తిరువనంతపురం: విమెన్స్ వన్డే వరల్డ్ కప్ చాంపియన్ ఇండియా 2025 సీజన్‌ను అదిరిపోయే విజయంతో ముగించింది. వరుసగా ఐదో టీ20 మ్యాచ్‌లోనూ శ్రీలంక పని పట్టిన హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని టీమిండియా 5–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 68) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లంతా సత్తా చాటడంతో మంగళవారం జరిగిన చివరి, ఐదో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 15 రన్స్ తేడాతో లంకను ఓడించింది.
తొలుత ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది. టాపార్డర్ ఫెయిలైనా కెప్టెన్ బాధ్యతాయుతంగాఆడింది. చివర్లో హైదరాబాదీ అరుంధతి రెడ్డి (11 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 27 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. అనంతరం ఛేజింగ్‌లో లంక ఓవర్లన్నీ ఆడి 160/7 స్కోరు మాత్రమే చేసి ఓడింది. ఓపెనర్ హసిని పెరీరా (65), ఇమెషా దులాని (50) ఫిఫ్టీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. హర్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.
ఆదుకున్న హర్మన్, అరుంధతి
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న షెఫాలీ వర్మ (5) రెండో ఓవర్లోనే మీపగె బౌలింగ్‌లో వెనుదిరిగింది. మంధాన ప్లేస్‌లో అరంగేట్రం చేసిన ఓపెనర్ జి. కమలిని (12) కూడా ఎక్కువసేపు నిలబడలేదు. కవిషా బౌలింగ్‌లో ఆమె ఎల్బీ అవ్వగా.. వన్‌డౌన్‌లో వచ్చిన హర్లీన్ డియోల్ (13)తో పాటు రిచా ఘోష్ (5), దీప్తి శర్మ (7) ఫెయిలవడంతో ఇండియా 10 ఓవర్లకు 77/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. మంచి షాట్లతో బౌండ్రీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
ఆమెకు అమన్‌జోత్ (21) చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 61 రన్స్ జోడించారు. ఈ క్రమంలో హర్మన్ 35 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఐదు బాల్స్ తేడాతో అమన్, హర్మన్ ఔటైనా.. చివరి మూడు ఓవర్లలో అరుంధతి రెడ్డి అనూహ్యంగా బ్యాటింగ్ చేసింది. మల్కి మదార వేసిన ఆఖరి ఓవర్లో హైదరాబాద్ ప్లేయర్ 4, 6, 4, 4తో స్టేడియాన్ని హోరెత్తించి జట్టుకు మంచి స్కోరు అందించింది. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్‌హరి, చామరి ఆటపట్టు, రష్మిక సెవాందితలో రెండు వికెట్లు పడగొట్టారు.
హసిని, ఇమెషా పోరాడినా
టార్గెట్ ఛేజింగ్‌లో రెండో ఓవర్లోనే కెప్టెన్ చామరి ఆటపట్టు (2)ను ఔట్ చేసిన అరుంధతి లంకకు షాకిచ్చింది. కానీ మరో ఓపెనర్ హసిని, ఇమెషా ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొని స్వేచ్ఛగా షాట్లు కొట్టిన ఈ ఇద్దరూ ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించారు. దాంతో ఓ దశలో 86/1తో లంక పటిష్ట స్థితిలో కనిపించింది.
12వ ఓవర్లో దులానిని అమన్ ఔట్ చేసినా హసిని క్రీజులో ఉండటంతో లంక రేసులోనే నిలిచింది. అయితే చివరి ఏడు ఓవర్లలో ఇండియా బౌలర్లు మ్యాజిక్ చేశారు. వరుసగా వికెట్లు పడగొడుతూ లంకపై ఒత్తిడి పెంచారు. నీలాక్షిక (3), కవిషా (5), హర్షిత (8) సింగిల్ డిజిట్‌కే ఔటవ్వగా.. 17వ ఓవర్లో హసినిని ఏపీ అమ్మాయి శ్రీచరణి పెవిలియన్ చేర్చడంతో లంక ఓటమి ఖాయమైంది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 175/7 (హర్మన్68, అరుంధతి 27 నాటౌట్, కవిషా 2/11).
శ్రీలంక: 20 ఓవర్లలో 160/7 (హసిని 65, ఇమెషా 50, అరుంధతి 1/16).
విమెన్స్ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రికార్డుకెక్కింది. ఈ ఫార్మాట్‌లో మొత్తం 152 వికెట్లు తీసిన ఆమె .. ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ (151 వికెట్లు)ను దాటి టాప్ ప్లేస్‌లోకి వచ్చింది.
ఐదు టీ20ల సిరీస్‌ను ఇండియా 5–0తో స్వీప్ చేయడం ఇది మూడోసారి. స్వదేశంలో ఇదే తొలిసారి. లంక ఓ సిరీస్‌లో తొలిసారి 0–5తో వైట్‌వాష్ ఎదుర్కొంది.
