కరిచే కుక్కలనే షెల్టర్లలో పెట్టాలి.. వీధుల్లో డాగ్స్ కు ఆహారం పెట్టేవాళ్లపై చర్యలు తీసుకోవాలి

కరిచే కుక్కలనే షెల్టర్లలో పెట్టాలి.. వీధుల్లో డాగ్స్ కు ఆహారం పెట్టేవాళ్లపై చర్యలు తీసుకోవాలి
  • రేబిస్ సోకిన డాగ్స్​నూ బయటకు వదిలిపెట్టొద్దు 
  • స్టెరిలైజ్, డీవార్మింగ్ చేసిన, టీకాలు వేసిన వాటినే రిలీజ్ చేయాలి
  • ఢిల్లీ ఎన్​సీఆర్​లో వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఆదేశాలు   
  • వార్డుల్లో ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి  
  • వీధుల్లో డాగ్స్ కు ఆహారం పెట్టేవాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ 
  • ఈ నెల 11 నాటి ఉత్తర్వులను సవరించిన త్రిసభ్య బెంచ్

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన కఠినమైన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. వీధుల్లో అగ్రెసివ్​గా ఉండి కరిచే కుక్కలను, రేబిస్ సోకిన వాటిని మాత్రమే షెల్టర్లలో పెట్టాలని.. మిగతా శునకాలను స్టెరిలైజ్, డీవార్మింగ్ చేసి, టీకాలు వేసి వాటిని పట్టుకొచ్చిన ప్రాంతాల్లోనే వదిలిపెట్టాలని ఆదేశించింది. ఢిల్లీ ఎన్ సీఆర్ పరిధిలో వీధి కుక్కల సమస్య తీవ్రమైందని, స్ట్రే డాగ్స్ అన్నింటినీ షెల్టర్లలోకి తరలించాలంటూ ఈ నెల 11న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మమహదేవన్ బెంచ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ను ఆదేశించింది. అయితే, వీధి కుక్కలన్నింటినీ తరలించాలన్న ఆదేశాలపై దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు వీధి కుక్కలన్నింటినీ తరలించే సౌలతులు, సిబ్బంది లేనందున ఈ ఆదేశాల అమలు సాధ్యం కాదన్న అభిప్రాయాలూ వినిపించాయి. దీంతో సుప్రీంకోర్టు టూ జడ్జి బెంచ్ ఉత్తర్వులను పరిశీలించేందుకు త్రీ జడ్జి బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ శుక్రవారం ఈ అంశాన్ని పరిశీలించి, గత ఉత్తర్వులను సవరించింది. తగిన సౌలతులు, సిబ్బంది లేకుండా వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లలో పెట్టడం ఆచరణలో సాధ్యం కాదని, అందుకే ప్రస్తుతానికి ఆదేశాలను సవరిస్తున్నామని పేర్కొంది. 

మున్సిపల్ వార్డుల్లో డాగ్ ఫీడింగ్ జోన్లు..  

స్ట్రీట్ డాగ్స్‌కు ప్రతి మున్సిపల్ వార్డులో ఒక ఫీడింగ్ జోన్ ఏర్పాటు చేయాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. డాగ్ లవర్స్ అక్కడ మాత్రమే వీధి కుక్కలకు ఆహారం అందించేలా నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఫీడింగ్ జోన్లలో కాకుండా వీధిలో ఎక్కడ పడితే అక్కడ కుక్కలకు ఫుడ్ పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ రూల్స్ ను ఉల్లంఘించేవారిపై ఫిర్యాదులకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ను కూడా క్రియేట్ చేయాలని చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులకు ఆటంకాలు కల్పించే వ్యక్తులు, సంస్థలను సైతం ప్రాసిక్యూషన్ చేయాలని ఆదేశించింది. అయితే, ఈ నెల 11 నాటి ఆదేశాల ప్రకారం.. ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ మున్సిపల్ అధికారులు వీధి కుక్కల తరలింపు, షెల్టర్ల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలని చెప్పింది. ‘‘స్ట్రీట్ డాగ్స్​ను పట్టుకుని షెల్టర్లకు తరలించాలి. వాటికి సంతానం కలగకుండా స్టెరిలైజేషన్ చేయాలి. అలాగే, డీవార్మింగ్ చేసి, వ్యాక్సిన్లు ఇవ్వాలి. అనంతరం వాటిని తీసుకొచ్చిన చోటనే వదిలేయాలి” అని బెంచ్ ఆదేశించింది. అగ్రెసివ్​గా ఉండి, మనుషులను కరిచే కుక్కలు, రేబిస్ సోకిన కుక్కలను మాత్రం ట్రీట్మెంట్ చేసి, షెల్టర్లలోనే ఉంచాలని తేల్చిచెప్పింది. మొత్తం వీధి కుక్కలన్నింటి విషయంపై ఉత్తర్వులు ఇచ్చే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది అందుబాటులో ఉందా? లేదా? అన్నది చూడాల్సి ఉందని తెలిపింది. 

డాగ్​ లవర్స్ రూ.25 వేలు, ఎన్జీవోలు రూ.2 లక్షలు డిపాజిట్​ చేయండి.. 

వీధి కుక్కల అంశంపై ఢిల్లీ ఎన్ సీఆర్​తోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ అవుతాయని, ఈ విషయంలో ‘ఫైనల్ నేషనల్ పాలసీ’ లేదా ‘డెసిషన్’ను సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని త్రీ జడ్జి బెంచ్ స్పష్టం చేసింది. వీధి కుక్కలను దత్తత తీసుకోవాలనుకునే డాగ్ లవర్స్ మున్సిపల్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అయితే, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుక్కలను మళ్లీ వీధుల్లోకి వదిలేయరాదని, వాటి పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది. అలాగే వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన డాగ్ లవర్స్ రూ. 25 వేల చొప్పున, ఎన్జీవోలు రూ. 2 లక్షల చొప్పున ఏడు రోజుల్లోగా డిపాజిట్ చేయాలని బెంచ్ ఆదేశించింది. డిపాజిట్ చేయని వ్యక్తులు, సంస్థలను తదుపరి విచారణలో పరిగణనలోకి తీసుకోబోమని హెచ్చరించింది. అదేవిధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అమలుకు వీలుగా ప్రస్తుతం ఉన్న సౌలతుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని మున్సిపల్ అధికారులను బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.