రెండో టీ20లో భారత్ విజయం

రెండో టీ20లో భారత్ విజయం

నాగపూర్: ఆస్ట్రేలియాతో ఇవాళ జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 8 ఓవర్లలో 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో అలవోకగా గెలిచింది. దీంతో మూడు మ్యాచుల సిరీస్ 1–1 తో సమం అయ్యింది. మైదానం చిత్తడిగా ఉండటంతో ఈ మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు సాధించింది. ఆసీస్ నుంచి బరిలోకి దిగిన మాథ్యూ వేడ్ 20 బంతుల్లో 43 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 14 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ 4, మ్యాక్స్ వెల్ 0, టిమ్ డేవిట్ 2, స్మిత్ 7 పరుగులు మాత్రమే చేశారు. ఇక టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 2, బుమ్రా 1 వికెట్ తీసుకున్నారు. 

అనంతరం  91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత తరఫున... కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 46 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ 1, చివర్లో వచ్చిన దినేశ్ కార్తిక్ రెండు బంతుల్లో 10 పరుగులు చేశాడు. దీంతో భారత్ నాలుగు బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికొస్తే ఆడమ్ జంపా 3, కమిన్స్ 1 వికెట్ తీశారు. భారత్, ఆసీస్ చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ ను డిసైడ్ చేసే ఫైనల్ మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనుంది.