ఎగుమతుల్లో స్మార్ట్‌‌‌‌ఫోన్లు టాప్‌‌‌‌.. మొదటిసారిగా పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లు, డైమండ్స్‌‌‌‌ కంటే ఎక్కువ జరిగాయి

ఎగుమతుల్లో స్మార్ట్‌‌‌‌ఫోన్లు టాప్‌‌‌‌.. మొదటిసారిగా పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లు, డైమండ్స్‌‌‌‌ కంటే ఎక్కువ జరిగాయి

న్యూఢిల్లీ: గత మూడేళ్లలో ఇండియా స్మార్ట్‌‌‌‌ఫోన్ ఎక్స్‌‌‌‌పోర్ట్స్ అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్‌‌‌‌కు నాలుగు రెట్లు పెరిగాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ప్రొడక్ట్స్, డైమండ్స్‌‌‌‌ ఎగుమతులను ఫోన్ల ఎగుమతులు అధిగమించాయి. దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్న ప్రొడక్ట్‌‌‌‌లుగా నిలిచాయి. 

ప్రభుత్వ డేటా ప్రకారం,  2024–-25లో స్మార్ట్‌‌‌‌ఫోన్ ఎక్స్‌‌‌‌పోర్ట్స్ ఏడాది లెక్కన 55 శాతం పెరిగి 24.14 బిలియన్ డాలర్ల (రూ.2 లక్షల కోట్ల) కు చేరాయి.  2023–-24లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ 15.57 బిలియన్ డాలర్లు (రూ.1.34 లక్షల కోట్లు) గా,  2022–-23లో 10.96 బిలియన్ డాలర్లు (రూ.94 వేల కోట్లు) గా ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్‌‌‌‌లకు జరిపిన స్మార్ట్‌‌‌‌ఫోన్ ఎగుమతుల్లో భారీగా గ్రోత్ నమోదైంది. 

వేగవంతమైన వృద్ధి

అమెరికాకు స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పోర్ట్స్ 2022-–23లో 2.16 బిలియన్ డాలర్లు ఉండగా,  2023–-24లో 5.57 బిలియన్ డాలర్లకు, 2024-–25లో 10.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. జపాన్‌‌‌‌కు కూడా ఎగుమతులు పెరిగాయి. ఈ దేశానికి 2022–-23లో 120 మిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేయగా,  2024–-25లో 520 మిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు ఎగుమతి అయ్యాయి. "వేగంగా వృద్ధి చెందడంతో,  ఇండియా నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్న ప్రొడక్ట్‌‌‌‌లలో స్మార్ట్‌‌‌‌ఫోన్లు టాప్‌‌‌‌లో నిలిచాయి.

మొదటిసారిగా పెట్రోలియం ప్రొడక్ట్స్, డైమండ్స్ లాంటి ప్రొడక్ట్‌‌‌‌లను అధిగమించాయి" అని కామర్స్ మినిస్ట్రీ  ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. స్మార్ట్‌‌‌‌ఫోన్ ఎగుమతులు గత మూడేళ్లలో  బాగా పెరిగాయని, ఇండియాను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్, ఎక్స్‌‌‌‌పోర్ట్ హబ్‌‌‌‌గా మార్చాయని తెలిపింది.  పీఎల్‌‌‌‌ఐ వంటి స్కీమ్‌‌‌‌ల సపోర్ట్‌‌‌‌తో స్మార్ట్‌‌‌‌ఫోన్ల ఎగుమతులు ఊపందుకున్నాయి.  నెదర్లాండ్స్‌‌‌‌కు స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌  ఎక్స్‌‌‌‌పోర్ట్స్ 2022–-23లో 1.07 బిలియన్ డాలర్లు ఉంటే, 2024–25 లో 2.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇటలీకి జరిగిన ఎగుమతులు 720 మిలియన్ డాలర్ల నుంచి 1.26 బిలియన్ డాలర్లకు, చెక్ రిపబ్లిక్‌‌‌‌కు 650 మిలియన్ డాలర్ల నుంచి 1.17 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.