రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినయ్ రంజన్ సిటీలో లేని టైమ్ చూసుకుని.. ఇంట్లో పై ఫ్లోర్ లో ఉన్న పిల్లలకు చడీచప్పుడు కాకుండా.. తనూజను హత్య చేశారు దుండగులు. 8 నెలలుగా ఇంట్లో నమ్మకస్తురాలిగా పనిచేస్తున్న నేపాలీ పనిమనిషి వేసిన స్కెచ్ ను.. ఎన్నో కేసులను పరిష్కరించిన మాజీ ఐపీఎస్ రంజన్ రే కూడా పసిగట్టలేక పోయారంటే ఎంత సీక్రెట్ క్రైమ్ స్టోరీ నడిపించారో చూడవచ్చు.
ఈ కేసులో అసలు సూత్రదారి పనిమనిషే అని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ షాకింగ్ మర్డర్ గురించిన నిందితుల ఫోటోలు, రెక్కీ నిర్వహిస్తూ ప్లాన్ చేసిన వీడియోలు, వాళ్లు ఎలా పారిపోయారో మొదలైన పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ లో 2026 మే 07వ తేదీ అర్థరాత్రి జరిగింది ఈ దారుణ ఘటన. అధికారి భార్య తనూజ (55) ను హత్య చేసి ఒక బ్యాగ్ తో ముగ్గురు పరారైనట్లు సీసీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నేపాలీ పనిమనిషి కల్పనతో పాటు మరో ఇద్దరు ఈ క్రైమ్ లో పాలుపంచుకున్నట్లు వీడియోల ద్వారా తెలుస్తుంది. డబ్బు, ఆభరణాల కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే కాదు.. అన్నం పెట్టిన ఆ తల్లిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంది ఆ పనిమనిషి.
రంజన్ రే బెంగళూర్ వెళ్లటంతో.. తనూజ ఇంట్లో ఒంటరిగా ఉందనే సమాచారాన్ని పనిమనిషి మిగతా నిందితులకు చెప్పింది. పక్కా ప్లాన్ తో నలుగురు కలిసి హత్య చేసి పారిపోయారు. హత్యకు గల ఆధారాలను క్లూస్ టీమ్స్ సేకరించారు. ఒక క్యాపు, దానిపై ఉన్న రక్త నమూనాలు సేకరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసుకు సంబంధించి డీజీపీ సీవీ ఆనంద్ ఘటన స్థలానికి నేరుగా వెళ్లి పరిశీలించారు.
- నేపాలీ గ్యాంగ్ లతో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
హత్య చేసి ఇంటి చుట్టూ ఉన్న గోడ దూకి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి పక్కన ఒక లోయ వంటి దారి ఉండటంతో.. అక్కడి నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్.. హత్యకు సంబంధించి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 2:30 గంటలకు హత్య జరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నేపాలీ గ్యాంగ్ ఈ హత్య చేశారని ఆయన అన్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని తెలిపారు. పిల్లలు పై ఫ్లోర్ ఉన్నారు కింద ఫ్లోర్ లో ఉన్న తనూజ నోట్ల గుడ్డలు కుక్కి హత్య చేసినట్లు చెప్పారు.
నేపాలీ వ్యక్తులను ఎక్కువ రోజులు పనిలో ఉంచకూడదని సూచించారు. నేపాలీ గ్యాంగ్ పై పక్కా నిఘా ఉంచాలని చెప్పారు. ఇంతకుముందు కల్పన వాళ్ల అమ్మ ఇదే ఇంట్లో పని చేసిందని.. ఆమె తర్వాత ఈ కల్పన వర్క్ లో జాయిన్ అయిందని చెప్పారు. హత్యకు సూత్రదారి కల్పన అని.. కల్పనను ఏడాది క్రితం మరో నేపాలి మహిళ పనిలో చేర్పించినట్లు చెప్పారు.
- పుణేలో పనిచేసేది.. నేనే ఇక్కడికి తీసుకొచ్చా..
కల్పన ఇంతకు ముందు పుణేలో పనిచేసేదని ఆమెను పనిలో చేర్పించిన మహిళ తెలిపింది. ఇంట్లో ముందు నుంచి తానే పనిచేసే దాన్నని.. తన ప్లేస్ లో కల్పనను చేర్పించినట్లు చెప్పింది. పుణే నుంచి హైదరాబాద్ పిలిపించి పనిలో పెట్టించాను. నేపాల్ ల్లో తమ ఊరు పక్కనే కల్పన వాళ్ళ ఊరు ఉండటంతో పనిలో పెట్టించినట్లు సదరు మహిళ చెప్పింది.
ఇక సీసీటీవీ ఫుటేజ్ లో రంజన్ రే ఇంటి దగ్గర నిందితులు రెక్కీ నిర్వహించిన వివరాలన్నీ రికార్డయ్యాయి. కల్పనతో పాటు మరో ముగ్గురు కలిసి రెక్కి నిర్వహించిన సీసీ ఫూటేజీ లభ్యం అయ్యింది. ఇంటి వద్ద మర్డర్ చేసిన తరువాత ఎలా తప్పించుకోవాలో కల్పన ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు ప్లాన్ చేసుకుంటున్న దృశ్యాలు సీసీ ఫూటేజీలో గుర్తించారు.
