
కోల్ కతా: భారత్ బంగ్లా మధ్యన సెకండ్ టెస్ట్ నవంబర్ -22 న ఈడెన్ గార్డెన్ లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు ఎన్నడూ లేని విధంగా టికెట్స్ ధరలను తగ్గించినట్లు తెలిపింది బెంగాల్ క్రికెట్ అసొసియేషన్. డే/నైట్ మ్యాచ్ కావడంతో క్రీడాభిమానులు అధిక సంఖ్యలో రావాలనే ఉద్దేశంతో టికెట్ ప్రారంభ ధరను రూ.50గా నిర్ణయించింది. టికెట్ ధర తక్కువగా ఉంటే స్టేడియం నిండిపోయే అవకాశం ఉంటుందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 68వేల సీట్ల కెపాసిటీ కలిగి ఉన్న ఈ స్టేడియంలో టికెట్ ధరలను రూ. 50, రూ.100, రూ.150గా నిర్ణయిస్తామన్నారు.
చలికాలం కావడంతో మంచు ప్రభావం ఆటపై పడకూడదని గంట ముందుగానే మ్యాచ్ ని ప్రారంభించాలని BCCIని అనుమతి కోరినట్లుగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అభిషేక్ దాల్మియా తెలిపారు. BCCI అనుమతి ఇస్తే సాధారణంగా 2.30గంటలకు జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 1.30గంటలకు మొదలై.. రాత్రి 8.30గంటలకు ముగుస్తుందన్నారు. టీ బ్రేక్, లంచ్ బ్రేక్ యధావిథిగా అంతే సమయం కేటాయిస్తామని తెలిపారు.