లైవ్ అప్ డేట్స్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం

లైవ్ అప్ డేట్స్:  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో  విధ్వంసం

దేశవ్యాప్తంగా ఆగని నిరసనలు

  • యూపీ, రాజస్తాన్, ఎంపీ, ఢిల్లీ, హర్యానాలోనూ నిరసనలు
  • రైల్వే స్టేషన్లే లక్ష్యంగా దాడులు 
  • బీహార్‌‌లో ఓ ప్రయాణికుడి మృతి

‘అగ్నిపథ్’ చిచ్చు చల్లారడం లేదు. దేశమంతటా విస్తరిస్తున్నది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ పథకానికి వ్యతిరేకంగా వరుసగా మూడో రోజూ ఆందోళనలు ఉధృతంగా సాగాయి. నిరసనకారులు రైళ్లను, రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. ట్రైన్లకు నిప్పు పెట్టారు. స్టేషన్లలో ఫర్నిచర్​నూ వదల్లేదు.  బస్సులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వేలాది ట్రాక్‌‌లు, హైవేలను బ్లాక్ చేశారు. బుధవారం నుంచి 12 దాకా రైళ్లను తగులబెట్టారు. బీహార్‌‌‌‌లో రైలులో మంటలు చెలరేగడంతో ఆందోళన చెందిన ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. దేశవ్యాప్తంగా 200 రైళ్లపై ప్రభావం పడిందని, 110 రైళ్లను రద్దు చేశామని, 47 ట్రైన్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు చెప్పారు. హింసాత్మక ఆందోళనలకు పాల్పడొద్దని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దని యువకులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు.

బీహార్‌‌‌‌లో మొదలై..

అగ్నిపథ్ స్కీమ్‌‌లో భాగంగా నాలుగేళ్ల షార్ట్‌‌ టర్మ్, కాంట్రాక్ట్ బేసిస్‌‌ కింద రిక్రూట్‌‌మెంట్‌‌ చేస్తామని కేంద్రం ప్రకటించడంపై దేశవ్యాప్తంగా యువకులు, ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. బుధవారం బీహార్‌‌‌‌లో మొదలైన నిరసనలు.. శుక్రవారానికి 7 రాష్ట్రాలకు పాకాయి. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలో ఆందోళనలు సాగుతున్నాయి.

  • బీహార్‌‌‌‌లోని లఖిసరయ్‌‌లో విక్రమశిల ఎక్స్‌‌ప్రెస్‌‌, సమస్తిపూర్‌‌‌‌లో బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌‌ప్రెస్‌‌ బోగీలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. లఖిసరయ్ స్టేషన్‌‌లో ట్రాక్‌‌లపై పడుకుని ట్రైన్ల రాకపోకలను అడ్డుకున్నారు. లఖిసరయ్‌‌లో రైలులో మంటలు చెలరేగడంతో ఆందోళన చెందిన ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. పాట్నాలో డిప్యూటీ సీఎం రేణు దేవి ఇంటిపై మూక దాడి చేసింది.
  • యూపీలోని బాలియా టౌన్‌‌లో ఓ రైలుకు నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న బాలియా  వారణాసి మెము, బాలియా- షాగంజ్ రైళ్లపై దాడులు చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. రైల్వే గోడౌన్ దగ్గర ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. స్టేషన్ ప్లాట్‌‌ఫామ్‌‌పై ఉన్న ప్రైవేటు షాపులే లక్ష్యంగా దాడులు చేశారు. బయట ఉన్న బస్సులనూ వదల్లేదు. ఆఫీసర్లు కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని వాయిదా వేశారు. వారణాసి, ఫిరోజాబాద్, అమేథీలోనూ నిరసనలు జరిగాయి. ఆగ్రా - లక్నో ఎక్స్‌‌ప్రెస్‌‌ వేపై ధర్నాలు చేశారు. ఆఫీసర్లపై రాళ్లు రువ్వారు. నాలుగు బస్సులను డ్యామేజ్ చేశారు.
  • మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌‌‌‌లో వందలాది మంది ట్రాక్‌‌లపై బైఠాయించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. సుమారు 600 మంది లక్ష్మీబాయ్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్‌‌లపై గుమిగూడటంతో పలు రైళ్లను ఆపేశారు. హర్యానాలో యువకులు రోడ్లపై టైర్లను కాల్చారు. నార్వానాలో రైల్వే ట్రాక్‌‌లపై బైఠాయించారు. పల్వాల్‌‌లో హింస నేపథ్యంలో ఫరీదాబాద్‌‌లోని బల్లాబ్‌‌గఢ్‌‌లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌‌ఎంఎస్‌‌ సర్వీసులను 24 గంటలపాటు ఆపేశారు. పల్వాల్‌‌లో చెలరేగిన హింసకు సంబంధించి వెయ్యి మందికి పైగా నిందితులపై  కేసులు నమోదు చేశారు.దేశరాజధాని ఢిల్లీలో మెట్రో సర్వీసులపై ఎఫెక్ట్ పడింది. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యుల నిరసనలతో కొన్ని చోట్ల మెట్రో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసేశారు.

2 రోజుల్లో నోటిఫికేషన్: ఆర్మీ చీఫ్

అగ్నిపథ్ రిక్రూట్‌‌మెంట్​కు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. డిసెంబర్‌‌‌‌లో మొదటి అగ్నివీర్‌‌‌‌ల శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. అగ్నిపథ్ పథకం పెద్ద సంస్కరణ తీసుకొ స్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు. యువతకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌‌ను రూపొం దించారని ఎయిర్‌‌‌‌ మార్షల్ మానవేంద్ర సింగ్ చెప్పారు. అగ్నిపథ్ కింద రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను ఈనెల 24 నుంచి ప్రారంభిస్తామని ఎయిర్‌‌ఫోర్స్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వీఆర్ చౌధరి చెప్పారు.


రౌడీలు సైన్యంలోకి ఎందుకు?: ఆర్మీ మాజీ చీఫ్ మాలిక్

గూండాయిజం చేసే వాళ్లు, బస్సులు, రైళ్లకు నిప్పుపెట్టే వాళ్లు.. సాయుధ బలగాల్లో ఉండాలని తాము కోరుకోవడం లేదని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ అన్నారు. హింసకు బాధ్యులైన రౌడీలను రిక్రూట్ చేసుకునే ఆసక్తి తమకు లేదన్నారు.  ఇండియన్ ఆర్మీ అనేది వాలంటీర్ ఫోర్స్ అని, వెల్ఫేర్ సంస్థ కాదని అన్నారు. దేశకోసం పోరాడే వాళ్లు, దేశాన్ని కాపాడుకునే అత్యుత్తమ వ్యక్తులనే రిక్రూట్ చేసుకుంటామని కామెంట్ చేశారు.

అభ్యర్థులు ప్రిపరేషన్​ మొదలు పెట్టండి: రాజ్​నాథ్​ సింగ్​

అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌‌మెంట్ కొన్ని రోజుల్లోనే ప్రారంభమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ చెప్పారు. ఇందులో చేరాలనుకునే యువకులు ప్రిపరేషన్ మొదలుపెట్టాలని సూచించారు. దేశ సాయుధ దళాల్లో చేరాలనుకునే యువకులకు ఇది సువర్ణ అవకాశమని చెప్పారు. ఏజ్ లిమిట్‌‌ను 21 నుంచి 23 ఏండ్లకు పెంచడం వల్ల.. ఎక్కువ మంది యువకులు సైన్యంలో చేరుతారని చెప్పారు. ‘మోడీ సూచన మేరకు వయో పరిమితిని సడలించామని వివరించారు. ఈ ఒక్క సారి మాత్రమే ఈ సడలింపు ఉంటుందని చెప్పారు.
 

  • ఆర్మీ అభ్యర్థుల అగ్నిపథ్
  • సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ రణరంగం
  • స్టేషన్​లోకి దూసుకొచ్చిన వేల మంది నిరసనకారులు
  • పెట్రోల్​ చల్లి నాలుగు రైళ్లకు నిప్పు.. షాపులు, ఫర్నిచర్​ ధ్వంసం
  • నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల కాల్పులు
  • ఒకరు మృతి.. 14 మందికి గాయాలు

‘అగ్నిపథ్​’ మంటలు సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు అంటుకున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6  గంటల వరకు స్టేషన్​ అట్టుడికింది. అగ్నిగుండంలా మారింది. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్​ స్కీంను వ్యతిరేకిస్తూ  వేల మంది అభ్యర్థులు ఉదయం ఒక్కసారిగా స్టేషన్​లోకి దూసుకువచ్చారు. నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. కట్టెలు, రాడ్లు, రాళ్లతో అక్కడి షాపులపై దాడులు చేశారు. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయాడు.

రణరంగంగా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 

ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్​ స్కీంను నిరసిస్తూ శుక్రవారం ఉదయం వాళ్లంతా స్టేషన్​కు చేరుకున్నారు. తొలుత స్టేషన్​ ముందు తలపెట్టిన ఆందోళన.. తర్వాత లోపలికి మారింది. ప్రయాణికుల్లా ప్లాట్​ఫాం ​పైకి  చొచ్చుకు వచ్చి దాడికి పాల్పడ్డారు. అగ్నిపథ్ ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను ఎప్పటిలాగే  నిర్వహించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. కొన్ని బోగీలు రాళ్ల దాడిలో ధ్వంసమయ్యాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వరంగల్ జిల్లా దబీర్​పేట్​కు చెందిన రాకేశ్(18) బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మరో 14 మంది గాయాలపాలయ్యారు. వాళ్లను గాంధీ హాస్పిటల్​కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.

నిరసనకారుల రాళ్ల దాడిలో పోలీసులకు గాయాలు

నిరసనకారుల రాళ్ల దాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ హఠాత్​ పరిణామంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. తమ లగేజీని అక్కడే వదిలేసి భయంతో పరుగులు తీశారు. రైళ్లకు నిప్పంటించడంతో స్టేషన్​ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ దాడిలో హౌరా వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ధ్వంసమైంది. అజంతా ఎక్స్ ప్రెస్, దర్బంగా రాజ్ కోట్ ఎక్స్​ప్రెస్ తోపాటు ఓ ఎంఎంటీఎస్​ రైలుకు కూడా నిరసనకారులు నిప్పుపెట్టారు. అక్కడి క్యాంటీన్లు, స్టాళ్లు, టికెట్ కౌంటర్లను ధ్వంసం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు వరకు సుమారు 10 గంటల పాటు ఆందోళనలతో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ అట్టుడికింది. రూ.20 కోట్ల రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. 

ఉదయం తొమ్మిది గంటల సమయం.. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లోని మొదటి నంబరు ప్లాట్​ఫాంపైకి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ వచ్చి 10 నిమిషాలైంది. మరో 10 నిమిషాల్లో హౌరా బయల్దేరాల్సిన ఆ రైలుపై నిరసనకారులు మూకుమ్మడి దాడికి దిగారు. కేవలం 10 నిమిషాల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోయింది. తొమ్మిది నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు... అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈస్ట్ కోస్ట్, దర్బంగా రైళ్ల ముందు బైఠాయించిన నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు ఆర్పీఎఫ్ తోపాటు స్థానిక పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దర్బంగా ఎక్స్ ప్రెస్ రైల్లో తరలించడానికి ప్లాట్​ఫాం పక్కన సిద్ధంగా ఉంచిన రెండు బైక్​లు,  ఇతర ఫర్నిచర్​ను నిరసనకారులు తగలబెట్టారు. 

తొలుత లాఠీచార్జ్.. తర్వాత రెండుసార్లు గాలిలోకి కాల్పులు.. ఆ తర్వాత నిరసనకారులపైకి తుపాకులు ఎక్కుపెట్టారు

నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మొదట లాఠీచార్జ్​ చేశారు. దాంతో నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. కొంత సేపటికి వారు మరోసారి రైల్వే ట్రాక్ పైకి చేరుకొని ట్రాక్​పై ఉన్న రాళ్లను తీసుకుని పోలీసులపైకి విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వే డీజీ సందీప్ శాండిల్య స్పాట్​కు చేరుకున్నారు. రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్ సిబ్బంది.. ఆ తర్వాత నిరసనకారులపైకి తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా నిరసనకారులు తగ్గలేదు. పోలీసులు కాల్పుల వల్ల ఓ యువకుడి చెవి నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.  ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు నిరసనకారులు గాయపడ్డారు. మరోవైపు ఒకరిద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిపారు.

వణికిపోయిన ప్రయాణికులు

దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఈస్ట్​ కోస్ట్​ రైల్లో కూర్చుని వస్తువులు సర్దుకునే సమయంలో నిరసనకారులు రైలు అద్దాలు పగులగొట్టడం మొదలు పెట్టారు. బోగీల్లో ఉన్న పిల్లాపాపలు, వృద్ధులు, మహిళలు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో.. ఎక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిరసనకారులు ప్లాట్ ఫాంపైనే ఉండి దాడికి పాల్పడటంతో ప్రయాణికులకు ట్రైన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత ప్రయాణికులంతా బోగీల నుంచి దిగి వెళ్లిపోయే వరకు నిరసనకారులు కాస్త ఆగి.. తర్వాత తమ ఆగ్రహాన్ని  రైలుపై చూపించారు. ప్రయాణికుల్లో కొంతమంది తమ సామాన్లను అక్కడే వదిలేసి పోయారు. 

ఎక్కడికక్కడ ఆగిన రైళ్లు

రైల్వే శాఖ అధికారులు  91 రైళ్లను రద్దు చేశారు. ఎంఎంటీఎస్​, మెట్రో రైల్​ సర్వీసులను నిలిపివేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఒక్క రైలు కూడా కదల్లేదు. హైదరాబాద్​లోని నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు భద్రత పెంచారు. సిటీకి వచ్చే పలు రైళ్లను వరంగల్​, మహబూబ్​నగర్​ తదితర స్టేషన్లలో ఆపేశారు. రైల్వే స్టేషన్​లో జరుగుతున్న సంఘటనలతో అక్కడికి సిటీ బస్సులు రాకుండా ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. స్టేషన్​ వైపు వచ్చే బస్సులను కిలో మీటర్​ ముందే వెనక్కు మళ్లించారు. దీంతో పరిసరాల్లో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. కాల్పుల్లో గాయపడ్డ వాళ్లను గాంధీ హాస్పిటల్​కు తరలించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరామర్శకు వచ్చే రాజకీయ పార్టీ నేతల్ని పోలీసులు అనుమతించలేదు. బీఎస్సీనేత ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ మాత్రం బాధితులను పరామర్శించారు. కాగా, ఆందోళనలు తగ్గిన తర్వాత రాత్రి 8.30 గంటలకు అధికారులు రైళ్లను పునరుద్ధరించారు.

రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ 

రైల్వే అదనపు డీజీ సందీప్ శాండిల్య మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్లీ నిరసనకారుల వద్దకు చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. ఆ సమయంలోనే పలువురు ఏడీజీ వద్దకు చేరుకుని తమ సమస్యలను తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. 
 

అదుపులో నిరసనకారులు

శుక్రవారం మబ్బుల ఐదున్నరకే నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావడం మొదలైంది. గురువారం రాత్రి కల్లా సుమారు వంద మందికి పైగా చేరుకుని పలు చోట్ల బస చేశారు. ఒక్కొక్కరుగా రెండు మూడు వేల మంది బ్యాగులు భుజాలకు వేసుకుని ప్రయాణికుల్లా అంతా ప్లాట్ ఫాం పైకి చేరుకున్నారు. తొమ్మిది గంటలకు దాడులకు దిగారు. కాల్పుల తర్వాత వారిలో వందలాది మంది బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో 500 మంది దాకా స్టేషన్​లోనే పట్టాలపైనే బైఠాయించారు. రైల్వే ఏడీజీ సందీప్ శాండిల్య, ఎస్పీ అనురాధ.. నిరసనకారులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ శాంతించలేదు. వాయిదాపడ్డ ఆర్మీ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రకటించిన తర్వాతే కదులుతామని స్పష్టం చేశారు. చివరికి వంద మందే అక్కడ ఉండిపోవడంతో అప్పటికే పోలీసులు వారందర్నీ రౌండప్  చేసి.. సాయంత్రం ఆరు గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత.. రాత్రి ఏడున్నరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
 

దాడి వెనుక కుట్ర ఉంది: డీజీ సందీప్ ​శాండిల్య

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​పై దాడి వెనుక కుట్ర దాగి ఉందని, దాన్ని త్వరలోనే ఛేదిస్తామని రైల్వే డీజీ సందీప్​ శాండిల్య ప్రకటించారు. ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారనేది గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కుట్రలో భాగంగానే నిరుద్యోగులు దాడి చేశారని, ఈ దాడికి కుట్ర చేసిన వ్యక్తులపై ఆరా తీస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులు విధ్వంసానికి పాల్పడిన సమయంలో వారిని ఆపేందుకు ప్రయత్నించిన కొంత మంది పోలీసులకు గాయాలైనట్టు రైల్వే ఎస్పీ అనురాధా వెల్లడించారు. 

రాకేశ్ కుటుంబానికి 25 లక్షల పరిహారం: సీఎం

సికింద్రాబాద్ ఘటనలో మరణించిన రాకేశ్​కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. రాకేశ్ మరణంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. కుటుంబానికి సానుభూతి తెలిపారు. తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నా రు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేశ్ బలయ్యాడని ఆరోపించారు.

పక్కా ప్లాన్​ ప్రకారమే..!

నిరసనకారులు పక్కా ప్లాన్​తోనే ఆందోళనకు దిగినట్లు తెలుస్తున్నది. రెండు, మూడు రోజుల ముందు నుంచే వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించి చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,800 మంది అభ్యర్థులు వివిధ జిల్లాల్లో ఆర్మీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. గతంలోనే ఫిజికల్, మెడికల్​ పరీక్షల్లో వీరంతా పాస్ అయ్యారు. అలాంటి అభ్యర్థుల కోసం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించాల్సి ఉండగా.. అది రెండుసార్లు వాయిదా పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజెప్పాలనుకున్న అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ను ఎంపిక చేసుకున్నారు. పైగా అగ్నిపథ్​ స్కీంను కేంద్రం ప్రకటించడాన్ని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రెండు మూడు వందల మంది దాకా విడతలవారీగా సికింద్రాబాద్​ చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం రాత్రి కొందరు.. శుక్రవారం ఉదయం మరికొందరు స్టేషన్​ వద్దకు వచ్చారు. బ్యాగుల్లోనే  పెట్రోల్​, లైటర్లు తెచ్చుకున్నారు. ప్రయాణికుల్లా లోపలికి వెళ్లి.. దాడికి దిగారు. 

దేశ వ్యాప్తంగా ఆందోళనలు

కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ బీహార్, హర్యానాలో మొదలైన ఈ ఆందోళనలు తెలంగాణలో ఉద్రిక్తంగా మారాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి చొచ్చుకెళ్ళిన వందలాది ఆర్మీ అభ్యర్థులు, యువకులు రైళ్లపై రాళ్లతో దాడి చేశారు. సేవ్ ఆర్మీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. పట్టాలపై నిప్పు పెట్టారు. దీంతో అధికారులు పలు రైళ్లను నిలిపి వేశారు. నిరసనకారుల హింసాత్మక ఘటనలకు దిగడం, భారీగా పోలీసులు మోహరించడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  రణరంగాన్ని తలపించింది. ఆందోళనలను అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 13  మందిలో ఒకరు మృతి  చెందారు. మిగతా వారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళనల నేపథ్యంలో అధికారులు పలు రైళ్లు రద్దు చేశారు. పోలీసుల కాల్పులు జరిపినా ఆందోళ కారులు వెనక్కి తగ్గడం లేదు.

 

 

పోలీసుల అదుపులో నిరసనకారులు

పది గంటల టెన్షన్ సద్దుమణిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రైలు పట్టాలు, ప్లాట్ ఫామ్ పై కూర్చున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన విరమించేందుకు ససేమిరా అంటున్న నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఏఆర్ఓ కార్యాలయానికి తరలించారు. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు యథావిధిగా రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

అగ్నిపథ్ వాలంటరీ స్కీం

అగ్నిపథ్ వాలంటరీ స్కీం అని, అందులో చేరేందుకు ఎలాంటి బలవంతం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కొంత మంది కుట్రపూరితంగా ఆందోళన చేపట్టారని ఆయన ఆరోపించారు. స్టేషన్ ప్లాట్ ఫామ్స్, ట్రెయిన్స్, ఇతర ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారన్నారు.

ఆందోళనకారుల్ని చర్చలు ఆహ్వానించిన పోలీసులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల్ని పోలీసులు వారిని చర్చలకు ఆహ్వానించారు. 10 మంది ఆందోళనకారుల్ని చర్చలకు పిలిచారు. వారిని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్తామని అంటున్నారు. అయితే ఆందోళనకారులు మాత్రం ఆర్మీ రిక్రూట్మెంట్అధికారి వద్దకు అందరం వస్తామని పట్టుబడుతున్నారు. అందుకు పోలీసులు నిరాకరించారు.

 ప్రయాణికుల కష్టాలు

సికింద్రాబాద్ ఆందోళనతో పలు  రైళ్లు నిలిపి వేశారు. కొన్ని దారి మళ్లించారు.  మెట్రో సర్వీసులను కూడా నిలిపి వేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి రైల్వే స్టేషన్ బయట  పడిగాపులు గాస్తున్నారు. దీంతో  ఎక్కడిక్కడ రైల్వే స్టేషన్లలో ఉండాల్సిన పరిస్థితి.

 

 మెట్రో రైల్లు రద్దు 

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో  రైళ్లను నిలిపివేశారు. ఈ మేరకు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి  ప్రకటించారు. స్టేషన్లలో నుంచి ప్రయాణికులను బయటకు పంపారు.

 

యువతకు బంగారం లాంటి అవకాశం: రాజ్ నాథ్ సింగ్

ఆర్మీ   కొత్త  రిక్రూట్ మెంట్ పద్ధతి యువతకు బంగారం లాంటి అవకాశం అని రాజ్‌నాథ్‌  సింగ్ అన్నారు. త్వరలోనే అగ్నిపథ్‌  రిక్రూట్ మెంట్  ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వెంటనే యువత అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

 ఆర్మీ విద్యార్థులకు మోడీ అన్యాయం చేయడు: బండి సంజయ్

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటన పైన  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  స్పందించారు. ఆర్మీ విద్యార్ధులకి ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు.  టీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ విద్వంసానికి  పాల్పడ్డాయని ఆరోపించారు . ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్నారు. ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.  ఆర్మీ విద్యార్ధులకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదని, అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాదని అన్నారు. కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు వినొద్దని సూచించారు.  రాష్ట్రంలో శాంతిభద్రతాలు క్షీణించాయని, ప్రభుత్వమే విధ్వంసాలను పెంచిపోషిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేధ్దామనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహిరిస్తుందని సంజయ్ ఫైర్ అయ్యారు.

త్వరలోనే ఆర్మీ  రిక్రూట్‌మెంట్ ప్రక్రియ షెడ్యూల్‌

ఆర్మీ ప‌రీక్షకు సంసిద్ధమవుతోన్న యువ‌త‌కు వ‌యోప‌రిమితిని ఒక‌సారి పెంచే అవ‌కాశాన్ని  కేంద్రం క‌ల్పించిందని, ఈ నేపథ్యంలోనే రిక్రూట్ మెంట్ వయసును 23ఏళ్లకు పెంచామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఈ నిర్ణయం వ‌ల్ల దేశంలోని యువ‌త‌కు త‌మ దేశ‌భ‌క్తిని చాటుకునే అవకాశం దొరుకుతుంద‌న్న ఆయన..  కొవిడ్ స‌మ‌యంలోనూ తీవ్రంగా క‌ష్టప‌డ్డ యువ‌త‌కు ఇప్పుడు మంచి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెప్పారు.  దేశంలో అగ్నిపథ్ ఇష్యూ తీవ్ర ఆందోళనలకు దారి తీస్తున్న ఈ సమయంలో మనోజ్ పాండే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  కొవిడ్ నిబంధనల కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయామని అన్నారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీల్లో చేరేందుకు సిద్ధమవుతున్న యువకులకు ఈ నిర్ణయం మంచి అవకాశం కల్పిస్తుందన్న మనోజ్ పాండే... రిక్రూట్‌మెంట్ ప్రక్రియ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. భారత సైన్యంలో అగ్నివీరులుగా చేరేందుకు యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనోజ్ పాండే పిలుపునిచ్చారు. 

 

అగ్నిపథ్ వల్ల యువతకు లభ్ధి: అమిత్ షా

‘అగ్నిపథ్’ ఆందోళనల పై కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "  కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్మీ నియామక ప్రక్రియ గత రెండేళ్లుగా ఆగిపోయింది. అందువల్లే ప్రధాని నరేంద్ర మోడీ అగ్నిపథ్ అనే స్కీమ్ ని తీసుకువచ్చి అభ్యర్ధుల వయసు పరిమితిని  రెండేళ్లు పెంచారు.  2022 కి సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని వలన చాలా మంది యువతకు లబ్ది కలుగుతుంది.  అగ్నిపథ్ పథకం ద్వారా యువత దేశానికి సేవ చేయ‌వ‌చ్చు, వారు ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతారు.మోడీకి దన్యవాదాలు"  అని ట్వీట్ చేశారు.

6 ఎంఎంటీఎస్ రైల్లు రద్దు..నాంపల్లి స్టేషన్ మూసివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన నేపథ్యంలో  ముందస్తుగా నాంపల్లి రైల్వే స్టేషన్ ను మూసివేశారు. ఆరు ఎంఎంటీఎస్ రైల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.   లింగంపల్లి టూ హైదరాబాద్‌,  హైదరాబాద్‌ టూ లింగంపల్లి, ఫలక్‌నుమా టూ లింగంపల్లి, లింగంపల్లి టూ ఫలక్‌నుమా , ఫలక్‌నుమా టూ హైదరాబాద్‌, రామచంద్రాపురం టూ ఫలక్‌నుమా మధ్య సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

మరోవైపు సికింద్రాబాద్  రైల్వే స్టేషన్  బయట  టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో  అలర్ట్ అయిన  పోలీసులు... సికింద్రాబాద్  స్టేషన్ బయట  షాపులను క్లోజ్  చేయిస్తున్నారు పోలీసులు. అటు సికింద్రాబాద్ వైపు  వెళ్లే  ట్రాఫిక్ ను  మళ్లించారు. సికింద్రాబాద్ మీదుగా  వెళ్లే  పలు రైళ్లను  దారి మళ్లించారు.  రైల్వే స్టేషన్ లో విధ్వంసంతో  20 కోట్ల రూపాయల  ఆస్తి నష్టం  జరిగినట్లు అంచనా వేశారు. సికింద్రాబాద్  ఘటనపై  రైల్వే జీఎం  ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. 

సికిద్రాబాద్   కాల్పుల్లో ఒకరు మృతి

సికింద్రబాద్   రైల్వే స్టేషన్ ఆందోళనల్లో గాయపడిన 11 మంది ఆందోళనకారులు గాంధీలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో  ఛాతీలో బుల్లెట్ దిగిన ఒక వ్యక్తి  మరణించాడు. మరొక వ్యక్తికి కాలిలో బులెట్ దిగగా.. ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఒక ఆందోళనకారుడికి వెన్నెముక విరగడంతో బ్లడ్ ఎక్కిస్తున్నారు. మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉంది..

ఈ ఘటన దురదృష్టకరం: రేవంత్

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో  చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్ధితిపై టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా తీసుకున్న నిర్ణయం  ఫలితం ఇదని అన్నారు.  దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు, పాత విధానాన్నే కొనసాగించాలని రేవంత్ రెడ్డి  సూచించారు.

దేశ జ‌వాన్లతో కేంద్రం ఆడుకుంటోంది: కేటీఆర్

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో  చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్ధితి పైన తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు దేశంలో ఉన్న  నిరుద్యోగ సంక్షోభానికి నిదర్శనమని అన్నారు. ముందుగా దేశ రైతుల‌తో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంద‌ని, ఇప్పుడు దేశ జ‌వాన్లతోనూ ఆడుకుంటోంద‌ని కేటీఆర్ ఆరోపించారు. వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్షన్ గా మారింద‌ని కేటీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

రెండు సంవత్స రాల నుంచి రోడ్లపైన తిరుగుతున్నం: విద్యార్థి


నేను రంగారెడ్డి నుంచి వచ్చాను. మా మిత్రులందరూ కూడా ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన్రు. రెండ్రోజుల నుంచీ మేమంతా ఇక్కడే ఉన్నాం.  జూన్ 15 న ప్రెస్ మీట్ పెట్టారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ప్రెస్ మీట్ పెట్టి పరీక్ష క్యాన్సల్  చేశారు. ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ ని రద్దు చేశారు. 2019లో కరీంనగర్లో ఆర్మీ ర్యాలీ జరిగింది. ఆ తర్వాత 2021లో మేమంతా ఆర్మీకి సెలక్ట్ అవుతామని ఎదురుచూసినం. కానీ సంవత్సరమైంది. ఎగ్జామ్ లేదు. ఏం లేదు. నోటీసు ఇస్తున్నరు. రద్దు చేస్తున్నరు. మేం ఏడికెళ్లాలి.. అడిగేవాళ్లు లేరు. చెప్పేవాళ్లు లేరు మాకు. రెండు సంవత్సరాలైంది. కుక్కల్లెక్క తిరుగుతున్నం రోడ్లపైన. ఇప్పుడేమో డైరెక్టుగా పరీక్షనే తీసేసిండ్రు. 

ఆందోళనలతో రూ. 20 కోట్ల నష్టం

రైల్వే స్టేషన్ లో ఆందోళనలతో రైల్వే జీఎం  అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. రూ. 20 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా  వేసినట్లు సమాచారం. దీంతో  పోలీసులు రైల్వే స్టేషన్ ను ఖాళీ చేయిస్తున్నారు

మాకు భవిష్యత్తు లేకుండా చేశారు : ఆర్మీ అభ్యర్థులు 

తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారు.   ఇనిస్టిట్యూట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నావాళ్లు.  వాళ్లలో చాలా మంది హెల్త్ టెస్ట్ లు పాసయ్యారు.  భారత ఆర్మీ రిక్రూట్ మెంట్ కు సంబంధించి వైద్య పరీక్షలు కఠినంగా ఉంటాయని అటువంటివి తామంతా పాసయ్యామని యువకులు చెప్తున్నారు. మూడేళ్ల నుంచి  వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు అగ్నిపథ్ స్కీం తీసుకురావడం మాకు భవిష్యత్తు లేకుండా చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రత

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసంతో  కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.  నాంపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ తో పాటు ప్లాట్ ఫార్మ్ పై  పోలీసుల భద్రతను పెంచారు.

ఒకరి పరిస్థితి విషమం

సికింద్రబాద్  రైల్వే స్టేషన్ ఆందోళనల్లో గాయపడిన 9 మంది ఆందోళనకారులను గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.వీరిలో 8 మంది ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాంధీలో చికిత్స పొందుతున్న అతనికి  వైద్యులు సీపీఆర్  చేస్తున్నారని గాంధీ సూపరిండెంట్ తెలిపారు.

అన్ని రైల్వేస్టేషన్లకు భధ్రత పెంపు


సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితి నెలకొనడంతో  కేంద్రం అప్రమత్తమైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లకు భధ్రత పెంచింది. స్టేషన్ల వద్దకు భారీగా బలగాలను మోహరించాలని ఉన్నతాధికారులకు  ఆదేశాలు జారీ చేసింది.

పోలీసుల కాల్పులు.. పలువురికి గాయాలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యుద్ద వాతవరణం నెలకొంది. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు 15 రౌండ్లు కాల్పులు మొదలుపెట్టారు.  దీంతో ఆందోళనకారులు చెల్లాచేదురుగా వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో  అపస్మారక స్థితిలో పడిన ఓ యువకుడని చికిత్సకోసం తీసుకెళ్లారు పోలీసులు. 

సికింద్రాబాద్ లో కొనసాగుతోన్న ఆందోళన

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. ఉదయం 8.30గంటల టైంలో మొదలైన నిరసన  కొనసాగుతోంది. ఒక్కసారిగా ఆందోళన కారులు స్టేషన్ లోకి రావటంతో పరిస్థితి సీరియస్ గా మారింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే... రైల్వే ట్రాక్ పైకి వచ్చిన నిరసన కారులు... పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ట్రైన్లకు నిప్పుపెట్టారు. అప్పటికే స్టేషన్ లో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. వచ్చిపోయే ట్రైన్లతో స్టేషన్ అంతా హడావుడి ఉంది. ఒక్కసారిగా ఆందోళన కారులు దూసుకురావటంతో ఏం జరుగుతుందోనని... ప్రయాణికులు.. ఆందోళనలో పడిపోయారు. ఆందోళన కారులు వచ్చిరావటంతోనే ట్రైన్ లపై దాడిచేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగిపోయింది. ప్లాట్ ఫామ్ లపై ఉన్న ప్రయాణికులు స్టేషన్ బయటకు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక రైళ్లలోని ప్రయాణికులు కూడా దిగి బయటకు పరుగులు తీశారు.

 

పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు

 సికింద్రాబాద్ లో ఆందోళన కొనసాగుతోంది.   పోలీసులపై రాళ్ల వర్షం కురింపించారు ఆందోళనకారులు.  4 ట్రైన్స్ అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఆందదోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.  దాదాపు 8.30కు ప్రారంభైన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇతర స్టేషన్లకు రైళ్లు మళ్లింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో  అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందస్త జాగ్రత్తగా స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన అన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ కి రావాల్సిన కొన్ని రైళ్లను  ఇతర స్టేషన్ లకి మళ్లించారు. మద్యాహ్నాం తర్వాతే రైళ్ల రాకపోకల పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

రెండేళ్లుగా లేని రిక్రూట్ మెంట్ 

దాదాపు రెండేళ్ల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఏమీ లేకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితమే నిర్వహించాల్సిన ఆర్మీ ఎగ్జామ్ కూడా వాయిదా పడడంతో... ఈ ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. హాల్ టికెట్స్ ఇచ్చినా పరీక్ష నిర్వహించలేదని అభ్యర్థులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వారిలో త్వరలోనే కొందరికి ఏజ్ బార్ కూడా కానుండడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ అంశం తెరపైకి రావడంతో విషయం తేల్చుకుందాం అంటూ వివిధ రాష్ట్రాల నుంచి  అభ్యర్థులు హకీంపేట్ కి  వచ్చినట్టు సమాచారం.

NSUI కి ఎటువంటి సంబంధం లేదు: బల్మూరి వెంకట్

ఉదయం నిరసనకారులు జాతీయ జెండాలు  పట్టుకోవడం చూసి ఎన్ ఎస్ యూఐ  అనుకున్నారు. కానీ అది మాకు సంబంధం లేదని బల్మూరి వెంకట్ వీడియో ద్వారా వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో జరిగిన సంఘటనకు NSUI కి ఎటువంటి సంబంధం లేదు.  అగ్నిపత్ పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది, ఆ విద్యార్థులు ఆవేశానికి లోనయి ఈ ఘటనకు పాల్పడడం జరిగింది. ఈ సంఘటనకు NSUI కి ఎలాంటి సంబంధం లేదని,ఆ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే తాను పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా ఈ వీడియో ద్వారా చేస్తున్నానని. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించే కార్యకలాపాలను చేయవద్దని తన తోటి విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. తాను ఉదయం ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ కి వెళుతుండగా నన్ను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  తరువాత షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

ఏం చేయలేని స్థితిలో పోలీసులు

రెండు గంటలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. మెరుపు ధర్నాలతో పోలీసులు ఏం చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ లోని 1, 2,3 ప్లాట్ ఫాంలపై ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. రైళ్ల నుంచి జనం పరుగులు పెట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ స్థాయి ఆందోళనలను పోలీసులు ఊహించలేకపోయారు. రైల్వే ఆస్తులు చాలా వరకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్ లోని షాపులు ధ్వంసమయ్యాయి. 

 

 

బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు

ఆందోళనతో ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.  ఉదయం సమయం అవ్వడంతో సహజంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా విధ్వసంతో ప్యాసింజర్స్ దిక్కుతోచని స్థతిలో ఉన్నారు. రైల్వే స్టేషన్ బయట ఉన్న పలు బస్సులను కూడా ధ్వంసం చేశారు విద్యార్థులు. ఆందోళనలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. మెరుపు ధర్నాతో రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 

 

సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ అభ్యర్థులు, విద్యార్థులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లి పట్టాలపై బైఠాయించారు. రైల్వే ట్రాక్ పై ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. సేవ్ ఆర్మీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థులు  పట్టాలపై బస్తాలు, డబ్బాలు వేశారు. పలు చోట్ల పట్టాల మధ్య నిప్పు పెట్టారు. రైలు ముందు కదలకుండా అడ్డుకున్నారు. దీంతో పలు  రైళ్లను నిలిపివేశారు అధికారులు. 

ఇప్పటికే దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంపై నిరసనలు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి. బిహార్, యూపీ, హర్యానాలో రైళ్లు తగలబెడుతున్నారు. పలు చోట్ల రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కూడా ఈ నిరసన సెగ తగలడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 

అగ్నిపథ్‌‌ కాదు.. ఆవారా పథ్‌‌: టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు వివేకానంద, వెంకటేశ్‌‌ 

హైదరాబాద్‌‌, వెలుగు: దేశవ్యాప్తంగా యువత ను రోడ్లపైకి తెచ్చిన అగ్నిపథ్‌‌ పథకాన్ని కేంద్రం వెంటనే వాపస్ ​తీస్కోవాలని టీఆర్ఎస్‌‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్‌‌ డిమాండ్‌‌ చేశారు. అది అగ్నిపథ్‌‌ కాదు.. ఆవారా పథ్‌‌ అని విమర్శించారు. ఎమ్మెల్యేలు శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. రక్షణ శాఖ ప్రైవేటీకరణలో భాగమే ఈ అగ్నిపథ్‌‌ పథకమని మండిపడ్డారు. ‘‘ప్రధాని మోడీ విధానాలతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది. దేశంలో తిరుగుబాటు మొదలైంది. బండి సంజయ్‌‌ అజ్ఞానంతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌‌ చదువుతున్నారు” అని అన్నారు.

అగ్నిపథ్‌‌‌‌ను విత్‌‌‌‌డ్రా చేసుకోవాలె : ఆర్‌‌‌‌.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అగ్నిపథ్ స్కీంను వెంటనే విత్‌‌‌‌డ్రా చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌‌‌‌.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌ చేశారు. పోలీసు కాల్పుల్లో మరణించిన వారికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని బీసీ భవన్‌‌‌‌లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అగ్నిపథ్ స్కీంను యువత వ్యతిరేకిస్తోందని, ఆర్మీ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పాత విధానాన్నే కొనసాగించాలని కోరారు. అగ్నిపథ్‌‌‌‌పై నిరుద్యోగుల్లో అనేక భయాలు, ఆందోళనలు, అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, మల్లేష్ యాదవ్, రాజేందర్, వేముల రామకృష్ణ, డి.సదయ్య, ఎన్.అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల నిరసనలో సంఘ విద్రోహ శక్తులు: ఆప్‌‌‌‌ నేత ఇందిరా శోభన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌ రైల్వే స్టేషన్ విధ్వంసంలో సంఘ విద్రోహ శక్తుల పాత్ర ఉందనే అనుమానం కలుగుతోందని ఆమ్‌‌‌‌ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్‌‌‌‌ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ ఇందిరా శోభన్‌‌‌‌ అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతమంది స్టేషన్‌‌‌‌కు చేరుకుంటుంటే పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని శుక్రవారం ఆమె ఓ ప్రకటనలో ప్రశ్నించారు. యువకుల శాంతియుత నిరసనలోకి, ఇతర శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించాయన్న అనుమానం వ్యక్తం చేశారు. వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అమాయక యువకులపై పోలీసులు కాల్పులు జరపడం సరికాదని, అదే సమయంలో ప్రజా ఆస్తుల విధ్వంసాన్ని కూడా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థ రాజకీయాలే కారణమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అగ్నిపథ్ స్కీమ్‌‌‌‌ను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఘటనలో గాయపడిన వారికి, మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలని కోరారు.