
వారెవ్వా.. ఆట అంటే ఇది..! ఆధిపత్యం అంటే ఇది..! పెర్ఫామెన్స్ అంటే ఇది..! టెస్ట్ మ్యాచ్‌ను గెలవడమంటే ఇలా..! పేస్‌తో పడగొట్టారు.. స్వింగ్‌తో వణికించారు.. స్పిన్‌తో చుట్టేశారు..! బ్యాట్స్‌మెన్ పరుగుల పండుగ చేసుకున్న చోట.. బౌలర్లూ వికెట్ల జాతర చూపెట్టారు..! ఫలితంగా పుణె టెస్ట్‌ను నాలుగు రోజుల్లోనే ముగించిన టీమిండియా 2–0తో సిరీస్‌ను పట్టేసింది..! దీనికి తోడు సొంతగడ్డపై తమకు ఎదురులేదని నిరూపించుకున్న విరాట్‌సేన.. వరుసగా11వ సిరీస్ విజయంతో ‘వరల్డ్ రికార్డు’నూ సొంతం చేసుకుంది..! అలాగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లోనూ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంటూ ప్రపంచ ప్రత్యర్థులకు సరికొత్త సవాలు విసిరింది..!!
రెండో టెస్ట్‌లోనూ టీమిండియాదే విక్టరీ
2-0తో సిరీస్ కైవసం
ఇన్నింగ్స్137 రన్స్ తేడాతో ఓడిన సౌతాఫ్రికా
పుణె: రెండో టెస్ట్‌లోనూ టీమిండియా జూలు విదిల్చింది. గతంలో ఎన్నడూ లేనంత బలమైన బౌలింగ్‌తో నాలుగు రోజుల్లోనే సౌతాఫ్రికాకు చెక్ పెట్టింది. ఉమేశ్ యాదవ్ (3/22) పేస్‌కు .. జడేజా (3/52) స్పిన్ మ్యాజిక్ తోడుకావడంతో.. ఆదివారమే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ప్రొటీస్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. అలాగే సొంతగడ్డపై వరుసగా 11వ సిరీస్‌ను ఒడిసి పట్టుకుని ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లోనూ టీమిండియా 200 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నది. న్యూజిలాండ్ 60 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కెప్టెన్‌గా 50వ టెస్ట్‌కు సారథ్యం వహించిన విరాట్.. విజయంతో పాటు వ్యక్తిగత, ప్రపంచ రికార్డులను కూడా మూటగట్టుకున్నాడు. ఇరుజట్ల మధ్య మూడో టెస్ట్ ఈ నెల 19 నుంచి రాంచీలో జరుగుతుంది.
మళ్లీ తడబ్యాటే..
తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌటైన సౌతాఫ్రికాను.. నాలుగో రోజు టీమిండియా ఫాలో ఆన్ ఆడించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 67.2 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. ఎల్గర్ (48) టాప్ స్కోరర్. ఫాలో ఆన్‌లోనూ ప్రొటీస్ బ్యాటింగ్.. తొలి ఇన్నింగ్స్‌ను తలపించింది. ఇషాంత్, ఉమేశ్ రెండు వైపుల నుంచి స్వింగ్‌తో బెంబెలేత్తించినా.. ఎల్గర్ మాత్రమే కాసేపు పోరాడాడు. తన రెండో బంతికే ఇషాంత్.. ఓ ఫుల్ లెంగ్త్ డిప్పర్‌తో మార్‌క్రమ్ (0)ను ఎల్బీ చేయడం, అంపైర్ ఔటివ్వడం చకచకా జరిగిపోయాయి. ఎల్గర్‌తో సుదీర్ఘంగా చర్చించిన మార్‌క్రమ్ రివ్యూకు వెళ్లలేదు. కానీ బంతి లెగ్ స్టంప్ మిస్సయినట్లు టీవీ రీప్లేలో స్పష్టమైంది. కొద్దిసేపటికే ఉమేశ్ వేసిన ఇన్‌స్వింగర్‌ను డీబ్రూన్ (8) గ్లాన్స్ చేశాడు. కానీ వికెట్ల వెనుక సాహా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా ప్రొటీస్ 21 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డుప్లెసిస్ (5) కాసేపు డిఫెన్స్‌తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఎల్గర్‌తో కలిసి మూడో వికెట్‌కు 49 రన్స్ జోడించాడు. కానీ అశ్విన్ (2/45) ఆఫ్ బ్రేక్ ముందు కెప్టెన్ అల్ట్రా డిఫెన్స్ పద్ధతి పారలేదు. అశ్విన్ తన వరుస ఓవర్లలో డుప్లెసిస్, ఎల్గర్‌ను ఔట్ చేయడంతో సఫారీ టీమ్ 74/4తో లంచ్‌కు వెళ్లింది.
మళ్లీ ఆ ఇద్దరే..
లంచ్ తర్వాత జడేజా టర్నింగ్ మ్యాజిక్ చూపెట్టాడు. ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నంలో బవూమ (38) మొండిగా ఆడినా.. రెండో ఎండ్‌లో డికాక్ (5)ను ఔట్ చేసి వికెట్ల పతనాన్ని కొనసాగించాడు. 29వ ఓవర్‌లో జడేజా బంతిని స్లాగ్ స్వీప్ చేయబోయి డికాక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ముత్తుసామి (9)ని నిలబెట్టి ఎక్కువగా స్ట్రయిక్ తీసుకున్న బవూమ చకచకా బౌండరీలు బాదాడు. అయితే జడేజా టర్న్‌ను అర్థం చేసుకోలేక 44వ ఓవర్‌లో వికెట్ ఇచ్చుకున్నాడు. కొద్దిసేపటికే ముత్తుసామి కూడా ఔట్‌కావడంతో ప్రొటీస్ స్కోరు 129/7గా మారింది. ఈ దశలో తొలి ఇన్నింగ్స్ హీరోలు కేశవ్ మహారాజ్ (22), ఫిలాండర్ (37) మళ్లీ పోరాటం మొదలుపెట్టారు. దాదాపు 21.2 ఓవర్ల పాటు క్రీజులో ఉండి ఇండియా విజయాన్ని ఆలస్యం చేశారు. ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 56 రన్స్ జోడించడంతో తేరుకున్న సౌతాఫ్రికా టీ విరామానికి 172/7 స్కోరు సాధించింది. బ్రేక్ తర్వాత మరో 6.2 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా 17 పరుగులు జత చేసి ఆలౌటైంది.
—–
ప్రత్యర్థి ఏడాది రిజల్ట్
ఆస్ట్రేలియా 2013 4-0 (4)
వెస్టిండీస్ 2013 2-0 (2)
సౌతాఫ్రికా 2015 3-0 (4)
న్యూజిలాండ్ 2016 3-0 (3)
ఇంగ్లండ్ 2016 4-0 (5)
బంగ్లాదేశ్ 2017 1-0 (1)
ఆస్ట్రేలియా 2017 2-1 (4)
శ్రీలంక 2017 1-0 (3)
అఫ్గానిస్థాన్ 2018 1-0 (1)
వెస్టిండీస్ 2018 2-0 (2)
సౌతాఫ్రికా 2019 2-0 (2)*
విరాట్ కెప్టెన్సీలో ఇండియా రికార్డు
స్వదేశీ విదేశీ
మ్యాచ్‌లు 23 27
విజయాలు 17 13
కెప్టెన్‌గా 50 టెస్ట్‌ల్లో విరాట్ సాధించిన విజయాలు. సారథిగా తొలి 50 టెస్ట్‌ల్లో స్టీవ్ వా (37), రికీ పాంటింగ్ ( 35) మాత్రమే కోహ్లీ కంటే ఎక్కువ విజయాలు సాధించారు.
ఇన్నింగ్స్ పరుగుల తేడాతో గెలువడం కోహ్లీకి ఇది ఎనిమిదోసారి. ధోనీ (9) ముందున్నాడు.
ఇండియా.. సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం చరిత్రలో ఇదే తొలిసారి. 2008 తర్వాత ప్రొటీస్ ఫాలో ఆన్ ఆడడం కూడా ఇదే ఫస్ట్. ఇన్నింగ్స్137 రన్స్ తేడాతో పుణెలో సాధించిన విజయమే.. సఫారీలపై టీమిండియాకు టెస్ట్‌ల్లో అతిపెద్ద గెలుపు. 2009 కోల్‌కతాలో జరిగిన టెస్ట్‌లో ఇండియా ఇన్నింగ్స్ 57 రన్స్ తేడాతో ప్రొటీస్‌ను ఓడించింది. ఓవరాల్‌గా సఫారీ జట్టు రెండుసార్లు ఇన్నింగ్స్ ఓటమలు చవిచూడగా, ఆ రెండు ఇండియా చేతిలోనే కావడం విశేషం.
India win by an innings and 137 runs, sealing the series against South Africa and maintaining their 100 per cent World Test Championship record ?
What a performance from Virat Kohli's men ?#INDvSA pic.twitter.com/zvYg1kfIaP
— ICC (@ICC) October 13, 2019