కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియా అథ్లెట్‌‌ గుల్వీర్‌‌ సింగ్‌

కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియా అథ్లెట్‌‌ గుల్వీర్‌‌ సింగ్‌
  • 10 వేల మీటర్ల పరుగులో అరుదైన ఘనత

గ్లాస్గో: ఇండియా అథ్లెట్‌‌ గుల్వీర్‌‌ సింగ్‌‌.. కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం రాత్రి జరిగిన మెన్స్‌‌ 10 వేల మీటర్ల పరుగును గుల్వీర్‌‌ సింగ్‌‌ 27 ని.49.78 సెకన్లలో పూర్తి చేసి రజత పతకం సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ విభాగంలో పతకం నెగ్గిన తొలి ఇండియన్‌‌ అథ్లెట్‌‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ గేమ్స్‌‌లో అథ్లెటిక్స్‌‌లో ఇండియాకు ఇది రెండో సిల్వర్‌‌ మెడల్‌‌ కావడం విశేషం.

మెన్స్‌‌ హైజంప్‌‌లో ఇప్పటికే సర్వేష్‌‌ కుశారే రజతం సాధించిన సంగతి తెలిసిందే. స్కాట్స్‌‌ టౌన్‌‌ స్టేడియంలో భారీ వర్షం కురుస్తున్నా గుల్వీర్‌‌ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. యూఎస్‌‌లోని స్కాట్‌‌ సిమన్స్‌‌ వద్ద శిక్షణ తీసుకున్న గుల్వీర్‌‌ తొలి 5 వేల మీటర్లు నెమ్మదిగా ముగించాడు.

2023 వరల్డ్‌‌ చాంపియన్‌‌ డేనియల్‌‌ ఎబెన్యోతో సహా పలువురు ఆఫ్రికా రన్నర్లు బరిలో ఉన్నా.. గుల్వీర్‌‌ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగాడు. దాంతో చివరి 5 వేల మీటర్ల రన్‌‌లో కొన్ని ల్యాప్‌‌ల్లో అద్భుతంగా పరుగెత్తి శక్తివంతమైన ఫైనల్‌‌ కిక్‌‌తో ఐల్‌‌ ఆఫ్‌‌ మ్యాన్‌‌కు చెందిన డేవిడ్‌‌ ముల్లార్కీని స్వల్ప తేడాతో అధిగమించి రెండో ప్లేస్‌‌లో నిలిచాడు.

కై రాబిన్సన్‌‌ (ఆస్ట్రేలియా, 27:48.93 సెకన్లు), ముల్లార్కీ (27:50.28 సెకన్లు) స్వర్ణం, కాంస్యం నెగ్గారు. ఇక 1986 కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ తర్వాత మెన్స్‌‌ 10 వేల మీటర్లలో ఏ ఆఫ్రికన్‌‌ అథ్లెట్‌‌ కూడా పతకం సాధించకపోవడం ఇదే తొలిసారి. విమెన్స్‌‌ హైజంప్‌‌లో ఆసియా చాంపియన్‌‌ పూజా సింగ్‌‌ 1.82 మీటర్లను అధిగమించడంలో విఫలమైంది. భారీ వర్షం కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. 

‘పతకం గెలవడం ఎప్పుడూ మంచి అనుభూతినిస్తుంది. రేసు బాగా జరిగింది, వర్షం పడింది. కానీ పతకం గెలిచినప్పుడు వర్షం, ఎండ, వేడి, మరేదైనా సరే పెద్దగా పట్టించుకోనక్కరలేదు. నేను అంతా దేవుడికి వదిలేశాను. రేసుకు ముందు నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని వేడుకున్నా. నా కుటుంబం నిద్రపోతూ ఉండాలి. రేసు ఎప్పుడనే విషయం వాళ్లకు చెప్పలేదు. వారిని ఇబ్బందిపెట్టను. వాళ్లు తర్వాత ఎలాగూ చూస్తారు. ప్రస్తుతం నా దృష్టంతా 5కే రన్‌‌పైనే ఉంది. - గుల్వీర్‌‌

ఫైనల్లో తజిందర్‌‌ పాల్‌‌
ఇండియా షాట్‌‌ఫుట్‌‌ అథ్లెట్లు గేమ్స్‌‌లో సత్తా చాటారు. మెన్స్‌‌ కేటగిరీలో తజిందర్‌‌పాల్‌‌ సింగ్‌‌ అటోమేటిక్‌‌ మార్క్‌‌ అయిన 20 మీటర్లను ఈజీగా అధిగమించాడు. తొలి ప్రయత్నంలో ఇనుప గుండును 19.93 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలో 21.14 మీటర్ల దూరం సాధించడంతో మూడో ప్రయత్నం చేయకుండానే పోటీ నుంచి తప్పుకున్నాడు. ఓవరాల్‌‌గా ఇది రెండో ఉత్తమ దూరంగా రికార్డైంది. గ్రూప్‌‌–బి క్వాలిఫయింగ్‌‌లో సమర్‌‌దీప్‌‌ సింగ్‌‌ తొలి ప్రయత్నంలో 19.95 మీటర్లు విసిరాడు.

రెండో త్రోలో 19.75 మీటర్లు సాధించగా, మూడో ప్రయత్నం విఫలమైంది. రెండు గ్రూప్‌‌ల్లో మొత్తం 15 మంది పోటీపడగా గిల్‌‌ ఐదో స్థానంతో ఫైనల్స్‌‌కు చేరాడు. మరోవైపు జాతీయ రికార్డు గ్రహీత అనిమేశ్‌‌ కుజుర్‌‌.. 200 మీటర్ల రన్‌‌లో సెమీస్‌‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన హీట్స్‌‌–4లో అనిమేశ్‌‌ 20.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఓవరాల్‌‌గా ఏడో ప్లేస్‌‌లో నిలిచాడు. మొత్తం ఫాస్టెస్ట్‌‌ 16 మంది ఫైనల్స్‌‌కు అర్హత సాధించారు. 

పతక పంచ్‌‌లు
కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో ఇండియా బాక్సర్ల పంచ్‌‌ అదురుతోంది. సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, సచిన్‌‌ సివాచ్‌‌, అంకుష్‌‌, నరేందర్‌‌ అద్భుత విజయాలతో తమ విభాగాల్లో సెమీస్‌‌లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన విమెన్స్‌‌ 51 కేజీ క్వార్టర్స్‌‌లో సాక్షి 5–0తో కైలిన్‌‌ ఫ్రయర్స్‌‌ (ఐర్లాండ్‌‌)పై గెలిచింది. తన పొడవు, రీచ్‌‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న సాక్షి బలమైన పంచ్‌‌లతో బౌట్‌‌ను ఏకపక్షంగా మార్చేసింది.

70 కేజీ క్వార్టర్స్‌‌లో అరుంధతి 3–1తో మోర్గాన్‌‌ హెండర్సన్‌‌పై చెమటోడ్చి గెలిచింది. మెన్స్‌‌ 60 కేజీల్లో సచిన్‌‌ 5–0తో ట్రెజర్‌‌ మోరెమి (బోట్స్‌‌వానా)ను చిత్తు చేశాడు. ఐదుగురు జడ్జిలు ఏకగ్రీవంగా సచిన్‌‌కు పాయింట్లు ఇచ్చారు. మెన్స్‌‌ 80 కేజీల్లో అంకుష్‌‌ పంగల్‌‌ 5–0తో జేడ్‌‌ మికాక్‌‌ (సీషెల్స్‌‌)పై, 90+కేజీల్లో నరేందర్‌‌ బెర్వాల్‌‌ 3–2తో మైకేల్‌‌ సీకో (సమోవా)పై గెలిచారు.

నిరాశపర్చిన సాజన్‌‌
ఇండియా స్టార్‌‌ స్విమ్మర్‌‌ సాజన్‌‌ ప్రకాశ్‌‌ గేమ్స్‌‌లో నిరాశపర్చాడు. మెన్స్‌‌ ఫ్రీస్టయిల్‌‌ హీట్స్‌‌లో సాజన్‌‌ 1:51.99 సెకన్ల టైమింగ్‌‌తో ఐదో ప్లేస్‌‌లో నిలిచాడు. దాంతో ఫైనల్‌‌ ఎనిమిది మందిలో స్థానం దక్కించుకోలేకపోయాడు. అనీశ్‌‌ గౌడ (1:51.64 సెకన్లు) 18వ ప్లేస్‌‌లో నిలిచాడు. 

50 మీటర్ల బటర్‌‌ఫ్లయ్‌‌ ఈవెంట్‌‌లోనూ సాజన్‌‌ ఫైనల్‌‌ చేరడంలో ఫెయిలయ్యాడు. పారా స్విమ్మింగ్‌‌ ఎస్‌‌–750 మీటర్ల ఫ్రీస్టయిల్‌‌లో చైతన్య విశ్వాస్‌‌ కులకర్ణి, సుయాష్‌‌ నారాయణ్‌‌ జాదవ్‌‌ ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు. హీట్స్‌‌లో కులకర్ణి, జాదవ్‌‌ వరుసగా నాలుగు, ఐదో ప్లేస్‌‌లో నిలిచారు.