అడిలైడ్: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మరో రెండ్రోజుల్లో మొదలు కానుంది. టాప్ జట్ల మధ్య జరగనున్న పోరు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ భార్య అనుష్క త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో విరాట్ తొలి మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఆ తర్వాత అతడు భారత్‌కు రానున్నాడు. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచులకు వైస్ కెప్టెన్ అజింక్యా రహానె ముందుండి నడిపే అవకాశాలు ఉన్నాయి. వీటిపై తాజాగా రహానె స్పందించాడు. ప్రస్తుతం తాము తొలి మ్యాచ్ పైనే ఫోకస్ పెట్టామన్నాడు.
‘నేను వర్తమానంలో ఉండటానికే ఇష్టపడతా. ప్రస్తుతం విరాట్ మా కెప్టెన్. మేం మొదటి మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాం. అతడు వెళ్లిపోయాక రెండో మ్యాచ్ గురించి ప్రణాళికలు వేస్తాం. ఈ మ్యాచ్‌లో విరాట్‌కు ఎలా సాయపడతామా, ఎలా గెలవాలనే దానిపైనే ఫోకస్ పెడతాం. ఆసీస్‌లోని ఛాలెంజింగ్ వికెట్లపై రాణించడం సవాలుతో కూడుకున్నది. బాల్ అనూహ్యంగా స్పందిస్తుంది. అందుకే ఇక్కడ బ్యాట్స్‌మన్ ఫోకస్‌తో ఉండటం కీలకం. బ్యాట్స్‌మెన్స్ మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. సాయంత్రం పూట 40-45 నిమిషాలు బ్యాటింగ్ బాగా చేస్తే మంచింది. తొలి టెస్టును బాగా ఆరంభించాలనుకుంటున్నాం’ అని రహానె పేర్కొన్నాడు.
