సానో: అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇండియా, జపాన్ మధ్య మంగళవారం చారిత్రాత్మక టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండో–జపాన్ దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల (75 ఏళ్లు) సందర్భంగా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. టోక్యోకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని 'జపనీస్ క్రికెట్ క్యాపిటల్'గా పేరుగాంచిన సానో ఇంటర్నేషనల్ మైదానం ఈ పోరుకు వేదికైంది. ప్రపంచ టీ20 చాంపియన్‌గా ఉన్న టీమిండియాతో.. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో 41వ స్థానంలో ఉన్న జపాన్ తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఏషియన్ గేమ్స్ సన్నాహకాల్లో భాగంగా శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఇండియా బరిలోకి దిగుతుండగా, కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ జపాన్ జట్టును నడిపిస్తున్నాడు. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీతో పాటు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లను జపాన్ ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి. బేస్‌బాల్ ఎక్కువగా ఆదరణ పొందిన జపాన్‌లో క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఈ మ్యాచ్ ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు టైఫూన్ తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా టైమ్ ప్రకారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
