
న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్స్ (రవాణా అయిన ఫోన్ల సంఖ్య ) ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) లో 11 % (ఏడాది ప్రాతిపదికన) తగ్గాయి. పండగ సీజన్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్స్ భారీగా జరిగినప్పటికీ ఫోన్ల షిప్‌మెంట్స్ పడిపోయాయి. ఎనాలసిస్ కంపెనీ కౌంట్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన డేటా ప్రకారం, సెప్టెంబర్ క్వార్టర్‌లో దేశంలో 4.5 కోట్ల డివైజ్‌ల షిప్‌మెంట్స్ జరిగాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో ఈ నెంబర్ 5.1 కోట్లుగా ఉంది. డిమాండ్ తక్కువగా ఉండడం, అమ్ముడు కాని స్టాక్ భారీగా మిగిలి పోవడం వలనే క్యూ2 లో కొత్త ఫోన్ల షిప్‌మెంట్స్ పడిపోయాయని ఈ సంస్థ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. సెప్టెంబర్ క్వార్టర్ ప్రారంభంలో సెల్లర్ల దగ్గర 10 వారాలకు సరిపడా ఇన్వెంటరీ ఉందని, దీనికి తోడు మాక్రో ఎకనామిక్ పరిస్థితులు, కన్జూమర్ డిమాండ్ ఫ్లాట్‌గా ఉండడం వంటి కారణాలతో పండగ సీజన్ క్వార్టర్‌లో మొదటిసారిగా ఫోన్ల షిప్‌మెంట్స్ తగ్గాయని కౌంటర్‌పాయింట్ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు. మరోవైపు అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ల సగటు ధర 4 శాతం పెరిగి రూ. 20 వేలను దాటేసిందని వివరించారు.
గత నాలుగు క్వార్టర్ల నుంచి కూడా స్మార్ట్‌ఫోన్ల సగటు ధర పెరుగుతూ వస్తోందని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో దేశంలో స్మార్ట్‌ఫోన్ల యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ (ఏఎస్‌పీ) రూ. 17 వేలుగా రికార్డయ్యిందని, తాజాగా ఇది రూ.20 వేలను దాటిందని తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. కొత్త ఫోన్ షిప్‌మెంట్ల డాలర్ వాల్యూని బట్టి చూస్తే ఫోన్ల ధరలు సగటున 4 శాతం పెరిగాయని ఆయన లెక్కించారు. రూపాయి వాల్యూ పరంగా చూస్తే ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగాయని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ క్వార్టర్ వరకు స్మార్ట్‌ఫోన్ల యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుందని తరుణ్ పేర్కొన్నారు. ఏఎస్‌పీ పెరిగితే ఫోన్ల షిప్‌మెంట్స్ ఫ్లాట్‌గా ఉండడమో లేదా తగ్గడమో జరుగుతుందని ఆయన వివరించారు. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 5జీ ఫోన్లను సరసమైన ధరల్లోనే ఆఫర్ చేయడం మొదలు పెట్టాక ఈ ట్రెండ్‌లో మార్పొస్తుందని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఏఎస్‌పీ తగ్గొచ్చని అంచనావేశారు.