న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో భారతీయ వాణిజ్య నౌకలపై అమెరికా మిలిటరీ జరుపుతున్న దాడులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గడిచిన 48 గంటల్లో రెండోసారి అమెరికా రాయబారి జేసన్ మీక్స్‌కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. అమెరికా నౌకాదళం నేరుగా భారతీయ సిబ్బంది ఉన్న నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని భారత్ తప్పుబట్టడం ఇదే మొదటిసారి.
4 రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న 3 వాణిజ్య నౌకలపై దాడులు జరగ్గా, తాజాగా నిన్న 20 మంది భారతీయులున్న మరో నౌకపై దాడి జరిగింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఈ దౌత్యపరమైన పరిణామాలపై విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ‘‘మా నావికుల భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అమెరికా జరుపుతున్న ఈ సైనిక దాడులు వెంటనే ఆపాలి. యుద్ధ వాతావరణాన్ని వీడి, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి’’ అని స్పష్టం చేశారు.
