బంగ్లా పంజా..భారత్ ఓటమి

బంగ్లా పంజా..భారత్ ఓటమి

కాలుష్యం సంగతేమో కానీ అరుణ్‌‌జైట్లీ స్టేడియంలో టీమిండియా బౌలర్లు మాత్రం బంగ్లాదేశ్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను కనీసం ఇబ్బందిపెట్టలేకపోయారు.  ముష్ఫికర్‌‌ రహీమ్‌‌ ధనాధన్‌‌ హాఫ్‌‌ సెంచరీకి సౌమ్యసర్కార్‌‌(35 బంతుల్లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 39) కీలక ఇన్నింగ్స్‌‌ తోడవడంతో ఆదివారం జరిగిన టీ20లో బంగ్లా ఏడు వికెట్ల తేడాతో ఇండియాపై ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 రన్స్‌‌ చేసింది. శిఖర్‌‌ ధవన్‌‌(42 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్‌‌తో 41), రిషబ్‌‌ పంత్‌‌ (26 బంతుల్లో 3 ఫోర్లతో 27), శ్రేయస్‌‌ అయ్యర్‌‌(13 బంతుల్లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 22) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో షఫియుల్‌‌ ఇస్లామ్‌‌(2/36), అమినుల్‌‌ ఇస్లామ్‌‌(2/22) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌లో 19.3 ఓవర్లు ఆడిన బంగ్లా మూడు వికెట్ల నష్టానికి 154 రన్స్‌‌ చేసి విజేతగా నిలిచింది. దీపక్‌‌ చహర్‌‌, ఖలీల్‌‌ అహ్మద్‌‌, యజ్వేంద్ర చహల్‌‌ ఒక్కో వికెట్‌‌ తీశారు. ముష్ఫికర్‌‌ రహీమ్‌‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా ఎంపికయ్యాడు. సెకండ్​ మ్యాచ్​ గురువారం రాజ్​కోట్​లో జరగనుంది.

నీరసంగా.. కష్టంగా..

ఢిల్లీలో ఇండియా ఇన్నింగ్స్‌‌ చప్పగా సాగింది. పిచ్‌‌ ఏమంత ప్రమాదకరంగా లేకపోయినా బ్యాట్స్‌‌మెన్‌‌ పరుగులు కోసం నానా కష్టాలు పడ్డారు. ముఖ్యంగా ఢిల్లీవాలాలు శిఖర్‌‌ ధవన్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ హోమ్‌‌ గ్రౌండ్‌‌లో అంచనాలను అందుకోలేకపోయారు. ఓవరాల్‌‌గా ధవన్‌‌ ఒక్కడే ఏడు ఓవర్లు ఎదుర్కొన్నప్పటికీ ఏ దశలోనూ తన లెవల్‌‌కు తగినట్టు ఆడలేదు. చివర్లో క్రునాల్‌‌ పాండ్యా(15 నాటౌట్‌‌), వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (14 నాటౌట్‌‌) మెరుపులతో టీమిండియా ప్రత్యర్థి ముందు ఓ మాదిరి లక్ష్యం ఉంచింది. మరోపక్క ఏడుగురు బౌలర్లను ఉపయోగించిన బంగ్లా కెప్టెన్‌‌ మహ్ముదుల్లా తన ప్రయత్నంలో సక్సెస్‌‌ అయ్యాడు. అంతకుముందు టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాకు ఫస్ట్‌‌ ఓవర్‌‌లోనే షాక్‌‌ తగిలింది. షఫియుల్‌‌ ఇస్లామ్‌‌ వేసిన మ్యాచ్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌ను బౌండరీకి తరలించి ఇన్నింగ్స్‌‌ ప్రారంభించిన కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ(9) ఆ ఓవర్‌‌ చివరి బంతికే ఎల్బీ అయ్యాడు. దీంతో ధవన్‌‌కు కేఎల్‌‌ రాహుల్‌‌(15) జతకలిశాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో పవర్‌‌ ప్లే ముగిసేసరికి ఇండియా 35/1పై నిలిచింది. ఆ వెంటనే రాహుల్‌‌ ఔటవ్వగా.. అయ్యర్‌‌ క్రీజులోకి వచ్చాడు. ఓ వైపు ధవన్‌‌ నెమ్మదిగా ఆడుతున్నా.. ఉన్న కాసేపు అయ్యర్‌‌ ధాటిగా ఆడాడు. అమినుల్‌‌ వేసిన 11వ ఓవర్‌‌లో భారీ షాట్‌‌ ఆడిన అయ్యర్‌‌ లాంగాఫ్‌‌లో నైమ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. ఈ దశలో ధవన్‌‌తో కలిసి పంత్‌‌ కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లేని రన్‌‌కు యత్నించిన ధవన్‌‌ రనౌటవడంతో ఇండియా స్కోరు మరింత నెమ్మదించింది. 16వ ఓవర్‌‌లో వంద మార్కు అందుకోగా.. ఆ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కే అరంగేట్ర ప్లేయర్‌‌ శివమ్‌‌ దూబే(1) ఔటయ్యాడు. 19వ ఓవర్‌‌లో పంత్‌‌ కూడా పెవిలియన్‌‌ చేరగా క్రునాల్‌‌– సుందర్‌‌ చివరి పది బాల్స్‌‌లో 28 రన్స్‌‌ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.

పులులు గర్జించాయి..

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బంగ్లా ఏ దశలోను ఇబ్బంది పడలేదు. రెండో వికెట్‌‌కు 46 పరుగులు జోడించిన నైమ్‌‌ (26),  సౌమ్య బంగ్లా విజయానికి బంగారు బాట వేశారు. ఓపెనర్‌‌ లిటన్‌‌ దాస్‌‌(7)ను దీపక్‌‌ చహర్‌‌ ఫస్ట్‌‌ ఓవర్‌‌లోనే పెవిలియన్‌‌ చేర్చినా.. నైమ్‌‌–-సౌమ్య జోడీ స్వేచ్ఛగా ఆడింది. ధవన్​ క్యాచ్​తో నైమ్​ను ఔట్​ చేసిన చహల్​ ఇండియాకు బ్రేక్​ ఇచ్చాడు. కానీ, సౌమ్యకు జతకలిసిన ముష్ఫికర్​ ఇండియా బౌలర్లను సులువుగా ఎదుర్కొన్నాడు. దీంతో 15 ఓవర్లుకు 99/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 17 ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు ఖలీల్‌‌ బౌలింగ్‌‌లో సౌమ్య క్లీన్‌‌బౌల్డ్‌‌ అవ్వడంతో మూడో వికెట్​కు 60 రన్స్‌‌ పార్ట్​నర్​షిప్​ ముగిసింది.  దాంతోమ్యాచ్‌‌లో హీట్‌‌ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

క్రునాల్‌‌ ఆ క్యాచ్‌‌ పట్టి ఉంటే..

సౌమ్య ఔటైన తర్వాత బంగ్లాపై ఒత్తిడి పెరిగింది. కెప్టెన్‌‌ మహ్ముదుల్లా(15 నాటౌట్‌‌) తో కలిసి ముష్ఫికర్‌‌ ధాటిగా ఆడాడు. ఈ దశలో క్రునాల్‌‌ చేసిన తప్పిదం ఇండియా విజయాన్ని చేజార్చింది. 18వ ఓవర్లో  ముష్ఫికర్‌‌కు దొరికిన లైఫ్‌‌ మ్యాచ్‌‌ రిజల్ట్‌‌ను మార్చేసింది. జట్టు స్కోరు 116/3 వద్ద చహల్‌‌ బౌలింగ్‌‌లో అతనిచ్చిన క్యాచ్‌‌ను డీప్‌‌ మిడ్‌‌వికెట్‌‌లో క్రునాల్‌‌ నేలపాలు చేశాడు. ఈ లైఫ్‌‌ను సద్వినియోగం చేసుకున్న ముష్ఫికర్‌‌.. ఖలీల్‌‌ వేసిన 19 ఓవర్‌‌లో వరుసగా 4 ఫోర్లు కొట్టి మ్యాచ్‌‌ను లాగేసుకున్నాడు. ఆపై దూబే వేసిన ఆఖరి ఓవర్లో సిక్సర్‌‌ బాదిన మహ్ముదుల్లా లాంఛనం పూర్తి చేశాడు.