సౌతాఫ్రికాపై 16 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

సౌతాఫ్రికాపై 16 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో టీ 20 లో సఫారీలపై రోహిత్ సేన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. డేవిడ్ మిల్లర్, డీకాక్ వీరోచిత పోరాటం చేసినా టీమిండియా నిర్దేశించిన భారీ టార్గెట్ ను చేధించలేకపోయారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2–0 తేడాతో కైవసం చేసుకొంది.

టీమిండియా నిర్దేశించిన 238 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌ 47 బంతుల్లో 106 నాటౌట్‌,  క్వింటన్‌ డికాక్‌48 బంతుల్లో 69 నాటౌట్ గా  నిలిచి చివరి వరకు పోరాడినప్పటికీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఇక నామమాత్రమైన మూడో టీ20 ఇండోర్‌ వేదికగా మంగళవారం జరగనుంది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాట్స్మన్ ధాటికి..గౌహతి గ్రౌండ్ దద్ధరిలింది.  రెండో టీ20లో రాహుల్ రఫ్పాడిస్తే..సూర్య కుమార్ యాదవ్..చిచ్చరపిడుగులా చెలరేగడంతో...భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది.  ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దుమ్మురేపారు. ప్రొటీస్ బౌలర్లను ఉతికారేశారు. తొలి వికెట్ కు 96 పరుగుల పాట్నర్ షిప్ను నమోదు చేశారు.ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 28 బంతుల్లోనే  5  ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 37 బంతుల్లో  7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 43 రన్స్ కొట్టాడు. అయితే హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చిన రోహిత్ శర్మను కేశవ్ మహరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత హాఅర్థ సెంచరీ చేసి జోరుమీదున్న రాహుల్ ను పెవీయన్ చేర్చాడు. 

సూర్య మెరుపు ఇన్నింగ్స్..

కేఎల్ రాహుల్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్..ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంతిని ఎడా పెడా బాదాడు. సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇందులో 4 సిక్సులు, 5 ఫోర్లున్నాయి. హాఫ్ సెంచరీ అయ్యాక సూర్య జోరు మరింత కొనసాగింది. మొత్తంగా 22 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. అయితే సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు.  

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సైతం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్సర్ ఉంది. సూర్య ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్.. చివర్లో మెరుపులు మెరిపించాడు. 7 బంతుల్లోనే రెండు సిక్సులు, ఒక ఫోర్ తో 17 పరుగులు పిండుకున్నాడు. భారత బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించడంతో..టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి.. 237 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు సాధించాడు.