ట్రంప్ టారిఫ్‌‌‌‌‌‌లపై ఇండియా ఆచితూచి..ప్రతీకార సుంకాలు వేయొద్దని నిర్ణయం

ట్రంప్ టారిఫ్‌‌‌‌‌‌లపై ఇండియా ఆచితూచి..ప్రతీకార సుంకాలు వేయొద్దని నిర్ణయం
  • ప్రతీకార సుంకాలు వేసే ఉద్దేశం ఇండియాకు లేదు
  • అమెరికాతో ట్రేడ్ డీల్‌కే  ప్రాధాన్యం.. ఈ నెల 25 నుంచి కొనసాగనున్న చర్చలు  
  • వ్యవసాయం, డెయిరీ సెక్టార్లపై రాజీ పడేదే లేదు: పీయూష్ గోయల్‌‌‌‌
  • టారిఫ్‌‌‌‌లతో అమెరికాలో 5 లక్షల జాబ్స్ పోతాయని అంచనా


న్యూఢిల్లీ:  అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్  ట్రంప్ 25 శాతం టారిఫ్ వేస్తామని ప్రకటించినప్పటికీ, ఇండియా మాత్రం ప్రతీకార సుంకాలను విధించకూడదని నిర్ణయించుకుంది. మన దేశానికి యూఎస్‌‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024–25 లో సుమారు 87 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్‌‌‌‌ను  ఎగుమతి చేశాం.  అందువలన ట్రంప్ టారిఫ్‌‌‌‌లపై ఆచితూచి అడుగువేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.  జాతీయ ప్రయోజనాలపై  రాజీ పడమని, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, రైతులు, చిన్న వ్యాపారాలను కాపాడుతామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్  పార్లమెంట్‌‌‌‌లో తెలిపారు. టారిఫ్‌‌‌‌ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది.    

రష్యాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయని, జాతీయ భద్రత ఆధారంగా రక్షణ కొనుగోళ్లు జరుగుతాయని  తెలిపింది. భారత్  ప్రతీకార టారిఫ్‌‌‌‌లు విధించే బదులు, వాణిజ్య ఒప్పంద చర్చలపై దృష్టి సారించింది. అమెరికా, ఇండియా  ట్రేడ్ డీల్‌‌‌‌కు సంబంధించి ఈ నెల 25 నుంచి మరో రౌండ్ చర్చలు మొదలుకానున్నాయి. ఇరు దేశాలు కూడా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌– అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నాటికి తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నాయి. ఈలోపు అమెరికాను శాంతిపరిచేందుకు  హార్లే-డేవిడ్‌‌‌‌సన్ మోటార్‌‌‌‌సైకిళ్లు, బోర్బన్ విస్కీ వంటి 23 బిలియన్ డాలర్ల  విలువైన అమెరికా దిగుమతులపై ఇండియా టారిఫ్‌‌‌‌లు తగ్గించాలని నిర్ణయించుకుంది. 

ఇండియా ప్లాన్స్‌‌‌‌..

ట్రేడ్‌ డీల్‌:   ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ద్వారా  టారిఫ్‌‌‌‌లను తగ్గించుకోవాలని ఇండియా చూస్తోంది.  ఈ ఒప్పందం కింద అమెరికా, ఇండియా మధ్య జరుగుతున్న వాణిజ్యాన్ని ఇంకో ఐదేళ్లలో ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్‌‌‌‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా.  అయితే, వ్యవసాయం, డెయిరీ, జన్యు మార్పిడి విత్తనాలు, ఆహారాలపై తమ వైఖరి మారదని  భారత్ స్పష్టం చేసింది.

ఇతర దేశాలతో ఒప్పందాలు: ఒకవైపు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటూనే, ఇతర దేశాలతో కూడా ఇండియా చర్చలు జరుపుతోంది.  యూరప్, ఆఫ్రికా, ఏషియన్ కూటమితో  వాణిజ్యాన్ని విస్తరించడం, ప్రొడక్షన్‌‌‌‌ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌‌‌‌ఐ)  స్కీమ్‌‌‌‌ల ద్వారా ఎలక్ట్రానిక్స్, టెక్స్‌‌‌‌టైల్స్, ఆటోమొబైల్స్‌‌‌‌లో  ప్రొడక్షన్ పెంచుకోవడంపై దృష్టి సారించింది. 

ప్రతీకార టారిఫ్‌‌‌‌లు: గతంలో (2019) భారత్ అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార టారిఫ్‌‌‌‌లు విధించింది. అయినప్పటికీ  ప్రస్తుతం మాత్రం సంయమనం పాటిస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైతే ప్రతీకార టారిఫ్‌‌‌‌లను వేయడానికి మొగ్గు చూపొచ్చు. 
చైనా కంటే బెటర్‌‌‌‌‌‌‌‌:  అమెరికా చైనాపై 54శాతం టారిఫ్‌‌‌‌లు వేయగా,  ఇండియాపై  25 శాతం వేయనుంది. దీంతో మనకు కొంత ప్రయోజనం ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.  టెక్స్‌‌‌‌టైల్స్ వంటి రంగాల్లో లబ్ధి పొందవచ్చని  భావిస్తున్నారు. కాగా, ట్రంప్ తాజా టారిఫ్‌‌‌‌లు ఈ నెల 7 నుంచి అమల్లోకి రానున్నాయి.  ఈసారి ట్రంప్ కూడా ఆచితూచి సుంకాలు వేశారు. తాత్కాలికంగా ఇండియా ఫార్మా, ఆటోమొబైల్ విడిభాగాలు, మెటల్స్‌‌‌‌పై మినహాయింపులు ఇచ్చారు. 

ఇరు దేశాలకూ నష్టమే..

భారత్‌‌‌‌: అమెరికాకు జరిగే 87 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులలో 85శాతంపై టారిఫ్ ఎఫెక్ట్ ఉంటుందని అంచనా.   టారిఫ్‌‌‌‌లు అమల్లోకి వస్తే ఫార్మా , ఆటోమొబైల్స్, టెక్స్‌‌‌‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, సీ ఫుడ్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇక్రా, నోమురా అంచనాల ప్రకారం ఇండియా జీడీపీ  వృద్ధి 0.2-–0.5శాతం తగ్గొచ్చు.   అయితే,  బలమైన దేశీయ వినియోగం, సేవల రంగం కారణంగా టారిఫ్‌‌‌‌ల ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా. 

అమెరికా: టారిఫ్‌‌‌‌లతో  అమెరికాలో ధరలు విపరీతంగా పెరుగుతాయి.  అక్కడ షూస్ రేట్లు  40శాతం, దుస్తుల ధరలు 38శాతం ఎక్కువవుతాయి. యేల్ యూనివర్సిటీ బడ్జెట్ ల్యాబ్ ప్రకారం, వినియోగదారులు సంవత్సరానికి అదనంగా 2,400 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 115 బిలియన్ డాలర్లు  నష్టపోవచ్చు.  ఈ ఏడాది చివరి నాటికి 5 లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా.  భారత్ ఫార్మా, ఎలక్ట్రానిక్స్, జెమ్స్‌‌‌‌పై అమెరికా ఆధారపడటం వల్ల ధరల పెరుగుదల, ఉత్పత్తి కొరత తలెత్తే అవకాశం ఉంది.