
జ్యూరిచ్: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో చరిత్ర ముంగిట నిలిచాడు. గురువారం రాత్రి జరిగే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా, ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. గాయంతో నెలన్నర ఆటకు దూరంగా ఉన్న తర్వాత జులై చివర్లో లాసానె దశ డైమండ్ లీగ్‌లో గెలిచిన చోప్రా ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. 2017, 2018 ఎడిషన్స్‌లో ఫైనల్స్‌లో ఆడినా వరుసగా ఏడు, నాలుగో స్థానాలతో సరిపెట్టిన నీరజ్ ఈ సారి గోల్డ్ మెడల్‌తో తిరిగి రావాలని చూస్తున్నాడు.
డైమండ్ లీగ్‌లో 32 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. 13 సిరీస్‌ల్లో (లీగ్స్) పెర్ఫామెన్స్ ద్వారా అథ్లెట్లు తమ విభాగాల్లో ఫైనల్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు. ప్రతి కేటగిరీలో ఫైనల్లో నెగ్గిన విన్నర్‌ను ‘డైమండ్ లీగ్ చాంపియన్’గా పిలుస్తారు. దాంతో, ఇండియా నుంచి ‘డైమండ్ లీగ్ చాంపియన్’ అవ్వాలని చోప్రా ఆశిస్తున్నాడు. టైటిల్ గెలిస్తే అతనికి సుమారు 24 లక్షల ప్రైజ్ మనీతో పాటు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది.