
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కాలంలో వివిధ దేశాల పర్యటనలో భాగంగా మాట్లాడుతూ..భారతదేశం ప్రపంచంలో నాలుగో ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నదని చెప్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తే, నిజంగా భారతదేశం ప్రపంచంలో నేడు ఆర్థికంగా శక్తిమంతంగా ఉన్న అమెరికా, చైనా, రష్యా, జపాన్ తదితర దేశాలను వెనక్కినెట్టి భారతదేశం నిజంగానే ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తుందా అని లోతుగా ఆలోచిస్తే అనేక రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే.. ఒకపక్క ప్రపంచ మానవ అభివృద్ధి సూచిలో భారతదేశం నేటికీ 193 దేశాల్లో 130వ స్థానంలో ఉండగా, భారతదేశం ఆర్థిక ప్రగతిలో నాలుగో స్థానంలో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెప్తే నిజం అవ్వదు కదా..! అసలు మానవ అభివృద్ధి లేకుండా.. ఆర్థిక ప్రగతిని సాధించడం ఏంటి? నేడు 140 కోట్ల మంది భారతీయుల్లో అభివృద్ధికి దూరంగా ఉంటూ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్నది ఎవరంటే నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలే. కనీస మౌలిక సదుపాయాలు అందక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల కోసం తాపత్రయపడుతున్నారు.
కానీ, కేంద్ర ప్రభుత్వం అధినేతలు ప్రపంచ దేశాలనే తలదన్ని భారతదేశం మూడో ఆర్థికశక్తి కలిగిన దేశంగా ఎదుగుతున్నమని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అగ్రవర్ణాల అభివృద్ధిని 100 కోట్ల పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం అంటే దేశంలో మెజారిటీగా ఉన్న అణగారిన వర్గాలని మోసం చేయడమే కదా!
దినసరి కార్మికులుగా నిరుద్యోగులు
సరైన విజ్ఞానంతో కూడిన స్కిల్స్ లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఉపాధి నిరుద్యోగులకి కల్పించకపోవడం మూలంగా లక్షల మంది అణగారిన వర్గాల నిరుద్యోగులు దినసరి కార్మికులుగా పనిచేస్తున్నారు. ఉన్నత వర్గాల కబంధ హస్తాల్లో వేల, లక్షల ఎకరాల భూమి ఉంది. పీడిత వర్గాలకు చెందిన లక్షల కుటుంబాలకు ప్రభుత్వాలు ఉచిత భూమిని కల్పిస్తే స్వశక్తితో వ్యవసాయం చేసుకొని ఆత్మ గౌరవంతో బతకాలని వేచి చూస్తున్నారు. మరి అలాంటి కుటుంబాలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత భూ పంపిణీ చేస్తే దేశంలో పేదరికంలో ఉన్న లక్షల మంది అణగారిన వర్గాల కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తాయి. మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి విషయంలో తారతమ్యాలు ఉంచుకొని అగ్రవర్ణాల ప్రగతిని మొత్తం దేశం ప్రగతిగా చూపిస్తున్నారు. కోట్లాది మంది అణగారిన వర్గాలు అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారు. కానీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం ఆర్థికంగా చాలా అత్యంత వేగంగా అభివృద్ధి
చెందుతున్న దేశంగా చెప్పడం శోచనీయం.
మానవ అభివృద్ధిని సాధించాలి
నేడు ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, చైనా, రష్యా, జపాన్ మొదలైనవి అక్కడి ప్రజలకి మౌలిక సదుపాయాలన్నీ సమృద్ధిగా కల్పించి ఆ తర్వాత ఆర్థిక ప్రగతిని సాధించాయి. ఆయా దేశాలు మానవ అభివృద్ధిని సాధించకుండా ఆర్థిక అభివృద్ధిపైనే దృష్టి పెట్టలేదు. కానీ, భారతదేశంలో మాత్రం మానవ అభివృద్ధి లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నామని ప్రధాని మోదీ చాలా గర్వంగా పదేపదే చెప్తున్నారు.
అంటే ఒక రకంగా దేశ ప్రజలను మరి ముఖ్యంగా అత్యంత కడు పేదరికంలో ఉన్న అణగారిన వర్గాలని మభ్యపెడుతున్నారని చెప్పడానికి నిదర్శనం కదా! కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మానవ అభివృద్ధిని సాధిస్తూ అందులో భాగంగా దేశంలో ఉన్న కుల, మత తారతమ్యాలని అధిగమిస్తూ ప్రతి పౌరుడికి సౌకర్యవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. మానవ అభివృద్ధిలో భాగంగా దేశ ఆర్థిక అభివృద్ధిని భాగం చేయాలి తప్ప, మానవ అభివృద్ధి లేని ఆర్థిక ప్రగతి సాధించడం అంటే అది ఆధునిక అనాగరిక చర్యకు నిదర్శనం గ్రహించాలి.
మెరుగైన విద్య, వైద్యం అందించాలి
అగ్రవర్ణాలకి మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధి జరుగుతూ అణగారినవర్గాలకి తరతరాలుగా అన్యాయం జరుగుతున్నదని అనేక గణాంకాల ప్రకారం నిరూపితం అవుతున్నది. అది ఎలా అంటే నేడు దేశంలో 10% ఉన్న అగ్రవర్ణాలు ప్రభుత్వ విద్యాసంస్థలను కాదని అత్యంత ఆధునిక సౌకర్యాలు కలిగిన కార్పొరేట్ విద్యని పొందుతున్నారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ వైద్యాన్ని పొందుతున్నారు. కానీ, 100 కోట్ల పైబడి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ప్రభుత్వాల నుంచి మెరుగైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి లభించడం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యని నిర్లక్ష్యం చేసి సామాన్యులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన ఉచిత విద్యని కల్పించకపోవడం వల్ల అణగారిన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులు పస్తులు ఉంటూ, అప్పుల పాలు అవుతూ తమ బిడ్డల భవిష్యత్ కోసమని ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కోనకలేక, ప్రభుత్వ వైద్యశాలలో సరైన సదుపాయాలు లేక అణగారిన వర్గాలకి చెందిన వేల,లక్షల కుటుంబాలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
- పుల్లెంల గణేష్ ,ధర్మ సమాజ్ పార్టీ, స్టడీ & రీసెర్చ్ టీం