BAN vs IND: ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్‌ వాయిదా.. వచ్చే ఏడాది ఎప్పుడంటే..?

BAN vs IND: ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్‌ వాయిదా.. వచ్చే ఏడాది ఎప్పుడంటే..?

భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడబోయే వన్డే, టీ20 సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లో వైట్-బాల్ పర్యటనను రీ  షెడ్యూల్ చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) శనివారం (జూలై 5) ప్రకటించింది. మూడు వన్డేలు, మూడు ట్వంటీ 20  మ్యాచ్‌ల సిరీస్ ను ఆగస్టు 2025 నుండి సెప్టెంబర్ 2026కి మార్చారు. అంతర్జాతీయ క్రికెట్ నిబద్ధతలు,రెండు జట్ల షెడ్యూల్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని.. రెండు బోర్డుల మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

పర్యటనకు సంబంధించి సవరించిన తేదీలు, మ్యాచ్‌లను త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పుకొచ్చింది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగానే ఈ సిరీస్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనకు భారత కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సిరీస్ ను ఇరు జట్ల బోర్డులు వాయిదా వేసినట్టు అధికారికంగా తెలిపారు. 

బంగ్లాతో సిరీస్ దాదాపుగా రద్దు కావడంతో భారత్ తర్వాత ఆడబోయే సిరీస్ గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా వన్డే సిరీస్ పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం రోహిత్, కోహ్లీలే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్, కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వీరిద్దరూ ఒకేసారి టీ20, వన్డే సిరీస్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వీరిద్దరినీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడూ వన్డేల్లో చూడాలా అని ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్ సిరీస్ రద్దు కావడంతో టీమిండియా తమ తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమవుతుంది.

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది.