పాక్‌‌కు ఏడుపే..దాయాదిపై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

పాక్‌‌కు ఏడుపే..దాయాదిపై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ
  •     120 రన్స్‌‌ టార్గెట్‌‌ను కాపాడిన బౌలర్లు 
  •     రాణించిన పంత్‌‌, బుమ్రా, పాండ్యా
  •     టీ20 వరల్డ్ కప్స్‌‌లో పాక్‌‌పై టీమిండియాకు ఏడో విక్టరీ

న్యూయార్క్‌ ‌: టీ20 వరల్డ్ కప్‌‌లో దాయాది పాకిస్తాన్‌‌పై టీమిండియా మరోసారి పైచేయి సాధించింది. లో స్కోరింగ్ థ్రిల్లింగ్ ఫైట్‌‌లో టీమిండియా విన్నర్‌‌‌‌గా నిలిచింది.  ఈ మెగా ఈవెంట్‌‌లో ఆ జట్టుతో ఎనిమిది మ్యాచ్‌‌ల్లో  ఏడోసారి గెలిచి తన రికార్డును 7–1కి పెంచుకుంది. ఆదివారం జరిగిన గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌లో 6 రన్స్‌‌  తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా  19 ఓవర్లలో 119 రన్స్‌‌కే ఆలౌటైంది. రిషబ్ పంత్ (31 బాల్స్‌‌లో 6 ఫోర్లతో 42) సత్తా చాటగా, అక్షర్ పటేల్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో నసీమ్‌‌ షా, హారిస్ రవూఫ్‌‌ చెరో మూడు వికెట్లు, మహ్మద్ఆమిర్‌‌‌‌ రెండు వికెట్ల దెబ్బకొట్టారు. ఇండియా టీమ్‌‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌‌కే పరిమితం అయ్యారు. ఛేజింగ్‌‌లో పాక్‌‌ ఓవర్లన్నీ ఆడి 113/7 స్కోరు చేసి ఓడింది. మహ్మద్ రిజ్వాన్ (31) పోరాడినా ఫలితం లేకపోయింది. బుమ్రాతో పాటు హార్దిక్‌‌ పాండ్యా (2/24), అక్షర్ పటేల్ (1/11) రాణించారు. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. వరుసగా రెండో విక్టరీతో టీమిండియా సూపర్‌‌‌‌8 బెర్తు దాదాపుఖాయం చేసుకోగా.. యూఎస్‌‌ఏతో పాటు ఇండియా చేతిలో ఓటమితో పాక్‌‌ అవకాశాలు సన్నగిల్లాయి. బుధవారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌లో ఇండియా ఆతిథ్య యూఎస్‌‌ఏతో తలపడనుంది. 

పంత్ పోరాటం..  

కష్టమైన పిచ్‌‌పై పాక్‌‌ పేసర్లు విసిరిన సవాల్‌‌ ముందు టాపార్డర్‌‌‌‌, లోయర్ మిడిలార్డర్‌‌‌‌ చేతులెల్తేసింది. రిషబ్ పంత్‌‌ ఒక్కడే ఆకట్టుకోగా.. అక్షర్ పటేల్ కాసేపు ప్రతిఘటించడంతో అతి కష్టంగా పాక్‌‌ ముందు 120 రన్స్ టార్గెట్ ఉంచింది. టాస్‌‌కు ముందు వచ్చిన వర్షం కారణంగా 50 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌‌ మొదలవగా.. షాహీన్ వేసిన తొలి ఓవర్ మూడో బాల్‌‌నే రోహిత్ (13)  సిక్స్‌‌గా మలిచి ఆకట్టుకున్నాడు.  తొలి ఓవర్ తర్వాత మరోసారి చినుకులు రావడంతో మరో 30 నిమిషాల వృథా అయ్యాయి. తిరిగి మొదలైన వెంటనే ఇండియాకు డబుల్ షాక్ తగిలింది. నసీమ్‌‌ బౌలింగ్‌‌లో ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ (4) ఔట్ సైడ్ ఆఫ్​ స్టంప్ బాల్‌‌ను ఉస్మాన్‌‌ ఖాన్ చేతుల్లోకి కొట్టాడు.  తర్వాతి ఓవర్లోనే  షాహీన్ ప్యాడ్స్ మీదకు వేసిన ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను రోహిత్ పికప్‌‌ షాట్‌‌తో గాల్లోకి లేపగా రవూఫ్‌‌ సింపుల్ క్యాచ్ పట్టాడు. పాక్ పేసర్లను రైట్ హ్యాండర్లను ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పంత్‌‌కు తోడుగా నాలుగో నంబర్‌‌‌‌లో అక్షర్‌‌ పటేల్‌‌ను బ్యాటింగ్‌‌కు పంపడం ఫలితం ఇచ్చింది. తొలుత కాస్త తడబడ్డ ఈ ఇద్దరూ తర్వాత జోరు పెంచారు. షాహీన్ వేసిన ఐదో ఓవర్లో అక్షర్‌‌‌‌ 4, 6తో ఎదురుదాడికి దిగాడు. ఆమిర్ బౌలింగ్‌‌లో  పంత్ రెండు ఫోర్లు కొట్టాడు. ఈ మధ్యలో అతనికిచ్చిన టఫ్ క్యాచ్‌‌ను ఉస్మాన్‌‌ డ్రాప్‌‌ చేశాడు. దాంతో పవర్‌‌‌‌ ప్లేను ఇండియా 50/2తో ముగించింది. ‌‌కానీ, నసీమ్ వేసిన 8వ ఓవర్లో అనవసర షాట్‌‌కు ట్రై చేసిన అక్షర్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో మూడో వికెట్‌‌కు 39 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ బ్రేక్ అయింది. ఇమాద్‌‌ వేసిన తొమ్మిదో ఓవర్లో పంత్‌‌ ఇచ్చిన మరో క్యాచ్‌‌ కూడా డ్రాప్ అయింది. 

ఈ చాన్స్‌‌ను సద్వినియోగం చేసుకున్న అతను.. రవూఫ్‌‌ బౌలింగ్‌‌లో హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. దాంతో సగం ఓవర్లకు ఇండియా 81/3తో నిలిచి మంచి స్కోరే చేసేలా కనిపించింది.  కానీ, పాక్ బౌలర్లు మళ్లీ జోరు పెంచి వరుస వికెట్లతో హడలెత్తించారు.  క్రీజులో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ (7)ను రవూఫ్‌‌ ఔట్‌‌ చేయగా.. హిట్టర్ శివం దూబే (3)  నసీమ్‌‌ షాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. 15వ ఓవర్లో  ఆమిర్‌‌‌‌ వరుస బాల్స్‌‌లో పంత్‌‌తో పాటు జడేజా (0)ను ఔట్‌‌ చేసి  దెబ్బకొట్టాడు.  ఏడు రన్స్ తేడాలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 96/7తో  పూర్తిగా డీలా పడింది. ఆల్‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా (7) కూడా ఆదుకోలేకపోయాడు. స్కోరు110 దాటిన తర్వాత రవూఫ్‌‌ బౌలింగ్‌‌లో ఎనిమిదో వికెట్‌‌గా వెనుదిరగ్గా.. తర్వాతి బాల్‌‌కే బుమ్రా (0) డకౌటయ్యాడు. టెయిలెండర్లు  అర్ష్​దీప్ సింగ్ (9), సిరాజ్ (7 నాటౌట్) చివర్లో విలువైన రన్స్ అందించారు. 19వ ఓవర్‌‌‌‌ ఆఖరి బాల్‌‌కు అర్ష్‌‌దీప్ రనౌటవ్వడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.  

బౌలర్లు సూపర్‌‌‌‌

చిన్న స్కోరును కాపాడుకునేందుకు ఇండియా బౌలర్లు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదల్లేదు. ఆరంభం నుంచే క్రమ శిక్షణతో బౌలింగ్ చేశారు.  తొలుత ఓపెనర్ రిజ్వాన్ క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు.  బుమ్రా వేసిన మూడో ఓవర్లో అతనిచ్చిన క్యాచ్‌‌ను దూబే డ్రాప్‌‌ చేశాడు. అయితే తన తర్వాతి ఓవర్లోనే స్లిప్‌‌లో సూర్య పట్టిన చురుకైన క్యాచ్‌‌కు కెప్టెన్‌‌ బాబర్ (13)ను ఔట్‌‌ చేసిన బుమ్రా ఇండియాకు ఫస్ట్  బ్రేక్‌‌ ఇచ్చాడు.  హార్దిక్ బౌలింగ్‌‌లో రిజ్వాన్ సిక్స్‌‌ కొట్టగా పవర్‌‌‌‌ ప్లేను పాక్‌‌ 35/1తో ముగించింది. వన్‌‌డౌన్ బ్యాటర్‌‌‌‌ ఉస్మాన్ ఖాన్‌‌ (13), రిజ్వాన్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఒక్కో పరుగు జత చేయడంతో సగం ఓవర్లకు పాక్‌‌ 57/1తో నిలిచింది. ఈ టైమ్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన స్పిన్నర్ అక్షర్ తన తొలి బాల్‌‌కే ఉస్మాన్‌‌ను ఎల్బీ చేశాడు. వచ్చీరాగానే ఓ సిక్స్‌‌, ఫోర్‌‌‌‌తో జోరు మీద కనిపించిన ఫకర్ జమాన్ (13)ను పాండ్యా పెవిలియన్ చేర్చడంతో ఇండియా రేసులోకి వచ్చింది. 15వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన బుమ్రా.. క్రీజులో కుదురుకున్న రిజ్వాన్‌‌ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేసి మూడే రన్స్ ఇచ్చాడు.  షాదాబ్ ఖాన్ (4), ఇఫ్తికార్ అహ్మద్ (5)  క్రీజులో ఉండగా చివరి 30 బంతుల్లో పాక్‌‌కు 37 రన్స్‌‌ అవసరం అయ్యాయి. 17వ ఓవర్లో అక్షర్ నాలుగు డాట్ బాల్స్ వేసి రెండే రన్స్‌‌ ఇవ్వడంతో  పాక్‌‌పై ఒత్తిడి పెరిగింది. పాండ్యా ఓ బౌన్సర్‌‌‌‌తో  షాదాబ్‌‌ను పెవిలియన్ చేర్చి పాక్‌‌ను మరో దెబ్బకొట్టాడు. 18వ ఓవర్లో సిరాజ్ ఓ నోబ్‌‌, వైడ్‌‌ సహా  9 రన్స్‌‌ ఇవ్వగా పాక్ విజయ సమీకరణం 12 బాల్స్‌‌లో 21గా మారింది. 19వ ఓవర్లో బుమ్రా మూడే ఇచ్చి ఇఫ్తికార్‌‌‌‌ను ఔట్‌‌ చేసి ఇండియా విజయం ఖాయం చేశాడు. చివరి ఓవర్లో నసీమ్ షా (10 నాటౌట్‌) వరుసగా రెండు ఫోర్లు కొట్టినా ఫలితం లేకపోయింది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా:  19 ఓవర్లలో 119 ఆలౌట్ (పంత్ 42, అక్షర్ 20, నసీమ్ 3/21, రవూఫ్ 3/21)
పాకిస్తాన్‌‌: 20 ఓవర్లలో 113/7 (రిజ్వాన్ 31, బుమ్రా 3/14, పాండ్యా 2/24)