ఈసీ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తాం... ఢిల్లీ హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీ రిప్లై...

ఈసీ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తాం...  ఢిల్లీ హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీ రిప్లై...

తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు రిజిస్ట్రేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఈసీ కవిత పార్టీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈసీ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తామని ఢిల్లీ హైకోర్టులో రిప్లై ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్. వారం రోజుల్లో సమాధానం ఇస్తామని... ఆ తర్వాత వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరారు.

ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై అభ్యంతరాలు కోరుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని.. రెండు పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను మాత్రమే తమకు ఈసీ పంపగా వాటికి సమాధానాలు ఇచ్చామని తెలిపారు. పార్టీ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చిన క్రమంలో మరో మూడు పేర్లను సూచించాలని తమకు నోటీసులు ఇచ్చారని వివరించారు.

తమ పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాలు ఏమిటో తెలుసుకునే హక్కు తమకు ఉందని... ఆ అభ్యంతరాలన్నీ తమకు పంపాలని విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ తరపు అడ్వకేట్. న్యాయమూర్తి స్పందిస్తూ... ముందుగా ఈసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాలని సూచించారు వారం రోజుల్లో ఈసీకి సమాధానం ఇస్తామని టీఆర్ఎస్ అడ్వకేట్ తెలిపారు.. పార్టీ పేరుపై నిర్ణయం తీసుకునే ముందు తాము ఈసీ హియరింగ్ నిర్వహించి తమ వాదనలు వినిపించే అవకాశం ఇస్తూ ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ తరపు అడ్వకేట్. 

టీఆర్ఎస్ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈసీ నోటీసులకు తెలంగాణ రక్షణ సేన పార్టీ బదులిచ్చిన తర్వాత వారి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని ఆదేశించారు.

తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో తాము పార్టీ రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకున్నామని.. కేంద్ర ఎన్నికల సంఘమే తమ అప్లికేషన్ లో ఉన్న మూడో పేరు తెలంగాణ రక్షణ సేన కేటాయిస్తూ అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. తమ పార్టీ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని చెప్తున్నారు తప్ప అవి ఏమిటో తమకు ఇవ్వడం లేదని అన్నారు.

ఈసీ ఇచ్చిన అనుమతితోనే తాము తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా గద్దెలు నిర్మించూకొని పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈసీ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తామని.. ఆ తర్వాత తమ పార్టీ చీఫ్ కవిత ఈసీ ఎదుట వ్యక్తిగతంగా హాజరు అయి పార్టీ పేరుపై వివరణ ఇస్తారని తెలిపారు.

ఇప్పటికే తెలంగాణలో TRS అబ్రివేషన్ వచ్చేలా రెండు రాజకీయ పార్టీలకు ఈసీ గుర్తింపును ఇచ్చిందని... ఒకపార్టీ 2023లో, మరో పార్టీ 2024లో రిజిస్ట్రేషన్ అయ్యాయని అన్నారు.  2026లో తాము తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీ ఆదేశాల మేరకు పత్రిక ప్రకటనలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నామని.. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అతిమంగా గెలిచేది న్యాయమే అని స్పష్టం చేశారు.