బాలీవుడ్ డైరెక్టర్స్ అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, నిఖిల్ అద్వానీ, వసన్ బాలా.. ఎప్పటి నుంచో ఇండిపెండెంట్ సినిమాలకు అండగా నిలుస్తు వస్తున్నారు. రీసెంట్గా ఈ పాపులర్ డైరెక్టర్స్ మరో ఇంట్రెస్టింగ్ మూవీకి మద్దతుగా నిలిచి సూపర్ సక్సెస్ అయ్యారు. అదే యంగ్ డైరెక్టర్ రిథ్విక్ పరీక్ తెరకెక్కించిన ‘డగ్ డగ్’ (Dug Dug). ఈ సినిమాకు వీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించి మరో వినూత్న కథకు మద్దతు ఇచ్చారు. మత విశ్వాసాలు, మూఢనమ్మకాల నేపథ్యంలో వ్యంగ్యంగా రూపొందిన ఈ కామెడీ-మిస్టరీ-సెటైరికల్, మే 8న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇపుడు ఈ మూవీ ఓటీటీకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది.
సాధారణంగా దేవుడు, మతం వంటి అంశాలపై సినిమాలు అంటే ఎక్కువగా సీరియస్‌గా తెరకెక్కిస్తుంటారు. కానీ దర్శకుడు రిథ్విక్ పరీక్ మాత్రం అదే అంశాన్ని వ్యంగ్యంతో, వినోదంతో మిళితం చేసి ‘డగ్ డగ్’ను సెటైరికల్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూవీ ఇవాళ జూలై 8 నుంచి ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. రాజస్థాన్ లోని ఫేమస్ ‘బుల్లెట్ బాబా’రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ కథను చాలా విచిత్రంగా డిజైన్ చేశారు.
#DugDug (2026) by #RitwikPareek, now streaming on @PrimeVideoIN.
— CinemaRare (@CinemaRareIN) July 8, 2026
Ft. #AltafKhan #GauravSoni #YogendraSingh & #DurgalalSaini.@anuragkashyap72 @nikkhiladvani #VikramdityaMotwane #VasanBala @cinemakasam @ankurtewari #SalvageAudioCollective @FilmyNerd @GauravSoni_1995… pic.twitter.com/iCdLvOipCm
కథేంటంటే?
మద్యం బానిసైన ఠాకూర్ (అల్తాఫ్ ఖాన్) ఒక రాత్రి హైవేపై బైక్ నడుపుతూ ప్రమాదంలో మరణిస్తాడు. అతని బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌లో ఉంచుతారు. అయితే మరుసటి ఉదయం ఆ బైక్ పోలీస్ స్టేషన్ నుంచి అదృశ్యమై, ఠాకూర్ చనిపోయిన ప్రమాద స్థలంలోనే కనిపిస్తుంది.
పోలీసులు మళ్లీ బైక్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చినా అదే ఘటన పదేపదే జరుగుతుంది. ఎన్నిసార్లు లాక్ చేసినా, చైన్లతో కట్టేసినా కూడా ఆ బైక్ మళ్లీ అదే ప్రమాద స్థలానికి చేరుకుంటుంది. ఈ విచిత్ర ఘటనలు గ్రామస్థుల్లో ఆసక్తిని, ఆ తర్వాత భక్తిని పెంచుతాయి.
చివరకు ఆ బైక్‌ను దైవంగా భావించి పూజలు చేయడం మొదలుపెడతారు. మద్యం నైవేద్యంగా సమర్పిస్తే కోరికలు నెరవేరుతున్నాయనే ప్రచారం మొదలవుతుంది. ఆ నమ్మకం క్రమంగా కొత్త మతంగా మారుతుంది. ఈ విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక పూజారులు, రాజకీయ నాయకులు, వ్యాపార దృక్పథం ఉన్న వ్యక్తులు కోట్ల రూపాయల బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంటారనేదే సినిమా మెయిన్ స్టోరీ.
ఎలా ఉందంటే?
దేవుడు, మతం వంటి అంశాలపై సాధారణంగా చాలా సీరియస్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. కానీ దర్శకుడు రిథ్విక్ పరీక్ మాత్రం అదే అంశాన్ని సెటైరికల్ కామెడీ రూపంలో చూపించి ప్రత్యేకంగా నిలిచాడు. నవ్వులు పంచుతూనే సమాజంలోని మూఢనమ్మకాలపై గట్టి ప్రశ్నలు లేవనెత్తాడు.
ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో, కష్టాల్లో ఉన్న ప్రజలకు నమ్మకం, ఆశ ఎంత బలమైన ఆధారంగా మారుతాయో దర్శకుడు సహజంగా చూపించాడు. అదే సమయంలో ఆ విశ్వాసాన్ని కొందరు స్వార్థపరులు ఎలా వ్యాపారంగా మార్చుకుంటారో ఎక్కడా బోరింగ్ అనిపించకుండా వ్యంగ్యంగా ఆవిష్కరించాడు. నియాన్ లైటింగ్ తో కూడిన రాజస్థాన్ ఎడారి అందాలు, విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి
సినిమాలో కామెడీ, సెటైర్, మిస్టరీ అంశాలు సమతుల్యంగా నడుస్తాయి. కొన్ని సన్నివేశాలు నవ్విస్తే, మరికొన్ని సమాజంలో జరుగుతున్న వాస్తవాలను గుర్తు చేస్తూ ఆలోచింపజేస్తాయి. ఎక్కడా ఒక వర్గాన్ని లేదా మతాన్ని లక్ష్యంగా చేసుకున్న భావన రాకుండా కథను నడిపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికి ‘డగ్ డగ్’ కేవలం కామెడీ సినిమా కాకుండా, మూఢనమ్మకాలు, విశ్వాసం, వాటి చుట్టూ ఏర్పడే వ్యాపార వ్యవస్థపై వ్యంగ్యంగా ప్రశ్నలు లేవనెత్తే ఇంటెలిజెంట్ సెటైరికల్ డ్రామా.
నటీనటుల నటన
అల్తాఫ్ ఖాన్ ఠాకూర్ పాత్రలో సహజంగా నటించాడు. గౌరవ్ సోనీ, యోగేంద్ర సింగ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దుర్గా లాల్ సైనీ, హేమంత్ శర్మ, జగదీష్ ప్రసాద్ తక్, రాజు గుజ్జర్, ప్రియాంక ఖండేకర్ తదితరులు కథకు అవసరమైన బలాన్ని అందించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ సినిమాకు మంచి టెక్నికల్ క్వాలిటీ కనిపిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ని సహజంగా చూపించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.
