నేపాలి ప్రియురాలిని చంపిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్

నేపాలి ప్రియురాలిని చంపిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్

వివాహేతర సంబంధం కలిగి ఉన్న నేపాలీ చెందిన మహిళ.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆర్మీ అధికారి ఆమెను హత్య చేశాడు. లెఫ్టినెంట్ కల్నల్ రామేందు ఉపాధ్యాయ్‌గా పోలీసులు నిందితుడిని గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్టు చేసినట్లు ఎస్‌ఎస్పీ దిలీప్ సింగ్ కున్వర్ తెలిపారు. విచారణలో ఉపాధ్యాయ్ (42) నేరాన్ని అంగీకరించాడు.

తాను పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సిలిగురిలోని డ్యాన్స్ బార్‌లో శ్రేయ శర్మను కలిశానని, ఆమెతో స్నేహం చేశానని ఉపాధ్యాయ్ పోలీసులకు చెప్పాడు. వారి స్నేహం ప్రేమగా మారిందని, అలా తాను, శ్రేయ సిలిగురిలో భార్యాభర్తలుగా కలిసి జీవించేవారని కూడా ఉపాధ్యాయ్ తెలిపాడు. "డెహ్రాడూన్‌లో పోస్టింగ్  తరువాత, నేను ఆమెను నాతో తీసుకువచ్చాను. కాని నా భార్యకు శ్రేయ గురించి తెలియగానే నేను ఆమెను సిలిగురికి తిరిగి పంపించాను" అని ఉపాధ్యాయ్ చెప్పాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత, ఉపాధ్యాయ్ ఆమెను తిరిగి డెహ్రాడూన్‌కి పిలిచి, ఆమె కోసం ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అతనికి, శ్రేయకు మధ్య తరచూ గొడవలు రావడం మొదలయ్యింది.

శ్రేయ తనను దుర్భాషలాడుతుందని, హోటళ్లలో మద్యం, ఆహారం తీసుకురమ్మని అడిగేదని నిందితుడు చెప్పాడు. ఆమెకు ఆహారం ఎలా వండాలో తెలియకపోవడంతో తాను ఆహారం తయారు చేసేవాడినని ఉపాధ్యాయ్ తెలియజేశాడు. శ్రేయ డెహ్రాడూన్‌లో ఉంటున్న విషయం ఉపాధ్యాయ్‌ భార్యకు తెలిసి, వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ తరుణంలోనే ఆమె పెళ్లి డిమాండ్‌తో విసిగిపోయిన ఉపాధ్యాయ్.. ఆమెను చంపడానికి కుట్ర పన్నాడు. సెప్టెంబర్ 9న ఆమెను రాజ్‌పూర్ రోడ్డులోని ఒక క్లబ్‌కి తీసుకెళ్లి, ఆమెకు బాగా మద్యం తాగించి, లాంగ్ డ్రైవ్‌ను ఆఫర్ చేశాడు. దాన్ని ఆమె కూడా వెంటనే అంగీకరించింది. దీంతో అతనికి పని మరింత సులువైంది. ఆ తర్వాత ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమె తలపై సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఆమెను చంపిన తర్వాత, అతను ఆమె మృతదేహాన్ని రోడ్డుపై పడవేసి, ఆమెను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి టాయిలెట్ క్లీనర్ ను ఆమె ముఖంపై పోశాడు. ఘటన అనంతరం నేరానికి ఉపయోగించిన సుత్తి, శ్రేయ గుర్తింపు కార్డు, ఉపాధ్యాయ్‌కు చెందిన రెండు మొబైల్ ఫోన్లు, ఇద్దరి దుస్తులు, నేరానికి ఉపయోగించిన కారు, టాయిలెట్ క్లీనర్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.