సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ అదరగొడుతోంది. వన్డే సిరీస్‌లో ఓడిన టీమిండియా, టీ20 ట్రీఫీని కైవసం చేసుకొని ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత మొదలైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. పక్కా లైన్ అండ్ లెంగ్త్ బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ కోసం కంగారూ టీమ్ మరింత ప్లానింగ్‌తో సిద్ధమవుతోంది. ఈసారి భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటామని ఆసీస్ టాప్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా తమ కోసం బిగించిన లెగ్ సైడ్ ఉచ్చులో పడబోమన్నాడు.
‘లెగ్ సైడ్ ట్రాప్ సవాలుతో కూడుకున్నది. ఆ వైపు బౌండరీలు కొట్టడంతోపాటు స్ట్రయిక్ రొటేట్ చేయడం చాలా కష్టం. సానుకూలతతో ఉండాలంటే అశ్రద్ధను వీడాల్సిందే. టీమిండియా మంచి ప్లానింగ్‌తో ఆడుతోంది. ఈ తరంలో ప్రతి టీమ్ కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి యత్నిస్తోంది. భారత్ మాకు ఆఫ్ సైడ్ స్కోర్ చేసే చాన్స్ ఇవ్వలేదు. వాళ్ల స్ట్రాటజీని దీటుగా ఎదుర్కోవాల్సిన టైమ్ వచ్చింది. వచ్చే రెండు మ్యాచుల్లో దీన్ని ఎలా అధిగమిస్తామనే దాని గురించి నేను ఇప్పుడేమీ చెప్పలేను. కానీ పాజిటివ్‌గా బ్యాటింగ్ చేయాలని మాత్రం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని లబుషేన్ చెప్పాడు.

