బార్డర్​లో అత్యాధునిక డ్రోన్లు.. 36 గంటలు గాల్లోనే

బార్డర్​లో అత్యాధునిక డ్రోన్లు.. 36 గంటలు గాల్లోనే
 
  • బార్డర్​లో అత్యాధునిక డ్రోన్లు
  • ఏకధాటిగా 36 గంటల పాటు గాల్లోనే ఉండే సామర్థ్యం
  • నార్తర్న్ సెక్టార్ లో హెరాన్ మార్క్ 2 డ్రోన్లను మోహరించిన ఐఏఎఫ్
  • పాక్, చైనాలపై ఏకకాలంలో నిఘా.. ఉపగ్రహ కమ్యూనికేషన్  వ్యవస్థ 
  • వీటితో మిస్సైల్స్ ను కూడా ప్రయోగించవచ్చని అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో గస్తీని పటిష్టం చేయడంతో పాటు పొరుగు దేశాల కదలికలపై నిఘా కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) నాలుగు అత్యాధునిక డ్రోన్లను నార్తర్న్ సెక్టార్ లో మోహరించింది. ఫార్వార్డ్ ఎయిర్ బేస్​కు హెరాన్ మార్క్ 2 డ్రోన్లను తరలించింది. సుదూర లక్ష్యాలను గుర్తించి, లేజర్ సాయంతో యుద్ధవిమానాలకు డైరెక్షన్స్ ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి వాతావరణంలోనైనా, కనుచూపు మేరలో లేకున్నా ఈ డ్రోన్లను ఆపరేట్ చేయొచ్చని వివరించారు. శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్లతో పాకిస్తాన్ తో పాటు చైనాపైనా ఏకకాలంలో నిఘా పెట్టవచ్చని తెలిపారు. టార్గెట్లను గుర్తించడంలో యుద్ధ విమానాలకు సాయపడడంతో పాటు దాడి చేయడానికి కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయన్నారు. ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు గ్రౌండ్ యాంటీ ట్యాంక్ వెపన్స్, బాంబులను ఈ డ్రోన్లు మోసుకెళ్లగలవని వివరించారు. ప్రస్తుతం వీటికి ఆయుధాలను బిగించే ప్రాసెస్ చేపట్టామని అధికారులు తెలిపారు. 

36 గంటలు గాల్లోనే...

ఒక్కసారి గాల్లోకి ఎగిరితే 36 గంటల పాటు కిందికి రాకుండా ఉండగల సామర్థ్యం ఈ డ్రోన్ల సొంతమని అధికారులు వివరించారు. అత్యంత దూరం నుంచే శతృదేశాల టార్గెట్ ను గుర్తించి సమాచారం అందిస్తాయి. దీంతో ఫైటర్  జెట్లు శత్రుదేశాల టార్గెట్ ను నాశనం చేయడం మరింత సులువవుతుందని స్క్వాడ్రన్  వింగ్  కమాండర్  పంకజ్  రాణా తెలిపారు. ఆదివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. ‘‘హెరాన్  మార్క్ 2 డ్రోన్లు చాలా శక్తిమంతమైనవి. ఇవి అత్యంత దూరం ప్రయాణించగలవు. సాధారణ కంటికి కూడా కనిపించకుండా ప్రయాణించడం వీటి ప్రత్యేకత” అని పంకజ్  రాణా చెప్పారు. కాగా,  పాకిస్తాన్, చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు ఇండియా గత కొద్ది రోజులుగా ఆయుధ సంపత్తిని మరింత మెరుగుపరచుకుంటున్నది. అందులో భాగంగా శ్రీనగర్  ఎయిర్ బేస్ లో శక్తివంతమైన మిగ్ 29 యుద్ధ విమానాలను మోహరించిన విషయం తెలిసిందే.