
- 1990లో ప్రతి లక్ష మందిలో 84 మందికి క్యాన్సర్
- 2023 నాటికి 107 మందికి పెరుగుదల
- మరణాల రేటు 71 శాతం నుంచి 86 శాతానికి..
- గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీతో వెలుగులోకి...
హైదరాబాద్, వెలుగు:మన దేశంలో క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. మూడు దశాబ్దాల కాలంలో క్యాన్సర్ బాధితులతో పాటు మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ‘ది లాన్సెట్ జర్నల్’లో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) స్టడీ క్యాన్సర్ లేబొరేటరీ రిపోర్టు ద్వారా ఇది స్పష్టమైంది. అమెరికా, చైనా వంటి దేశాల్లో క్యాన్సర్ ప్రభావం తగ్గుతుండగా.. ఇండియాలో మాత్రం ప్రతి సంవత్సరం మహమ్మారి విస్తరిస్తున్నది.
మన దగ్గర క్యాన్సర్‌కు సంబంధించి అత్యాధునిక వైద్య సదుపాయాలు, సర్వీస్‌లు ఉన్నప్పటికీ.. కేసులు, మరణాలు మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. క్యాన్సర్ నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే... 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.05 కోట్ల మంది కొత్తగా క్యాన్సర్ బారినపడతారని, 1.86 కోట్ల మంది చనిపోతారని ‘ది లాన్సెట్ రిపోర్ట్’ పేర్కొన్నది. ఈ కొత్త కేసుల్లో సగానికి పైగా, మరణాలలో మూడింట రెండు వంతులు.. లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్‌లోనే సంభవిస్తాయని హెచ్చరించింది.
21% పెరిగిన మరణాలు
1990లో ఇండియాలో ప్రతీ లక్ష జనాభాలో 84.8 క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 2023 నాటికి ఆ సంఖ్య 107.2కి పెరిగింది. మరణాల రేటు కూడా 1990లో ప్రతి లక్ష మందిలో 71.7 ఉండగా, 2023 నాటికి 86.9కి ఎగబాకింది.అంటే, ఇండియాలో కొత్తగా నమోదయ్యే క్యాన్సర్ కేసుల సంఖ్య 26% అంటే సుమారు 15 లక్షల కేసులు పెరగగా, మరణాలు 21% అంటే దాదాపు 12 లక్షల మరణాలు పెరిగినట్లు రిపోర్ట్ స్పష్టం చేస్తున్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్‌లో ఈ కేసుల సంఖ్య పెరిగినట్లు పేర్కొన్నది. 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా కేసులు డబుల్ అయి 1.85 కోట్లకు చేరుకున్నాయని, మరణాలు 1.04 కోట్లకు పెగినట్లు రిపోర్టు స్పష్టం చేసింది.
క్యాన్సర్ కట్టడిలో ఇండియా వెనుకంజ
ఇండియాతో పాటు లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో క్యాన్సర్ కేసులు, మరణాలు పెరుగుతున్నట్లు రిపోర్టు చెప్తున్నది. గడిచిన 33 ఏండ్లలో చైనాలో 18.5%, అమెరికాలో 20 శాతం క్యాన్సర్ కేసులు తగ్గాయి. దీనికి కారణం.. ఆయా దేశాల్లో పొగాకు వాడకాన్ని నియంత్రించడానికి కఠినమైన చట్టాలు అమలు చేయడమే. వ్యాక్సినేషన్ కార్యక్రమాల ద్వారా హెచ్‌పీవీ, హెపటైటిస్- బీ వంటి క్యాన్సర్ కారక వైరస్‌లను అరికడుతున్నారు.
ప్రజలందరికీ క్యాన్సర్‌ను ప్రైమరీ స్టేజ్ లోనే గుర్తించేందుకు వీలుగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను అమలు చేస్తున్నారు. అయితే, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్‌లో జనాభా, వయస్సు పెరగడంతో కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా కనబడుతున్నదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర దేశాల్లో క్యాన్సర్‌పై ఉన్నంత అవేర్నెస్ మన వద్ద లేదని అంటున్నారు. స్క్రీనింగ్ కేసులు పెరగడంతో బాధితుల సంఖ్య కూడా పెరుగుతుందని,స్క్రీనింగ్ టెస్టుల ద్వారాతొందరగా గుర్తించడం కూడా మంచిపరిణామమేనని అభిప్రాయపడుతున్నారు.
మన కంట్రోల్ లో ఉండే అలవాట్లతోనే..
రోజువారీ అలవాట్లలో వస్తున్న మార్పుల కారణంగానే చాలా మంది క్యాన్సర్ బారినపడుతున్నట్లు తేలింది. ఆహారం, పొగాకు, ఆల్కహాల్, పొల్యూషన్ ఫలితంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పొగాకు నమలడం, తాగడంతో ఊపిరితిత్తుల, నోటి, గొంతు, అన్నవాహిక క్యాన్సర్ బారినపడుతున్నారు.
జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్, ఒబేసిటీ కారణంగా రొమ్ము క్యాన్సర్ (మెనోపాజ్ తర్వాత), పెద్ద పేగు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వస్తున్నదని. మందు ఎక్కువగా తాగడంతో నోటి, గొంతు, కాలేయ క్యాన్సర్ల బారినపడ్తారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటికి దూరంగా ఉంటే.. క్యాన్సర్ మహమ్మారి దరి చేరదని అంటున్నారు. విస్తృతమైన స్క్రీనింగ్‌తో మహిళల్లో బ్రెస్ట్, సర్వైకల్, ఓవెరియన్ క్యాన్సర్లను 50 శాతం వరకు నివారించొచ్చు.
తీవ్రమవుతున్న కిడ్నీ క్యాన్సర్ ముప్పు
ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. రానున్న 25 ఏండ్లలో కిడ్నీ క్యాన్సర్ బాధితులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని యూరప్, అమెరికా, యూకే దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అబ్జర్వేటరీ టీమ్ హెచ్చరించింది.
ఒబేసిటీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం, షుగర్, బీపీ వంటి అనారోగ్య సమస్యలు.. కిడ్నీ క్యాన్సర్‌కు కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. దీనికి సంబంధించిన రిపోర్టు ‘యూరోపియన్ యూరోలజీ’ జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 4.35 లక్షల కొత్త కేసులు నమోదు కాగా, 1.56 లక్షల మంది కిడ్నీ క్యాన్సర్‌తో చనిపోయినట్లు రికార్డులు చెప్తున్నాయి.
ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి ఈ సంఖ్య డబుల్ అవుతదని రిపోర్టు స్పష్టం చేస్తున్నది. కిడ్నీ క్యాన్సర్ అనేది.. గ్లోబల్ హెల్త్ సమస్యగా మారుతున్నది. దీన్ని అందరూ కలిసికట్టుగా నివారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే 2050 నాటికి కొత్త 7.45 లక్షలకు (72 శాతం) పెరిగే ప్రమాదం ఉంది. మృతుల సంఖ్య 3.04 లక్షలుగా (96 శాతం) రికార్డ్ అయ్యే చాన్స్ ఉంది. 5 నుంచి 8 మంది శాతం కిడ్నీ క్యాన్సర్ కేసులు జెన్యూపరమైనవిగా గుర్తించారు. జీవన విధానంలో వస్తున్న మార్పులే.. క్యాన్సర్‌కు కారణమని నిపుణులు చెప్తున్నారు.