
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ యొక్క మిగిలిన యూనిట్లను మొదట ఒప్పందం ప్రకారం 2026 నాటికి భారత్‌కు అందిస్తామని తెలిపింది. భారతదేశంలోని రష్యన్ డిప్యూటీ రాయబారి రోమన్ బాబుష్కిన్ ఇటీవల జాతీయ వార్తా సంస్థ పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా S-400 క్షిపణి వ్యవస్థ ఒప్పందం గురించి ఆయన మాట్లాడారు.
ఇటీవలి ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ అగ్రిమెంట్లో భాగంగా మిగిలిన యూనిట్లను చెప్పిన టైమ్ డెలివరీ చేస్తామని ఆయన తెలిపారు. భారత్, పాక్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతల సమయంలో S-400 క్షిపణి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందని గుర్తు చేశారు. భారతదేశ రక్షణకు దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను బలోపేతం చేసిందని పేర్కొన్నారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇండియాకు S-400 క్షిపణి వ్యవస్థ మిగిలిన యూనిట్ల డెలివరీ ఆలస్యం అవుతోందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రష్యన్ రాయబారి రోమన్ బాబుష్కిన్ చెప్పిన సమయానికే డెలివరీ చేస్తామని చెప్పడంతో ఒక క్లారిటీ వచ్చింది. సరిహద్దులో పాక్‌తో ఉద్రిక్తతల వేళ ఒప్పందం ప్రకారమే S-400 క్షిపణి వ్యవస్థలను డెలివరీ చేస్తామని రష్యా చెప్పడం భారత్‌కు గుడ్ న్యూసే. మిగిలిన రెండు S-400 క్షిపణి యూనిట్లు వస్తే.. భారత ఆయుధ సంపత్తి మరింత దృఢం కానుంది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌కు రివేంజ్ తీర్చుకోవడం కోసం పాకిస్థాన్ భారత్‌పై దాడులకు విశ్వ ప్రయత్నాలు చేసింది. పాక్ దాడులను S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ఎక్కడికక్కడ అడ్డుకుంది. పాక్ నుంచి వందల సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లు, మిస్సైళ్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ 400 సమర్ధవంతంగా తిప్పికొట్టింది. పాక్ పై భారత్‌పై చేయి సాధించడంలో ఎస్ 400 కీలక పాత్ర పోషించింది. రష్యా తయారుచేసిన ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థను -భారత్‌లో 'సుదర్శన్ చక్ర' అని పిలుస్తారు. -
పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి 2018లో రష్యాతో భారత్ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఐదు S-400 వైమానిక రక్షణ వ్యవస్థల కోసం 5.43 బిలియన్ల ఒప్పందం జరిగింది. మొదటి యూనిట్‌ను డిసెంబర్ 2021లో డెలివరీగా చేయగా.. 2022 ఏప్రిల్‌లో రెండవ యూనిట్, 2023 అక్టోబర్‌లో మూడో యూనిట్‌ను డెలివరీ చేసింది రష్యా. ఇంకా రెండు యూనిట్లు భారత్ కు అప్పగించాల్సి ఉండగా.. వాటిని 2026 నాటికి డెలివరీ చేస్తామని రష్యా చెప్పింది.