చివరి టీ20 మ్యాచ్.. ఇండియా బ్యాటింగ్

చివరి టీ20 మ్యాచ్.. ఇండియా బ్యాటింగ్

అహ్మదాబాద్: ఇంగ్లండ్-ఇండియా మధ్య చివరి 5వ టీ20లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇప్పటికే 2-2తో సిరీస్ సమం కావడంతో చివరిదైన ఈ ఐదవ వన్డే లో గెలుపు కీలకంగా మారింది. ఎలాగైనా సిరీస్ నెగ్గాలన్న పట్టుదలతో ఉన్న ఇరు జట్లు హోరా హోరీగా తలపడుతున్నాయి. టి.నటరాజన్ కు మ్యాచ్ లో అవకాశం కల్పించి కేఎల్ రాహుల్ ను తప్పించారు.

ఓపెనర్లుగా కోహ్లి-రోహిత్

సిరీస్ విజేతను నిర్ణయించే ప్రతిష్టాత్మకమైన ఈ 5వ టీ-20ని గెలవాలన్న పట్టుదలతో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనర్ గా బరలోకి దిగారు. రోహిత్ తో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మ్యాచ్ గెలుపే లక్ష్యం కావడంతో ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించడంతో భారత్ తొలి ఓవర్లో కేవలం 3 పరుగులే చేసింది. రోహిత్ 2 పరుగులతో ఖాతా తెరువగా.. కోహ్లి పరుగుల ఖాతా ప్రారంభించలేదు. రెండో ఓవర్లో ఓపెనర్ల జోడీ బ్యాట్ ఝుళిపించారు. కోహ్లి 3వ బాల్ కు బౌండరీకి తరలించగా.. ఓవర్ చివరి బంతిని రోహిత్ సిక్స్ గా మలిచాడు. మ్యాచ్ ఆరు ఓవర్లకు భారత్ స్కోర్ 60 పరుగులకు చేరింది. రోహిత్ 35 పరుగులతో జోరు ప్రదర్శిస్తుండగా.. కోహ్లి 17 పరుగులతో తనవంతుగా సహకారం అందిస్తూ స్కోర్ బోర్డును పరిగెత్తిస్తున్నాడు. 

చెలరేగిపోయిన రోహిత్

ఆట ప్రారంభమైన రెండో ఓవర్ నుండే రోహిత్ శర్మ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించడం ప్రారంభించాడు. కేవలం 34 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగి ఆడుతున్న రోహిత్ ను ఔట్ చేసేందుకు బెన్ స్టోక్స్ స్పీడ్ ను కాస్త తగ్గించి వేయగా.. అది రోహిత్ బ్యాట్ అంచులకు తాకుతూ వికెట్లను గిరాటేసింది. దీంతో 94 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ రోహిత్ రూపంలో కోల్పోయింది. అయితే మూడో స్థానంలో బరిలోకి దిగిన  సూర్య కుమార్ వచ్చీ రావడంతోనే వరుసగా రెండు సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను చితక్కొట్టాడు. దీంతో ఇంగ్లండే పేస్ బౌలర్లు స్పీడ్ ను తగ్గించి లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 11 ఓవర్లకు వికెట్ నష్టానికి భారత్ 114 పరుగులు చేసింది. సూర్య కుమార్ (17) పరుగులతో.. కోహ్లి(25) పరుగులతో ఆడుతున్నారు.