- టీమిండియా మూడో వన్డే
- 2-0తో సిరీస్ సొంతం
- చెలరేగిన కోహ్లీ, శ్రేయస్
మొన్న పొట్టి ఫార్మాట్ సిరీస్.. ఇప్పుడు వన్డే సిరీస్..! వరల్డ్‌కప్ వైఫల్యం తర్వాత కరీబియన్ గడ్డపై మొదలుపెట్టిన రెండు సిరీస్‌ల్లోనూ తిరుగులేని ఆటతో టీమిండియా చెలరేగిపోయింది..! శ్రేయస్ అయ్యర్ రూపంలో మిడిలార్డర్‌లో చేసిన ఏకైక ప్రయోగం సూపర్ సక్సెస్ కావడం.. కెప్టెన్ కోహ్లీ వరుస సెంచరీలతో రికార్డులు బద్దలు కొట్టడంతో… మూడు మ్యాచ్‌ల సిరీస్ 2-0తో సొంతమైంది..! వరుణుడు వెంటాడినా.. టార్గెట్ పెరిగినా.. గత మ్యాచ్‌లో మాదిరిగానే ‘విరాట్.. అయ్యారే’ అనిపించడంతో మూడో వన్డేలోనూ ఇండియా అద్భుత విజయం సాధించింది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కెప్టెన్ విరాట్ కోహ్లీ (99 బంతుల్లో 14 ఫోర్లతో 114 నాటౌట్) సెంచరీకి తోడుగా, శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 65) చెలరేగడంతో.. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇండియా 6 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) వెస్టిండీస్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2–0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఓవర్లు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ 35 ఓవర్లలో 7 వికెట్లకు 240 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (41 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 72), లూయిస్ (29 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 43) తొలి వికెట్‌కు 115 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. మిడిలార్డర్‌లో హోప్ (24), హెట్‌మయర్ (25), మూడో వికెట్‌కు 50 పరుగులు జత చేశారు. తర్వాత పూరన్ (30), హోల్డర్ (14) ఐదో వికెట్‌కు 40 పరుగులు సమకూర్చడంతో విండీస్ భారీ స్కోరు సాధ్యమైంది. ఖలీల్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు.
వరుసగా రెండో సెంచరీ
వర్షం కారణంగా ఇండియా టార్గెట్‌ను 35 ఓవర్లలో 255 రన్స్‌గా సవరించారు. దీనిని టీమిండియా 32.3 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసి ఛేదించింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ (10) విఫలమైనా.. ధవన్ (36) ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో కోహ్లీతో కలిసి నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 66 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను పటిష్టం చేశారు. అయితే 13వ ఓవర్‌లో మూడు బంతుల తేడాలో ధవన్, రిషబ్ (0) ఔట్ కావడంతో విరాట్‌సేన 92 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. కానీ ఓ ఎండ్‌లో కోహ్లీ బౌండరీల జోరు చూపెట్టడం, మరో ఎండ్‌లో శ్రేయస్ సిక్సర్ల వర్షం కురిపించడంతో ఇండియా ఛేజింగ్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో అయ్యర్ (33 బాల్స్) హాఫ్ సెంచరీ, కోహ్లీ (94 బాల్స్) కెరీర్‌లో 43వ సెంచరీ సాధించారు. ఈ సిరీస్‌లో విరాట్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. 29వ ఓవర్‌లో అయ్యర్‌ను రోచ్ ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఇండియా గెలవాలంటే 40 బంతుల్లో 43 పరుగులు అవసరమైన దశలో కేదార్ (19 నాటౌట్) సమయోచితంగా ఆడాడు. విరాట్‌తో కలిసి వేగంగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ అవసరమైనప్పుడు బౌండరీలు బాదడంతో ఇండియా విజయ లాంఛనం పూర్తయింది. అలెన్ 2 వికెట్లు తీశాడు. కోహ్లీకి‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘సిరీస్’ అవార్డులు లభించాయి.
విరాట్ వేలికి గాయం!
టార్గెట్ ఛేజింగ్‌లో విరాట్ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో రోచ్ వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో బంతి బలంగా కోహ్లీ వేలికి తాకింది. దీంతో నొప్పితో విలవిలలాడిన కెప్టెన్.. వెంటనే ఫిజియోతో ప్రాథమిక చికిత్స తీసుకున్నాడు. ఎలాంటి వాపు లేకపోవడంతో బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే వేలి ఎముకలో ఫ్రాక్చర్ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘బంతి తాకిన తర్వాత నొప్పి ఎక్కువగా ఉండటంతో కాసేపు ఇబ్బందిపడ్డా. తర్వాత అంతా సర్దుకుంది. ఇప్పటికైతే తొలి టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నా’ అని మ్యాచ్ అనంతరం విరాట్ వ్యాఖ్యానించాడు.
కోహ్లీ @ 20000
తన బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక దశాబ్ద కాలంలో మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేల రన్స్ చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ (20, 502) రికార్డులకెక్కాడు. 2010లో టీ20, 2011లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విరాట్.. 2008లోనే తొలి వన్డే ఆడాడు. టెస్ట్‌ల్లోకి వచ్చేసరికే అతను 50 ఓవర్ల ఫార్మాట్‌లో 484 రన్స్ చేశాడు. ఫలితంగా ఆన్‌గోయింగ్ డెకెడ్ (2010 నుంచి) లో విరాట్ చేసిన పరుగులు 20, 018. ఓవరాల్‌గా ఈ జాబితాలో ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ (18, 962) సెకండ్ ప్లేస్‌లో, కలిస్ (16, 777) మూడో స్థానంలో ఉండగా, మహేల జయవర్దనె (16, 304), సంగక్కర (15, 999) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇండియా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ (15, 962), ద్రవిడ్ (15, 853) వరుసగా ఆరు, ఏడు ప్లేస్‌ల్లో ఉన్నారు.
స్కోరు బోర్డు
వెస్టిండీస్: 35 ఓవర్లలో 240/7;
ఇండియా (టార్గెట్ 255): రోహిత్ (రనౌట్) 10, ధవన్ (సి) పాల్ (బి) అలెన్ 36, కోహ్లీ (నాటౌట్) 114, రిషబ్ (సి) పాల్ (బి) అలెన్ 0, అయ్యర్ (సి) హోల్డర్ (బి) రోచ్ 65, జాదవ్ (నాటౌట్) 19, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 32.3 ఓవర్లలో 256/4. వికెట్లపతనం: 1–25, 2–91, 3–92, 4–212. బౌలింగ్: రోచ్ 7–0–53–1, హోల్డర్ 4–0–39–0, పాల్ 5–0–39–0, అలెన్ 6–0–40–2, ఛేజ్ 7–-0–43–0, బ్రాత్‌వైట్ 3.3–0–38–0.-

