చెన్నై చాలెంజర్స్‌‌ విన్నర్‎గా ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రణేశ్‌

చెన్నై చాలెంజర్స్‌‌ విన్నర్‎గా ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రణేశ్‌

చెన్నై: ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఎం. ప్రణేశ్‌ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్‌‌లో చాలెంజర్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో వచ్చే ఏడాది మాస్టర్స్ విభాగంలో పోటీపడే అవకాశం పొందాడు. శుక్రవారం జరిగిన చివరి, తొమ్మిదో రౌండ్‌‌లో అతను జీబీ హర్షవర్దన్ చేతిలో ఓడిపోయాడు. అయినా అందరికంటే ఎక్కువగా 6.5 పాయింట్లతో టాప్ ప్లేస్‌‌తో విజేతగా నిలిచాడు. ఇండియాకే చెందిన అధిబన్ భాస్కరన్‌‌, అభిమన్యు పురాణిక్‌‌తో పాటు లియోన్ లూక్ తలో ఆరు పాయింట్లతో జాయింట్ రన్నరప్‌‌గా నిలిచారు. 

మాస్టర్స్ కేటగిరీలో టైటిల్ నెగ్గిన విన్సెంట్ కీమర్ చివరి రౌండ్‌‌లో రే రాబ్సన్‌‌ను ఓడించాడు. తెలంగాణ జీఎం ఎరిగైసి అర్జున్.. తొమ్మిదో రౌండ్‌‌లో కార్తికేయన్ మురళీతో డ్రా చేసుకున్నాడు. అర్జున్‌‌, అనిష్  గిరి,  మురళీ తలో ఐదు పాయింట్లతో జాయింట్ రన్నరప్‌‌గా నిలిచారు. కీమర్ మాస్టర్స్ టైటిల్‌‌తో పాటు రూ. 25 లక్షల ప్రైజ్‌‌మనీ, 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‌కు అర్హత కోసం 24 ఫిడే సర్క్యూట్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. చాలెంజర్స్ విన్నర్ ప్రణేశ్‌ రూ. 7 లక్షల ప్రైజ్‌‌మనీ అందుకున్నాడు.