జోరుమీదున్న టీమిండియా

జోరుమీదున్న టీమిండియా
  • డెత్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌పైనే దృష్టి
  • నేడు సౌతాఫ్రికాతో ఇండియా తొలి టీ20
  • జోరుమీదున్న టీమిండియా
  • మ్యాచ్‌‌‌‌కు వర్షం ముప్పు!
  • రా. 7 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో

తిరువనంతపురం:  ఆస్ట్రేలియాపై సిరీస్‌‌‌‌ గెలిచి టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌ను తారాస్థాయికి తీసుకెళ్లిన ఇండియా.. ఫైనల్‌‌‌‌ టచ్‌‌‌‌ కోసం రెడీ అయ్యింది. మెగా ఈవెంట్‌‌‌‌కు కౌంట్‌‌‌‌డౌన్‌‌‌‌ మొదలవడంతో.. బుధవారం సౌతాఫ్రికాతో జరిగే తొలి టీ20లో డెత్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను పూర్తిస్థాయిలో పరీక్షించుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్‌‌‌‌ తర్వాత రోహిత్‌‌‌‌సేనకు షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో ఆడే చాన్స్‌‌‌‌ లేకపోవడంతో ఈ మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను కంప్లీట్‌‌‌‌గా సద్వినియోగం చేసుకుని ఆసీస్‌‌‌‌లో ఆడే ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ను సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నేపథ్యంలో హార్దిక్‌‌‌‌ పాండ్యా, భువనేశ్వర్‌‌‌‌కు రెస్ట్‌‌‌‌ ఇచ్చారు. షమీ ఇంకా కొవిడ్‌‌‌‌ నుంచి కోలుకోలేదు. కాబట్టి ఈ సిరీస్‌‌‌‌లో యంగ్‌‌‌‌ బౌలర్లపై కాస్త ఒత్తిడి పెరిగింది. 

హర్షల్‌‌‌‌ గాడిలో పడేనా?

ఆస్ట్రేలియాతో సిరీస్‌‌‌‌లో ఫెయిలైన హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఉండటం.. మూడు మ్యాచ్‌‌‌‌లే ఆడే చాన్స్‌‌‌‌ ఉండటంతో అతను గాడిలో పడతాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ చాన్స్‌‌‌‌ మిస్‌‌‌‌ చేసుకుంటే ఆసీస్‌‌‌‌లో అతను బెంచ్‌‌‌‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మూడు మ్యాచ్‌‌‌‌ల్లో హర్షల్ కచ్చితంగా ప్రభావం చూపాల్సిందే. 9.05గా ఉన్న హర్షల్‌‌‌‌ కెరీర్‌‌‌‌ ఎకానమీ ఆసీస్‌‌‌‌పై 12కు పెరగడంతో ఆందోళన మొదలైంది. స్టాండ్‌‌‌‌ బై ప్లేయర్‌‌‌‌గా ఉన్న దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ దక్కొచ్చు. యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ రావడం టీమిండియా స్లాగ్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌ బలాన్ని పెంచింది. బుమ్రాతో కలిసి మ్యాజిక్‌‌‌‌ చేస్తాడని భావిస్తున్నారు. అయితే గాయం నుంచి కోలుకుని వస్తున్న అతను బౌలింగ్‌‌‌‌ లయను అందుకోవాల్సి ఉంది. స్పిన్నర్‌‌‌‌గా తాను ఏం చేయగలనో చహల్‌‌‌‌ ఆసీస్‌‌‌‌పై ఇప్పటికే చూపించాడు. ఆ ఫామ్‌‌‌‌ను కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సీనియర్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌కు ఈ సిరీస్‌‌‌‌లో చాన్స్‌‌‌‌ ఇస్తే కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరుగుతుంది. బ్యాటింగ్‌‌‌‌లో ఇండియాకు పెద్దగా ఇబ్బందుల్లేవు. అయితే కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ మాత్రం భారీ ఇన్నింగ్స్‌‌‌‌ బాకీ ఉన్నాడు. ఆసీస్‌‌‌‌తో రెండో మ్యాచ్‌‌‌‌లో ఆడిన తీరు చూస్తే రోహిత్‌‌‌‌కు పెద్దగా ఇబ్బందిలేనట్లే. ఇక విరాట్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌ టాప్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఈ ఇద్దర్ని ఆపాలంటే సఫారీలు బౌలింగ్‌‌‌‌లో కొత్త ప్రయోగాలు చేయాల్సిందే. రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌, సూపర్‌‌‌‌ ఫినిషర్‌‌‌‌ దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌కు తోడు అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ చెలరేగితే ఇండియా గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. 

స్టబ్స్‌‌‌‌ ఏం చేస్తాడో?

సౌతాఫ్రికా కూడా ఈ సిరీస్‌‌‌‌ను వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌ కోసమే ఉపయోగించుకుంటున్నది. ఇందులో గెలిస్తే ఫుల్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌తో ఆసీస్‌‌‌‌కు బయలుదేరొచ్చని ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. కెప్టెన్‌‌‌‌ బవుమా తిరిగి రావడం సఫారీల బ్యాటింగ్‌‌‌‌ బలాన్ని పెంచింది. అయితే బవుమా కోసం సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న రెజా హెండ్రిక్స్‌‌‌‌ను పక్కనబెట్టడమే కాస్త ఇబ్బందికర అంశం. ఓపెనింగ్‌‌‌‌లో డికాక్‌‌‌‌ విధ్వంసం సృష్టిస్తే ఇండియాకు ఇబ్బందులు తప్పవు. ఫ్రాంచైజీ క్రికెట్‌‌‌‌లో దుమ్మురేపిన రోసోవ్‌‌‌‌, స్టబ్స్‌‌‌‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. మార్‌‌‌‌క్రమ్‌‌‌‌, మిల్లర్‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌ బాధ్యతలు మోయనున్నారు. బౌలింగ్‌‌‌‌లో పెహుల్‌‌‌‌క్వాయో, ప్రిటోరియస్‌‌‌‌, జెన్‌‌‌‌సెన్‌‌‌‌, రబాడ, నోర్జ్‌‌‌‌ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఏకైక స్పిన్నర్‌‌‌‌గా శంసి టీమ్‌‌‌‌లోకి రావొచ్చు.