ఇండియాదే ‘శాఫ్‌’ టైటిల్‌

ఇండియాదే ‘శాఫ్‌’ టైటిల్‌
  • ఫైనల్లో బంగ్లాదేశ్‌‌పై విజయం

ఖట్మాండు: శాఫ్ అండర్‌‌‌‌–18 ఫుట్‌‌బాల్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ టైటిల్‌‌ను ఇండియా తొలిసారి సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 2–1తో బంగ్లాదేశ్‌‌పై గెలిచింది.  మ్యాచ్‌‌ ప్రారంభమైన 2వ నిమిషంలోనే ఇండియా ప్లేయర్ విక్రమ్‌‌ ప్రతాప్‌‌ గోల్‌‌ సాధించి శుభారంభాన్నిచ్చాడు. అయితే ఆట 22వ నిమిషంలో ఇరు జట్ల ప్లేయర్స్‌‌ గురుకీరత్‌‌ సింగ్, మహ్మద్‌‌ ఫహీమ్ ప్రమాదకరంగా డిఫెన్స్‌‌ చేయడంతో రిఫరీ.. మార్చింగ్ ఆర్డర్స్‌‌తో ఇద్దర్ని బయటకు పంపించేశాడు. దీంతో ఇరు జట్లు 10 మందితోనే ఆటను కొనసాగించాయి. ఇక 40వ నిమిషంలో బంగ్లా కెప్టెన్‌‌ యాసిన్‌‌ అరాఫత్ గోల్‌‌ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి.  అయితే గోల్‌‌ చేసిన ఆనందంలో అతిగా ప్రవర్తించిన అరాఫత్ రెండోసారి ఎల్లో కార్డ్‌‌కు గురికావడంతో మైదానాన్ని వీడక తప్పలేదు.  ఫలితంగా బంగ్లా జట్టు 9 మంది ప్లేయర్స్‌‌తోనే ఆటను కొనసాగించింది. ఇంజూరీ టైమ్‌‌లో మైదానంలోకి వచ్చిన రవి బహుదుర్‌‌‌‌ రానా 30 అడుగుల దూరం నుంచి అందించిన పాస్‌‌ను అద్భుత స్ట్రైక్‌‌తో గోల్‌‌గా మలిచి ఇండియాకు చిరస్మరణీయ జయాన్నందించాడు. ఇండియా ఆటగాడు మిటీ  ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌‌‌‌’ అవార్డును దక్కించుకున్నాడు.