డైలమాలో కేసీఆర్ : భారత్ కు జై కొడదామా వద్దా..?

డైలమాలో కేసీఆర్ : భారత్ కు జై కొడదామా వద్దా..?
  • దేశం పేరు మార్పుపై బిల్లు పెడ్తే ఏం చేద్దాం?.. డైలమాలో కేసీఆర్ 
  • ఓకే అంటే ఎంఐఎంతో, వ్యతిరేకిస్తే బీజేపీతో ఇబ్బంది 
  • పార్లమెంట్​కు బిల్లు వచ్చేదాకా వేచిచూసే ధోరణే 
  • బిల్లు వస్తే సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకునే యోచనలో కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: దేశం పేరును భారత్​గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకువస్తే జై కొట్టాల్నా? వద్దా? అనే డైలమాలో బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల18 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్న పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పు, చట్ట సభల్లో మహిళలకు కోటా, వన్​ నేషన్ వన్​ ఎలక్షన్​ సహా పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదింపచేసుకోవాలనే యోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లు చర్చలు జోరుగా సాగుతున్నాయి. రాజ్యాంగానికి పలు సవరణలు కూడా ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా దేశం పేరు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కేసీఆర్​ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినందున.. పార్టీ పేరులో భారత్ ఉన్నప్పుడు దేశం పేరు భారత్ అని ఉంటే తప్పేంటనే ప్రశ్న ఎదురవుతుందేమోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. మరోవైపున దేశం పేరు మార్పును ప్రోగ్రెసివ్ శక్తులు వ్యతిరేకిస్తున్నాయని, తమ ఐడియాలజీ కూడా అదేనని చెప్పుకుంటున్నందున దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై గులాబీ బాస్ తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది.   

కేంద్రంలో అవసరాన్ని బట్టి జట్టు 

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్​యేతర ప్రత్యామ్నాయం ఏర్పాటు, దేశంలో గుణాత్మక మార్పే తమ ఎజెండా అని కేసీఆర్​ చెప్తున్నప్పటికీ.. అవసరం, సందర్భాన్ని బట్టి ఏదో ఒక కూటమితో కలిసేందుకు రెడీ అన్నట్టుగా ఇంటర్నల్​ డిస్కషన్స్​లో ఆయన స్పష్టం చేస్తున్నారని తెలిసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజార్టీ రాదని.. అప్పుడు మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 ఎంపీ సీట్లే కీలకమవుతాయని ఆగస్టు 7న మహారాష్ట్ర నేతల చేరికల సందర్భంగా కేసీఆర్​ కామెంట్​చేశారు. ‘‘తెలంగాణ, మహారాష్ట్రలో అన్ని ఎంపీ సీట్లు సాధిస్తే ఢిల్లీ సర్కారును గల్లా పట్టి నిలదీయొచ్చు. ఈ 65 మంది ఎంపీల మద్దతు లేకుండా రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితే ఉండదు. అప్పుడు దేశానికి నాయకత్వం వహించే అవకాశం మహారాష్ట్రకు వస్తుంది” అని ఆయన అన్నారు. దీంతో కేంద్రంలో ఏదో ఒక కూటమితో బీఆర్ఎస్​జత కట్టడం ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు. అయితే, పార్లమెంట్​ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఎటువైపు వెళ్లాలన్నది డిసైడ్​ కావచ్చనే ఆలోచనలో ఉన్న కేసీఆర్​పై పార్లమెంట్​ప్రత్యేక సమావేశాలు పిడుగుపాటులా వచ్చిపడ్డాయి. 

అటు బీజేపీ.. ఇటు ఎంఐఎం 

భారత్​కు జై కొడితే రాష్ట్రంలో ఎంఐఎంతో ఉన్న ఫ్రెండ్​షిప్​ దెబ్బతింటుందనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముస్లిం ఓటు బ్యాంకుకు బీటలు వారినట్టుగా సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. 40కి పైగా నియోజకవర్గాల్లో కారు పార్టీ గెలవాలంటే ముస్లింల మద్దతు తప్పనిసరి. ఒకవేళ ఇండియా పేరు మార్పును వ్యతిరేకిస్తే రాష్ట్రంలో అగ్రెసివ్​గా ఉన్న బీజేపీ నుంచి ఎటాక్​ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్​పెద్దల్లో ఉంది. ఈ నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఎలా స్పందించాలో అంతుచిక్కని పరిస్థితుల్లో ఉన్నారు. మంగళవారం మంత్రి కేటీఆర్ మీడియా చిట్​చాట్​లోనూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. వాళ్లు అనుకుంటే పేరు మార్చితే మంచిదే కదా? అని మాత్రమే అన్నారు. పార్టీ పేరులోనే భారత్​ఉంది కదా..? అని ప్రశ్నించినా మంత్రి మాత్రం నేరుగా సమాధానం ఇవ్వలేదు. 

వేచి చూసే ధోరణే.. 

దేశం పేరు మార్పు అంశంపై ఎలా స్పందించాలన్న దానిపై ఈ నెల15న నిర్వహించే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ స్పష్టత వచ్చే అవకాశం లేనట్టు తెలిసింది. పార్లమెంట్​ముందుకు వచ్చే అంశాల ఆధారంగానే స్పందించాలని, తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, మెడికల్​ కాలేజీలు సహా ఇతర అంశాల సాధనపైన కేసీఆర్ దిశానిర్దేశం చేయవచ్చని తెలుస్తోంది. దేశం పేరు మారిస్తే దానిని ఆపేంత సంఖ్యాబలం కూడా లేదు కాబట్టి వేచి చూసే ధోరణి అవలంబించడమే మంచిదన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు సమాచారం. ఆ రోజుకు దేశం, రాష్ట్రంలో ఉన్న మూడ్, ఇతర అంశాలను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే మంచిదనే భావనలో ఆయన ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకువస్తే ఆ కోటాలో బహుజనులకు కోటా కోరాలనే ప్రతిపాదన పార్టీ నుంచి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి మినహా మిగతావాటిపై ఎజెండా మేరకు ఎప్పుడేం చేయాల్నో అప్పటికప్పుడు సూచనలు ఇస్తామని, దానికి అనుగుణంగానే రియాక్ట్​ కావాలని కేసీఆర్​ సూచించే అవకాశమున్నట్టు తెలిసింది.