ఇండియన్ కాన్సులేట్​కు నిప్పు

ఇండియన్ కాన్సులేట్​కు నిప్పు

న్యూయార్క్: అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. ఫర్నీచర్​కు నిప్పు పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల మధ్య ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఖలిస్తానీ మద్దతుదారులు ట్విట్టర్​లో పోస్టు చేశారు. యూఎస్ గవర్నమెంట్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. కాన్సులేట్ ఆఫీస్ కాలిపోతున్న విజువల్స్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. హింస.. హింసను ప్రేరేపిస్తుందనే కామెంట్లతో పాటు పోయిన నెల కెనడాలోని గురుద్వారా ముందు హత్యకు గురైన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్​కు సంబంధించిన పేపర్ కటింగ్స్​ను కూడా వీడియోలో పెట్టారు.. 

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : యూఎస్

దాడిపై యూఎస్‌‌ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ‘‘శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్​పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. యూఎస్​లోని డిప్లమాటిక్ ఫెసిలిటీస్, ఫారిన్ డిప్లామాట్స్​పై దాడిని క్రిమినల్ అఫెన్స్​గా పరిగణిస్తాం. ఆదివారం తెల్లవారుజామున 1:30 నుంచి 2:30 మధ్య ఈ దాడి జరిగింది. శాన్​ఫ్రాన్సిస్కో ఫైర్ డిపార్ట్​మెంట్ వెంటనే స్పందించి మంటలు ఆర్పేసింది. ఖలిస్తానీ మద్దతుదారులు జరిపిన దాడిలో ఎవరూ గాయపడలేదు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మరింత విధ్వంసం జరగకుండా ఆపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని మిల్లర్ హామీ ఇచ్చారు.