది.
2030 నాటికి 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పాదక సామర్థ్యం టార్గెట్‌ను చేరుకోవడానికి మోడీ ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇన్‌స్టాలేషన్‌లను వేగవంతం చేస్తోంది. వీటిలో హైడ్రో, న్యూక్లియర్ ప్లాంట్లు కూడా ఉంటాయి. భారతదేశంలో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఎక్కువ వడ్డీ రేట్లు, గ్రీన్ సబ్సిడీలను అందించే అభివృద్ధి చెందిన మార్కెట్ల నుంచి పోటీ.. వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కరెంటు కోసం పెరుగుతున్న డిమాండ్ వల్ల రెన్యువబుల్ ఎనర్జీ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మరిన్ని రెన్యువబుల్ ప్రాజెక్ట్‌లను డెలివరీ చేయడానికి, ఇన్‌స్టాలేషన్లకు పెద్ద ఎత్తున భూమి అవసరమని బీఎన్ఈఎఫ్ఎనలిస్ట్ రోహిత్ గాద్రే చెప్పారు. ఉత్పత్తి అయిన కరెంట్ కోసం దీర్ఘకాలిక కొనుగోలుదారులు కూడా కావాలని అన్నారు.
రాష్ట్రాలను ఎంకరేజ్ చేస్తున్న కేంద్రం...
పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్ కారణంగా ఇప్పటికే ఉన్న బొగ్గు ఆధారిత ప్రాజెక్టులతోపాటు కొత్తగా రెన్యువబుల్ ఎనర్జీ ఒప్పందాలను కుదుర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలను కోరుతోంది. వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి ఒప్పందాలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఈ నెల ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు క్వార్టర్లలో 15 గిగావాట్ల కెపాసిటీ కలిగిన రెండు ప్రాజెక్టులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
తర్వాత రెండు క్వార్టర్లలో సుమారు 10 గిగావాట్ల ప్రాజెక్టులను అప్పగించనుంది. ప్రభుత్వ రంగ కరెంట్ సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ లిమిటెడ్, ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ ప్రభుత్వం తరఫున వేలంపాటలు నిర్వహించనున్నాయి. ఈ షెడ్యూల్ డెవలపర్లకు మరిన్ని అవకాశాలను అందిస్తుందని ఇండస్ట్రీ గ్రూప్ అయిన నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం పులిపాక అన్నారు.